వియవాడ సిటీ, న్యూస్‌లైన్ : విజయవాడ నలంద విద్యానికేతన్‌లో ‘సాక్షి’ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించిన స్పె ల్ బీ రెండో రౌండ్ పరీక్షకు విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది సెంటర్లలో లైవ్ టెలీకాస్ట్ ద్వారా హైదరాబాద్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. నగరంలో జరిగిన పరీక్షకు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 525 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఒకటి, రెండు తరగతుల వారిని మొదటి గ్రూపుగా, మూడు, నాలుగు తరగతుల వారిని రెండో గ్రూపుగా, 5 నుంచి 7వ తరగతి వారిని మూడో గ్రూపుగా, 8 నుంచి 10వ తరగతి వారిని నాలుగో గ్రూపుగా నిర్ణయించి పరీక్షలు నిర్వహించారు. అర్ధ గంటలో 30 పదాలకు స్పెల్లింగ్స్ రాయాల్సి ఉంది. గతంలో జరిగిన మొదటి రౌండ్‌లో ఉత్తీర్ణులైనవారు సెకం డ్ రౌండ్ పరీక్షలకు హాజరయ్యారని ‘సాక్షి’ విజయవాడ బ్రాంచి మేనేజర్ సూర్యనారాయణ తెలిపారు. సెకండ్ రౌండ్‌లో ఉత్తీర్ణులైన వారికి జోనల్ స్థాయిలో విజయవాడలో ఓరల్ పరీక్ష నిర్వహిస్తామని ఆయన చెప్పారు.