అన్నదాతను అక్కడా ముంచేశారు | Untimely rains natural disasters | Sakshi
Sakshi News home page

అన్నదాతను అక్కడా ముంచేశారు

Published Mon, Jan 25 2016 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 PM

Untimely rains natural disasters

 సాక్షి ప్రతినిధి, ఏలూరు :అకాలవర్షాలను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే దశలోనూ అన్నదాత నిలువునా మునిగిపోయాడు. మిల్లర్లు, దళారుల మాయాజాలం, అధికారుల అవినీతి వెరసి ఖరీఫ్‌లో కష్టపడి పండించిన పంటను రైతు అయినకాడికి తక్కువ ధరకు అమ్మేసుకున్నాడు. 75 కేజీల బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.1087.50 కాగా, అధిక శాతం మంది రైతులు బస్తాను రూ.600 నుంచి గరిష్టంగా రూ.850కే అమ్మేసుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
 
  కేంద్ర ప్రభుత్వం లెవీ సేకరణను పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఖరీఫ్ సీజన్ నుంచి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి కొనుగోళ్లు జరిపి మిల్లింగ్ కోసం మిల్లర్లకు పంపాలి. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 305 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందిరాక్రాంతి పథకం ద్వారా 150, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 150 కేంద్రాలను, మరో ఐదు కేంద్రాలను మార్కెటింగ్ సొసైటీల ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాటు చేశారు.
 
 జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో దాదాపు 12లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రాథమిక అంచనా వేశారు. అయితే సరిగ్గా దిగుబడి చేతికొచ్చే దశలో గత నవంబర్‌లో కురిసిన అకాలవర్షాలకు పంట దెబ్బతింది. దిగుబడులపై ప్రభావం చూపించింది.  భారీవర్షాలకు వరిపంట తడిసి ముద్దవడంతో సుమారు రెండున్నర లక్షల మెట్రిక్ ధాన్యం రంగు మారిందని అధికారులే ప్రకటించారు. పంట నీటిలో నానడంతో ధాన్యం మొలకలు రావడం, రంగు మారే పరిస్థితి ఏర్పడింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాల్లో 17శాతం లోపు తేమ ఉంటేనే  కొనుగోలు చేయాలనే నిబంధనలను విధించారు.
 
 ఇక రంగు మారిన ధాన్యంపై ప్రభుత్వం చివరి వరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో ప్రభుత్వ కేంద్రాల్లో పెద్దగా కొనుగోళ్లు జరగలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు అయినకాడికి దళారులకు, మిల్లర్లకు అమ్మేసుకున్నారు.75 కేజీల బస్తాను రూ.1087.50కు అమ్ముకోవాల్సిన రైతులు రూ.600 నుంచి రూ.850కే దళారులకు అమ్మేసుకున్నారు. మొత్తంగా బస్తాకు రూ.300 నుంచి రూ.500 వరకు నష్టాన్ని చవిచూశారు. ఇదే సందర్భంలో మిల్లర్లు, దళారులు, కొనుగోళ్ల కేంద్రాల నిర్వాహకులు మాత్రం కుమ్మక్కై అందినకాడికి దోచేసుకున్నారు.
 
 లెక్కలు తారుమారు
 రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నేరుగా కొనుగోలు చేయకపోవడంతో దళారులు, మిల్లర్లే రైతుల నుంచి అతి తక్కువ ధరకు కొన్నారు. కానీ ఆ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్టు తప్పుడు పత్రాలు సృష్టించారు. రూ.600కు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రూ.1087కి కొన్నట్టు లెక్కలు తారుమారు చేసి రూ.కోట్లు నొక్కేశారు. చివరికి తడిసిన ధాన్యాన్ని కూడా నిబంధనల మేరకు తేమ శాతం తక్కువగానే ఉందని చూపించి కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు జరిపారు.
 
 వాస్తవానికి జిల్లావ్యాప్తంగా 80 శాతం మంది రైతులు నేరుగా దళారులు, మిల్లర్లకే ధాన్యం అమ్మేసుకోగా, అధికారులు మాత్రం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 10లక్షల97వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. సుమారు ఒక్కో రైతు.. బస్తాకు సగటున రూ.250 చొప్పున నష్టపోయారని లెక్కగట్టినా.. మిల్లర్లు, దళారులు, ఐకేపీ నిర్వాహకులు మింగేసింది రూ.200 కోట్లపైనే ఉంటుందని అంచనా. జిల్లాలో అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిన ఈ ధాన్యం కొను‘గోల్‌మాల్’పై అధికారులు మాత్రం అటువంటిదేమీ జరగలేదని వాదిస్తున్నారు.
 
 ఆగని మిల్లర్ల మాయాజాలం
 లెవీ ఎత్తివేయడంతో మిల్లర్ల నుంచి ప్రభుత్వం బియ్యం కొనుగోలు చేసే అవకాశం లేదు. దాంతో మిల్లర్లు.. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కుమ్మక్కై అక్రమ పద్ధతులకు తెరతీశారు. గతంలో మాదిరిగానే రైతుల నుంచి మిల్లర్లే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరిపినట్టు లెక్కలు చూపించారు. ఫలితంగా గతంలో ఏరకంగా అయితే మిల్లర్ల మాయాజాలంలో చిక్కుకుని అయినకాడికి అమ్ముకుని రైతులు నష్టపోయారో ఇప్పుడు కూడా అదే మిల్లర్లకు దెబ్బతిన్నారు. లెవీ సేకరణ ఎత్తివేయడంతో రైతు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement