ఉద్యమ హోరు | United agitation become severe in ysr district | Sakshi
Sakshi News home page

ఉద్యమ హోరు

Published Sat, Nov 2 2013 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM

United agitation become severe in ysr district

సాక్షి, కడప : జిల్లాలో సమైక్య ఉద్యమం వాడి వేడిగా సాగుతోంది.  అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలాన్ని వృథాగా పోనియ్యమని జిల్లా వాసులు ప్రతిన బూనారు. ఆయన విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి అక్కడే సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. కడపలో పారా మెడికల్ ఉద్యోగులు, మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ర్యాలీ నిర్వహించి ఎర్ర గొడుగులతో నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో సమైక్య దినాన్ని పాటించారు. పార్టీ పిలుపు మేరకు పలుచోట్ల సర్పంచులు సమైక్య తీర్మానాలు చేసి రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి పంపారు. కడపలో నరకాసురుడి దిష్టిబొమ్మను తగులబెట్టారు.  విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పోరు ఆగదని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్ని వర్గాల ప్రజలు హెచ్చరించారు.
 
  జమ్మలమడుగులో దిగువపట్నం కాలనీకి చెందిన వైఎస్సార్‌సీపీ  నేతలు జయపాల్, సింగరయ్య ఆధ్వర్యంలో 20మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆది, నియోజకవర్గ సమన్వయకర్తలు తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, వైసీపీ నేత హనుమంతరెడ్డి సంఘీభావం తెలిపారు.  వాసవి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు ర్యాలీ  నిర్వహించి  94 ఆకారంలో రోడ్డుపై నిరసన తెలుపుతూ దీక్షలకు మద్దతు తెలిపారు.
 
  రైల్వేకోడూరులో వైసీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం రాఘవరాజపురం సర్పంచ్ సుబ్బమ్మ ఆధ్వర్యంలో సమైక్య తీర్మానాలు చేసి రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి పంపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, అధికార ప్రతినిధి సుకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.  ఆదాంసాహెబ్, సుకుమార్‌రెడ్డి నేతృత్వంలో 25 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు.
 
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు డాక్టర్ అబ్రహం థామస్ బాదం మొక్కను నాటారు. అయితే అది ఎండిపోయి మళ్లీ ఇటీవలే చిగురించింది. దాని కింద ఆయన కుమారుడు సామేల్‌తోపాటు పలువురు కూర్చొని రిలే దీక్షలు చేపట్టారు.  రాజంపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా వైసీపీ నేతలు పోలా శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే సోదరుడు ఆకేపాటి అనిల్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోనియా దిష్టిబొమ్మను దహనం  చేశారు. విద్యార్థి జేఏసీ నేత గుణవర్మ నేతృత్వంలో సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.
 
  కడపలో  నియోజకవర్గ సమన్వయకర్త అంజద్‌బాష, అధికార ప్రతినిధి అఫ్జల్‌ఖాన్‌తో సహా 50 మంది రిలేదీక్షల్లో పాల్గొన్నారు.  జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్జీఓలు, ఉద్యోగులు  కొవ్వొత్తుల  ర్యాలీ చేపట్టారు. పారా మెడికల్ ఉద్యోగులు, మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ఎర్రగొడుగుతో నిరసన తెలిపారు. ఏపీ రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. వైసీపీ నేతలు  సాయంత్రం నరకాసుర వధ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
 
  బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల పట్టణంలో కవలకుంట్లకు చెందిన వైసీపీ కార్యకర్తలు 10 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. దీక్షలు 70వ రోజుకు చేరుకున్నాయి. వీరికి వైసీపీ నేతలు చిత్తా రవిప్రకాశ్‌రెడ్డి, కరెంటు రమణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. బద్వేలులో అన్ని డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ విద్యాసంస్థలకు చెందిన 15 వేల మంది విద్యార్థులు  ర్యాలీ చేపట్టి నాలుగురోడ్ల కూడలిలో వర్షంలో తడుస్తూ నిరసన తెలిపారు.
 
  పులివెందులలో వైసీపీ నేతృత్వంలో 10 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ అవినాష్‌రెడ్డి, వైసీపీ ముఖ్య నేతలు ఈసీ గంగిరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. తెలుగు తల్లి విగ్రహాన్ని పట్టణంలో ఊరేగించారు. పూల అంగళ్ల కూడలిలో తెలుగు తల్లికి రాష్ట్ర విభజన సెగ తగలకూడదంటూ 101 బూడిద గుమ్మడికాయలతో మహిళలు దిష్టి తీశారు. వినూత్న రీతిలో బోనాలు నెత్తిన పెట్టుకుని కార్మికులు, వరి చెత్త తలపై  పెట్టుకుని రైతులు, విభజన వల్ల కలిగే నష్టాలను పలకలపై రాసుకుని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలు పంచెకట్టు వేషధారణలో చెవిలో పూలు పెట్టుకుని ఆందోళన చేపట్టారు.
 
  కమలాపురంలో సంబటూరు సర్పంచ్ శివారెడ్డి నేతృత్వంలో 10 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి సంఘీభావం తెలిపారు. సర్పంచులు సమైక్య తీర్మానం చేసి రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి తీర్మాన ప్రతులు  పంపారు.
 
  రాయచోటిలో  ఎండ్లపల్లె, మాధవరం, గొర్లముదివీడు, కాటిమాయకుంట, పరిగె గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు మాజీ ఎంపీపీ వెంకటసుబ్బారెడ్డి, సైకం నాగిరెడ్డి ఆధ్వర్యంలో 30 మంది దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. దేవపట్ల హరినాథరెడ్డి డిగ్రీ కళాశాల విద్యార్థులు నేతాజీ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు.
 
   ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యులు పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్యవైశ్యుల సంఘం నాయకుడు బుశెట్టి రామ్మోహన్, మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో  11 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పుట్టపర్తి సర్కిల్‌లో సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం  చేశార
  మైదుకూరులో వేదవ్యాస విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ర్యాలీ చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement