మహిళ ప్రదక్షణలు చేస్తున్నట్లు వీడియో కెమెరాల్లో చిక్కిన దృశ్యం
నెల్లూరు, ఆత్మకూరు: పట్టణంలోని అమ్మవారి ఆలయాల్లో శరన్నవ రాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. 10వ రోజు విజయదశమి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలోని పలు అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రోజులుగా పట్టణంలోని జ్వాలాముఖి అమ్మవారి ఆలయంలో తాళాలు వేసిన తలుపులు వేసినట్లుగానే ఉండగా, అర్ధరాత్రి వేళ ఓ మహిళ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు చేస్తుందని, గజ్జెల శబ్ధం వినిపిస్తోందని పుకార్లు షికార్లు చేశాయి. దుర్గాష్టమి రోజు రాత్రి నుంచి ఇలా జరుగుతుందని పలువురు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు.
ఆలయ పూజారి కృష్ణప్రసాద్ సైతం తనకు ఇలా శబ్ధాలు వినిపించాయని చెప్పడంతో కొందరు యువకులు తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. పసుపురంగు వస్త్రాలు ధరించిన ఓ మహిళ ముఖం కనిపించకుండా ఆలయ ప్రాంగణంలో అర్ధరాత్రి ప్రదక్షిణలు చేస్తున్న దృశ్యాల వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం పలు టీవీ జర్నలిస్టులు ఆలయానికి చేరుకుని భక్తుల అభిప్రాయాలను చిత్రీకరిస్తుండడంతో అక్కడ సందడి నెలకొంది. మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారన్న వాదనలు ఓ వైపు వినిపిస్తున్న భక్తి మార్గంలో ఉండే పలువురు అమ్మవారి శక్తిగా దీనిని అభివర్ణిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment