‘మల్లీశ్వరి’ సినిమాలో నటుడు వెంకటేశ్ పాత్ర పేరు ప్రసాద్.. ఆయనకు వయసు వచ్చినా వివాహం కాలేదు.. సంబంధాలు చూసినా కుదరలేదు.. దీంతో ఆయనను అందరూ ‘పెళ్లి కాని ప్రసాద్’ అని పిలుస్తారు. ‘పెళ్లెప్పుడవుతుందో బాబో.. పిల్లయాడుందో బాబో’ అనే పాట ఓ సినిమాలో ఉంది.. ఇలా ఉంది ప్రస్తుతం యువకుల పరిస్థితి.
యువకులు తమ స్థాయికి తగ్గ వధువు కావాలని కోరుకుంటున్నారు.. అమ్మాయిలు తన స్థాయికి మించిన వరుడు కావాలని ఆశిస్తున్నారు... దీంతో యవకులకు పెళ్లి కావడం చాలా కష్టంగా మారింది... దీనివల్ల యువత వయసు పెరిగిపోతోంది.. చూసీ చూసీ విసిగి వేసారి చివరకు సర్దుకుపోతేనే వివాహం జరుగుతోంది.
జిల్లాకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడు నెలకు రూ.50 వేల వేతనం తీసుకుంటున్నాడు. రెండేళ్ల నుంచి పెళ్లి చేసుకుందామని తిరుగుతున్నాడు. 20 దాకా సంబం«ధాలు చూశాడు. అమ్మాయి తల్లిదండ్రులు రూ.50 వేలు సిటీలో ఏమి సరిపోతుంది, ఎలా జీవనం సాగిస్తారని అంటున్నారని అతను చెబుతున్నాడు. ఇది ఆయన పరిస్థితి మాత్రమే కాదు. ఇలా చాలా మంది యువకులు పెళ్లి కోసం తంటాలు పడుతూ మ్యారేజ్‌బ్యూరోలను ఆశ్రయిస్తున్నారు.
ఆయన ప్రభుత్వ ఉద్యోగి. రిటైర్డ్‌మెంట్‌కు మూడు నెలలు సమయం ఉంది. ఇద్దరు కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి వివాహం చేసేందుకు రెండేళ్ల నుంచి సంబం«ధాలు చూస్తున్నాడు. పిల్లలకు వివాహాలు చేసి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుకుందామనుకుంటే కల్యాణ గడియలు రావడం లేదు. ఈ పరిస్థితి అతని ఒక్కడిదే కాదు. పెళ్ళీడుకొచ్చిన కొడుకులు ఉన్న తల్లిదండ్రులందరిదీ. ఒకప్పుడు ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులకు గుండెల మీద భారంగా ఉండేది. పెళ్లి చేసి ఒకరి చేతిలో పెట్టాలంటే ఎన్నో సమస్యలు. కాలం మారింది. ఇప్పుడు కొడుకుల వివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. యువకులకు కల్యాణ గడియలు సమీపించడం లేదు. అనేక కారణాలతో సంబంధాలు కుదరక, లక్షల మంది యువకులు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు.
కాశినాయన : కొడుకే పుట్టాలని తమ ఇష్టదైవాలను కోరుకున్న తల్లిదండ్రులు.. ఇప్పుడు వారిని ఓ ఇంటి వారిని చేయడానికి కనిపించిన దేవునికల్లా మొక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీవిత కాలం కష్టపడి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేసిన తర్వాత.. పెళ్లి చేస్తే ఓ పనైపోతుందనుకుంటే ఎక్కడా సంబంధాలు కుదరడం లేదు. యువకుల సంఖ్యకు తగ్గట్టుగా యువతులు లేకపోవడం, ఉద్యోగం వచ్చి స్థిరపడే వరకు పెళ్లి ప్రస్తావన రాకపోవడం, అబ్బాయిల విషయంలో అమ్మాయిలు రాజీ పడకపోవడం తదితర కారణాలతో పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరుగుతోంది.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 28,82,469 మంది జనాభా ఉన్నారు. ఇందులో 14,51,777 మంది పురుషులు, 14,30,692 మంది స్త్రీలు ఉన్నారు. 9,94,699 మంది అక్షరాస్యత కలిగిన పురుషులు, 7,22,067 మంది అక్షరాస్యత కలిగిన స్త్రీలు ఉన్నారు. దాదాపు 15000 మంది పెళ్లి కాని అబ్బాయిలు ఉన్నట్లు మ్యారేజ్‌బ్యూరోలు చెబుతున్నారు. జిల్లాలో 1000 మంది మగపిల్లలకు 900 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. దీంతో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. జిల్లాలో 35కు పైగా మ్యారేజ్‌బ్యూరోలు ఉన్నాయి. పాతిక మంది పెళ్లిళ్ల పేరయ్యలు ఉన్నారు.
గతంలో ఇలా ఉండేది
గతంలో అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోకుండా పెళ్లి ఖరారు చేసే వారు. ఇప్పుడు అమ్మాయిలు ‘ఊ’ అంటేనే పెళ్లి చూపులు, అమ్మాయికి అబ్బాయి నచ్చితేనే వివాహం. ప్రస్తుతం అంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అబ్బాయిలు ఆస్తి పరుడేనా, ప్రొఫెషనల్ కోర్సు చేసి ఉండాలని కోరుకుంటున్నారు. మరోవైపు అబ్బాయిలు చదువుకు తగ్గ ఉద్యోగం లేకపోవడం, ప్రైవేటు రంగాల్లో ఉపాధి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో యువకులకు పెళ్లి సంబంధాలు కష్టమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే యువకులకు పెళ్లి మరీ కష్టమవుతోంది. ఎంత ఆస్తి ఉన్నా పల్లెటూరులో తమ అమ్మాయి ఉండటం కష్టమని అమ్మాయి తల్లిదండ్రులు తెగేసి చెబుతున్నారు. ఎవరైనా అబ్బాయికి సంబంధం వస్తే అబ్బాయి ఒక్కడే ఉన్నాడా, అతనికి అక్కాచెల్లెళ్లు ఉన్నారా అంటూ విచారణ చేస్తున్నారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కొంత మంది సంబంధాలు చూసే పెద్దమనుషులు ఉండేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది.
ఎలా పోషించాలబ్బా..
అభ్యర్థులు ఎక్కువ. గవర్నమెంటు ఉద్యోగాల భర్తీ తక్కువ. సాఫ్ట్‌వేర్ రంగం పడిపోయింది. ప్రైవేటు సంస్థల్లో అరకొర జీతాలు. వ్యాపారం చేయాలంటే పెట్టుబడి లేకపోయే. పర్యవసానంగా జీవితంలో స్థిరపడటం గగనమైపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని ఎలా పోషించాలని మథన పడుతున్నారు. దీంతో సమయాన్ని పొడిగించుకుంటూ పోతున్నారు.
వివక్షపోతేనే పెళ్లిళ్ల కష్టాలు దూరం
ఆడపిల్లలను చదివించడం, పెద్ద చేయడం, సంరక్షించడం, పెళ్లి చేయడం భారమైందని కొంత మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో చట్టవిరుద్ధమైన గర్భస్థశిశు లింగనిర్ధారణ చేయించి.. ఆడపిల్ల అయితే భ్రూణహత్యలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. యువతి, యువకుల నిష్పత్తిలో తేడాలకు ఇది ప్రథమ కారణం. 1000 మంది పురుషులకు 900 మంది స్త్రీలు ఉన్నారు. సమాజంలో మార్పులు వచ్చి స్త్రీ, పురుషుల మధ్య నిష్పత్తి సమానంగా ఉంటేనే అబ్బాయిలకు సకాలంలో పెళ్లిళ్లు అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
పెరిగిన వివాహ వయసు
చదువులు, ఉద్యోగాలు, జీవితం పదిలంగా ఉండాలంటూ.. యువతీ యువకులు సరైన సమయంలో పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. యువతులకు 23–25 ఏళ్ల వయసు, యువకులకు 28–30 ఏళ్ల తర్వాతనే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ఉద్యోగం ఉన్న అబ్బాయిలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఉద్యోగాలు లేక పెళ్లిళ్లు కాక పెళ్లి కాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగింది. పెళ్లికాని ప్రసాద్‌లకు పెళ్లి కావాలంటే మార్గం ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా అమ్మాయి, అబ్బాయిలు ఇష్టపడి పెళ్లి చేసుకుంటేనే వివాహాలు అవుతాయి. ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయికి ఉద్యోగం ఉండాలనే కోరికను కొంత వరకు మార్చుకుని.. ప్రస్తుత పరిస్థితికి తగ్గుట్టుగా ఆలోచిస్తే మార్పు రావచ్చు. ఇప్పటికైనా తల్లిదండ్రులు అబ్బాయి, అమ్మాయిల పెళ్లి విషయంలో సడలింపులకు తావిస్తేనే పెళ్లికాని ప్రసాద్‌లకు పెళ్లిళ్లు అవుతాయి. కుమార్తె, కుమారులు కలిగిన తల్లిదండ్రుల వైఖరి కూడా కొంత విచిత్రంగా ఉంటోంది. తమ అమ్మాయికి ఉద్యోగం ఉన్న వరుడు కావాలని కోరుకుంటారు. తమ కుమారుడికి ఉద్యోగం లేకపోయినా.. కోడలు రావాలని ఆశపడుతుంటారు. ఇలా వీరు రెండు విధాలుగా కోరుకోవడం కూడా సమస్యకు కారణమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment