సాక్షి, అమరావతి/ సాక్షి అమరావతి బ్యూరో: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి అత్యున్నత సర్వీసులకు సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు పేపర్ 2 నిర్వహించారు. దేశవ్యాప్తంగా 12 నుంచి 13 లక్షల మంది హాజరయ్యే ఈ పరీక్షకు ఆంధ్రప్రదేశ్‌లో 33 వేల మందికి పైగా దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 35 నుంచి 40 శాతం మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. విజయవాడలో 12,176 మంది పరీక్ష రాయాల్సి ఉండగా సుమారు 4,800 మంది హాజరయ్యారు. విశాఖపట్నంలో 11,566 మంది, తిరుపతిలో 6,635 మంది, అనంతపురంలో 2,869 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 35 శాతానికి మించి రాలేదు.
ఇన్‌డైరెక్టు ప్రశ్నలే అధికం
గతంలో కన్నా ఈసారి ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. ఇన్‌డైరెక్టు ప్రశ్నలే అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. జనరల్ స్టడీస్‌లో నేరుగా సమాధానాలు గుర్తించే ప్రశ్నలు చాలా తక్కువగా వచ్చాయని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ ఇండెక్స్‌ను ఆధారం చేసుకొని ఇచ్చిన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయన్నారు. జాగ్రఫీలో చాలా తక్కువ ప్రశ్నలు వచ్చినట్లు పేర్కొన్నారు. ‘మోడ్రన్ ఇండియా’లో ప్రశ్నలు అడిగినా అవి ఒకింత కష్టంగానే ఉన్నాయని తెలిపారు.
రెండో పేపర్‌లో వచ్చిన ప్రశ్నలు మేథమెటిక్స్ సబ్జెక్టు చదువుకున్న వారికి సులభంగా ఉన్నాయని చెప్పారు. జనరల్ ఇంగ్లిష్ ప్రశ్నలు గతంలో కన్నా కొంత సులభంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ‘‘ప్రిలిమ్స్ ప్రశ్నలను గమనిస్తే స్టేట్‌మెంట్ బేస్డ్ ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తోంది. ఈసారి పరీక్షలకు అభ్యర్థుల హాజరు కూడా తగ్గింది’’ అని సివిల్స్ శిక్షణ సంస్థ బ్రెయిన్‌ట్రీ డైరెక్టర్ గోపాలకృష్ణ వివరించారు. ఫ్యాక్చువల్ బేస్డ్ ప్రశ్నలు ఎక్కువగా అడిగారని, లోతుగా విశ్లేషించేలా అవి ఉన్నాయని సివిల్స్ సబ్జెక్టు నిపుణురాలు బాలలత తెలిపారు. ‘‘కరెంట్ ఆఫైర్స్ ప్రశ్నలు ఎక్కువ ఇచ్చినా వాటిని నేరుగా అడగలేదు. ప్రాథమిక అంశాలపై అవగాహన ఉంటే తప్ప వాటి సమధానాలు గుర్తించలేని విధంగా ప్రశ్నలున్నాయి’’ అని విజన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ సెంటర్ హెడ్ శశాంక్ వివరించారు.
కటాఫ్‌పై వేర్వేరు అంచనాలు
ఈసారి సివిల్స్ ప్రశ్నల తీరుతో కటాఫ్ మార్కులపై నిపుణుల అంచనాలు వేర్వేరుగా ఉన్నాయి. గత ఏడాది ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు 105 కాగా, ఈసారి కటాఫ్ అదే విధంగా ఉండడమో, ఒకటి రెండు మార్కులు తగ్గడమో ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు. పోస్టులు సంఖ్య తగ్గుతుండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. గత ఏడాది 1000 పోస్టులుండగా ఈసారి 200 వరకు తగ్గుతున్నాయని పేర్కొంటున్నారు. ప్రశ్నలు అడిగిన తీరు చూస్తే కటాఫ్ 105 నుంచి 110 మధ్య ఉంటుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి అక్టోబర్ 1న మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గత ఏడాది తమిళనాడులో సివిల్స్ పరీక్షకు హాజరైన ఐపీఎస్ అధికారి ఒకరు హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి అలాంటి వాటికి ఆస్కారమివ్వకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment