civils prilims exam
-
సివిల్స్‌కు సిద్ధమవుతారా.. ఇలా ప్రిపేర్ అయితే జాబ్ గ్యారంటీ..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఉద్యోగార్ధులకు పరిచయం అక్కర్లేని పేరు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా.. మొత్తం 19 కేంద్ర సర్వీసుల్లో పోస్ట్‌ల భర్తీకి.. నిర్వహించే పరీక్ష ఇది! ప్రభుత్వ పాలనా విభాగంలో అత్యున్నతమైన కొలువు..సమాజంలో హోదా, గౌరవం.. ఆకర్షణీయ వేతనాలు, ఉద్యోగ భద్రత.. ఇవన్నీ సివిల్ సర్వీస్ ఉద్యోగుల సొంతం. అందుకే.. సివిల్స్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించాలనే తపనతో.. ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు!! తాజాగా సివిల్ సర్వీసెస్–2022 నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 861 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో.. సివిల్స్ లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులకు ఉపయోగపడేలా సివిల్స్ ఎంపిక ప్రక్రియ, పరీక్ష వివరాలు, ప్రిపరేషన్ గైడెన్స్... సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా.. అని ఎదురు చూసే అభ్యర్థులు లక్షల్లోనే ఉంటారనడం అతిశయోక్తి కాదు. నోటిఫికేషన్ రాగానే.. ఇక ఎలా ముందుకు అడుగులు వేయాలి.. అని ఆలోచిస్తుంటారు. వారంతా ఇప్పుడు తొలి దశ ప్రిలిమ్స్‌పై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది. గతేడాది కంటే పెరిగిన పోస్టులు సివిల్స్–2022 ప్రక్రియ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా 19 కేంద్ర సర్వీసుల్లో మొత్తం 861 పోస్ట్‌ల భర్తీ చేపట్టనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పోస్ట్‌ల సంఖ్య పెరగడం అభ్యర్థులకు సానుకూల అంశంగా చెప్పొచ్చు. ఎందుకంటే.. గత రెండేళ్లుగా సివిల్స్ పోస్ట్‌ల సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. 2021లో 712 పోస్ట్‌లు, 2020లో 796 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పది లక్షల వరకు పోటీ సివిల్స్‌కు ఏటా దాదాపు పది లక్షల మంది వరకూ దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య సగటున అయిదు లక్షలకు పైగానే. దీంతో.. వందల్లో ఉండే పోస్ట్‌ల కోసం లక్షల సంఖ్యలో పోటీని చూసి అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తుంది. అభ్యర్థులు శాస్త్రీయ దృక్పథంతో అడుగులు వేస్తే.. తొలి దశ ప్రిలిమినరీ పరీక్షలో విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు. మొత్తం మూడు దశలు సివిల్స్ ఎంపిక ప్రక్రియను మొత్తం మూడు దశలుగా నిర్వహిస్తున్నారు. అవి..తొలి దశ: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్; రెండో దశ: మెయిన్ ఎగ్జామినేషన్; చివరి దశ: పర్సనాలిటీ టెస్ట్(పర్సనల్ ఇంటర్వ్యూ) ప్రిలిమినరీ ఇలా తొలి దశ ప్రిలిమినరీ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో రెండు పేపర్లుగా ఉంటుంది. అవి.. పేపర్– 1: జనరల్ స్టడీస్:100ప్రశ్నలు–200 మార్కులు; పేపర్–2: అప్టిట్యూడ్ టెస్ట్: 80 ప్రశ్నలు–200 మార్కులు. ఇలా.. మొత్తం నాలుగు వందల మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పేపర్–1(జనరల్ స్టడీస్)లో నిర్దిష్ట కటాఫ్ మార్కులను సాధించిన వారిని తదుపరి దశ మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. పేపర్–2లో కనీసం 33 శాతం మార్కులు సాధించాలనే నిబంధన కూడా ఉంది. ఇలా.. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు.. ఒక్కో పోస్ట్‌కు 12 లేదా 12.5 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెయిన్ ఎగ్జామ్.. ఇలా ► సివిల్స్ ఎంపిక ప్రక్రియలో రెండో దశ పరీక్ష మెయిన్ ఎగ్జామినేషన్. ► ఇందులో రెండు లాంగ్వేజ్ పేపర్లు, ఒక జనరల్ ఎస్సే పేపర్, నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు, రెండు ఆప్షనల్ పేపర్లు ఉంటాయి. ► అర్హత పేపర్లలో..పేపర్–1 ఇండియన్ లాంగ్వేజ్ 300 మార్కులకు; పేపర్–బి ఇంగ్లిష్ 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇండియన్ లాంగ్వేజ్, ఇంగ్లిష్ పేపర్లు కేవలం అర్హత పేపర్లే. అయితే వీటిలో కనీస మార్కులు పొందితేనే మిగతా పేపర్ల మూల్యాంకన చేసి.. మెరిట్ జాబితా రూపొందిస్తారు. ► తప్పనిసరి పేపర్లు: ఇందులో జనరల్ ఎస్సే 250 మార్కులకు; నాలుగు జనరల్ స్టడీస్ పేపర్లు ఒక్కోటి 250 మార్కుల చొప్పున; ఒక ఆప్షనల్ సబ్జెక్టు నుంచి రెండు పేపర్లు ఒక్కోటి 250 మార్కుల చొప్పున అడుగుతారు. ► మొత్తం ఏడు పేపర్లలో 1750 మార్కులకు పూర్తి డిస్క్రిప్టివ్ విధానంలో మెయిన్ పరీక్ష ఉంటుంది. ► మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్ట్‌కు ఇద్దరు లేదా ముగ్గురిని (1:2 లేదా 1:3 నిష్పత్తిలో) పర్సనాలిటీ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. పర్సనాలిటీ టెస్ట్‌కు కేటాయించే మార్కులు 275. ► పర్సనాలిటీ టెస్ట్‌లోనూ ప్రతిభ చూపితే.. మెయిన్ + ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది విజేతలను ప్రకటించి సర్వీసులు కేటాయిస్తారు. ప్రిలిమ్స్‌లో నెగ్గాలంటే సివిల్స్ ప్రిలిమ్స్‌లో నెగ్గాలంటే.. అభ్యర్థులు ప్రిలిమ్స్‌లోని రెండు పేపర్లకు రెండు ప్రత్యేక వ్యూహాలతో అడుగులు వేయాలి. ► జనరల్ స్టడీస్ పేపర్‌గా నిర్వహించే పేపర్–1లో.. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ► రెండో పేపర్ సీశాట్‌లో.. రీడింగ్ కాంప్రహెన్షన్, న్యూమరికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రాణించేందుకు అభ్యర్థులు బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్, పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్, అర్థమెటిక్ అంశాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ► అభ్యర్థులు ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఉపయుక్తంగా ఉంటుంది. కారణం..గత మూడు,నాలుగేళ్లుగా కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలు కొంత పెరుగుతున్నాయి. కరెంట్ అఫైర్స్‌ను కోర్ టాపిక్స్‌తో అన్వయం చేసుకుంటూ తమ ప్రిపరేషన్ సాగించాలి. అనుసంధాన వ్యూహం సివిల్స్ ప్రిలిమ్స్ అభ్యర్థులు అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ఉదాహరణకు.. జాగ్రఫీని చదివేటప్పుడు అందులో ఉండే జనాభా, పంటలు, సహజ వనరులు–ఉత్పాదకత తదితర అంశాలను ఎకనామిక్స్‌తో అన్వయం చేసుకుంటూ చదివితే.. ఒకే సమయంలో రెండు అంశాల్లోనూ పట్టు లభిస్తుంది. అలాగే పాలిటీ–ఎకానమీని అన్వయం చేసుకుంటూ చదవొచ్చు. ఎందుకంటే.. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్‌లో అడుగుతున్న ప్రశ్నల తీరును గమనిస్తే.. ప్రభుత్వం తీసుకున్న శాసన నిర్ణయాలు.. ఆర్థికంగా వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనే తీరులో ఉంటున్నాయి. డిస్క్రిప్టివ్ అప్రోచ్ ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. కాని అభ్యర్థులు ప్రిపరేషన్లో డిస్క్రిప్టివ్ విధానం అనుసరించడం మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా విషయాలపై అన్ని కోణాల్లో అవగాహన లభిస్తుంది. ఇది మెయిన్స్ ప్రిపరేషన్‌ను సులభతరం చేస్తుంది. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించి ప్రామాణిక మెటీరియల్‌లో ఉండే అన్ని కోణాలపై స్పష్టత పెంచుకోవాలి. ఈ సబ్జెక్ట్లపై ప్రత్యేక దృష్టి ప్రిలిమ్స్‌లో అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అంశాలు.. జాగ్రఫీ, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే.. ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన పర్యావరణ కాలుష్యం, అందుకు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో చేపడుతున్న చర్యలు వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇటీవల కాలంలో మన దేశం ప్రయోగించిన ఉపగ్రహాలు, వాటి లక్ష్యాలు వంటి అంశాలు తెలుసుకోవాలి. పేపర్–2కు ఇలా అర్హత పేపర్‌గానే పేర్కొంటున్న పేపర్–2 ఆప్టిట్యూడ్ టెస్ట్‌పైనా అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ పేపర్లో కనీసం 33శాతం మార్కులు సాధిస్తేనే పేపర్–1ను మూల్యాంకన చేస్తారు. దాని ఆధారంగా మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. పేపర్2 కోసం బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్,రీడింగ్ కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి.ఇందుకోసం ఇంగ్లి ష్ దిన పత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలి. న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి పదో తరగతి స్థాయిలో మ్యాథమెటిక్స్ ప్రధానంగా అర్థమెటిక్‌కు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. మెయిన్‌తో అనుసంధానం సివిల్స్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలోనే సిలబస్‌లో పేర్కొన్న అంశాలను మెయిన్ ఎగ్జామ్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. మెయిన్‌లో ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు, ఎథిక్స్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్లు ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్‌లో నిర్దేశించిన విభాగాలకు సంబంధించినవే. కాబట్టి ఆయా సబ్జెక్ట్‌లను డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో చదివితే మెయిన్స్‌కు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఒక టాపిక్‌ను నేపథ్యంతోపాటు సమకాలీన పరిణామాలతోనూ అనుసంధానం చేసుకుంటూ చదవాలి. దీనివల్ల ప్రిలిమ్స్‌లో అడుగుతున్న విభిన్న శైలి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. సిలబస్‌పై అవగాహన ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్ సిలబస్‌ను ఆసాంతం పరిశీలించాలి. సిలబస్‌లో పేర్కొన్న అంశాలు, సదరు అంశాల్లో తమ వ్యక్తిగత సామర్థ్య స్థాయి తెలుసుకోవాలి. ఫలితంగా ప్రిపరేషన్లో తాము ఎక్కువగా దృష్టి సారించాల్సిన అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత గత ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. ఫలితంగా ప్రశ్నలు అడుగుతున్న శైలి.. ఏఏ అంశాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుంది? వంటి అంశాలపై అవగాహన కలుగుతుంది. పుస్తకాలు సిలబస్‌పై అవగాహన పొందాక.. వాటికి సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను సేకరించుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌లోనూ సిలబస్‌లో పేర్కొన్న అన్ని అంశాలు పొందుపర్చిన పుస్తకాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్రామాణికం అని గుర్తింపు పొందిన ఒకట్రెండు పుస్తకాలకు పరిమితం అవడం మేలు. ముఖ్యంగా తొలిసారి రాస్తున్న అభ్యర్థులు ఈ తరహా వ్యూహం అనుసరించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. టైమ్ మేనేజ్మెంట్ ప్రిపరేషన్ సందర్భంగా అభ్యర్థులు సమయ పాలన పాటించాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది గంటలు ప్రిపరేషన్ సాగించాలి. ప్రతి రోజు అన్ని సబ్జెక్ట్‌లను చదివే విధంగా వ్యవహరించాలి. ఒక సబ్జెక్ట్ పూర్తయ్యాక మరో సబ్జెక్ట్ చదువుదాం అనే ధోరణి సరికాదు. ఇలా చేయడం వల్ల ఒక సబ్జెక్ట్‌లో అన్ని అంశాలను పూర్తి చేసే విషయంలో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. సివిల్స్ ప్రిలిమ్స్.. సిలబస్ అంశాలు ► పేపర్–1 (జనరల్ స్టడీస్): జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం సంతరించుకున్న సమకాలీన అంశాలు; భారత చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం; భారత, ప్రపంచ భౌగోళ శాస్త్రం, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్(రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, పంచాయితీ రాజ్, పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్ తదితర); ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్(సస్టెయినబుల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇన్‌క్లూజన్, డెమోగ్రాఫిక్స్, సోషల్ సెక్టార్ ఇనీషియేటివ్స్ తదితర); పర్యావరణ వ్యవస్థపై అంశాలు; జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు; జనరల్ సైన్స్. ► పేపర్–2(అప్టిట్యూడ్ టెస్ట్–సీశాట్): కాంప్రహెన్షన్; ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఇన్క్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్; లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ; డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్; జనరల్ మెంటల్ ఎబిలిటీ; బేసిక్ న్యూమరసీ; డేటా ఇంటర్‌ప్రిటేషన్. దీర్ఘకాలిక వ్యూహం సివిల్స్ అభ్యర్థులు దీర్ఘకాలిక వ్యూహంతో ప్రిపరేషన్ సాగించాలి. ప్రధానంగా.. ప్రిలిమ్స్‌ను మెయిన్ ఎగ్జామినేషన్‌తో అనుసంధానం చేసుకుంటూ.. డిస్క్రిప్టివ్ విధానంలో చదవడం ఎంతో ప్రయోజనం కలిగిస్తుంది. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్ పరీక్షలకు సిద్ధమవుదామనే ధోరణి వీడాలి. యూపీఎస్సీ అడిగే ప్రశ్నల తీరు కూడా మారుతోంది. కాబట్టి గత ప్రశ్న పత్రాలను సాధనం చేయడం ఎంతో అవసరం. ప్రిలిమ్స్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించేలా కృషి చేయాలి. – శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్ అకాడమీ సివిల్స్ ప్రిలిమ్స్–2022 పరీక్ష సమాచారం ► అర్హత:ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 2022 చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు మెయిన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే సమయానికి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ► వయో పరిమితి: ఆగస్టు 1, 2022 నాటికి 21 నుంచి 32ఏళ్ల మధ్యలో ఉండాలి. గరిష్ట వయో పరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వరకు సడలింపు లభిస్తుంది. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2022 ► ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్ 5, 2022 ► తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం ► ఆన్లైన్ దరఖాస్తు వెబ్సైట్: https://upsconline.nic.in/mainmenu2.php ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.upsc.gov.in -
Civils Prilimanary Exam: నేడు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష
సాక్షి, తిరుపతి: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి తిరుపతిలో 16 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 7,201 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. జనవరి 7న మెయిన్స్ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అరగంట ముందుగా పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు. బస్టాండ్ నుంచి పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నారు. ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. తెలంగాణ... తెలంగాణ వ్యాప్తంగా 53,015 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హైదరాబాద్ లో 101 పరీక్ష కేంద్రాల్లో 46,953 మంది, వరంగల్‌లో 14 కేంద్రాల్లో 6,062 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణ బస్ భవన్ ప్రెస్ నోట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2021 కి హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత రవాణా అందించడానికి టీఎస్ఆర్టీసీ నిర్వహణ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించడం ద్వారా హైదరాబాద్, వరంగల్‌లోని మూడు నగరాల్లోని మెట్రో, ఏసీ బస్సులతో సహా అన్ని రకాల సిటీ బస్సులలో ఈ ఉచిత రవాణా సేవను పొందవచ్చు అని తెలిపారు. ఈ క్రమంలో వీసీ సజ్జనార్ సివిల్ సర్వీస్ పరీక్ష -2021 కి హాజరయ్యే అభ్యర్థులకు టీఎస్ఆర్టీసీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది అన్నారు. -
ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర ఆలిండియా కేడర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్–2020 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 72 పట్టణాల్లో, రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం పేపర్–1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం పేపర్–2 (సీశాట్) నిర్వహించారు. కఠినంగానే ప్రశ్నలు.. జనరల్ స్టడీస్ పేపర్ మోడరేట్‌గా ఉండడంతోపాటు ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు తెలిపారు. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఇటీవలి పరిణామాలతోపాటు ఆధునిక చరిత్ర, అగ్రి ఎకానమీ, కరోనా ప్రభావంపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయన్నారు. కాఠిన్యపు స్థాయి గతేడాది మాదిరిగానే ఉందన్నారు. కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా ఉన్నా రోజూ వార్తలు, విశ్లేషణలు అధ్యయనం చేసేవారు సులువుగానే రాయొచ్చని చెప్పారు. అగ్రి ఎకానమీ, హిస్టరీ, ఆర్ట్, కల్చర్ అంశాల ప్రశ్నలు కష్టంగా ఉండగా.. పాలిటీపై ప్రశ్నలు సులువుగా తాజా అంశాలపై ఉన్నాయన్నారు. ఎంపీ లాడ్స్ నిధులు, పార్లమెంట్ సమావేశాలు, గాంధీయిజం, మార్క్సిజమ్, పార్లమెంటరీ డెమొక్రసీ తదితర అంశాలపై ప్రశ్నలున్నాయి. వ్యవసాయాధార ప్రశ్నలు కూడా ఎక్కువగానే వచ్చాయి. పర్యావరణ కాలుష్యం, జాతీయ పార్కులు, జీవ ఇంధనం, ప్రభుత్వ పథకాలు, వ్యాక్సిన్లు తదితర అంశాలపై ప్రశ్నలడిగారు. పేపర్–1లో 200 మార్కులకు 100 ప్రశ్నలు, పేపర్–2లో 200 మార్కులకు 80 ప్రశ్నలు ఇచ్చారు. పేపర్–1 ప్రకారం కటాఫ్ పేపర్–1 ప్రకారం కటాఫ్ నిర్ణయిస్తారు. పేపర్–2 సీశాట్ కేవలం క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే. అందులో 33 శాతం మార్కులు వస్తే చాలు. జనరల్ కేటగిరీ కటాఫ్ మార్కులు.. 2018, 2019ల్లో 98 కాగా 2017లో 105.34గా ఉన్నాయి. ఈసారి గతేడాది కంటే పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారికి జనవరి 8న మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. -
సివిల్స్ ప్రిలిమ్స్‌పై యూపీఎస్సీ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు సవరించిన షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా అక్టోబర్ 4న జరుగుతాయని యూపీఎస్సీ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. పెద్దసంఖ్యలో అభ్యర్ధులు సివిల్స్ ప్రిలిమనరీ, ఐఎఫ్ఎస్ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరవుతున్న క్రమంలో వారి అభ్యర్ధన మేరకు వారి పరీక్షా కేంద్రాలను మార్చుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు యూపీఎస్సీ తెలిపింది. అదనపు అభ్యర్ధులకు ఆయా కేంద్రాలు వసతుల పెంపు ఆధారంగా అభ్యర్ధుల పరీక్షా కేంద్రాల మార్పు అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. అభ్యర్ధులు పరీక్ష కేంద్రాల మార్పుకు సంబంధించిన ఆప్షన్‌ను జులై 7-13 వరకూ జులై 20-24 వరకూ రెండు దశల్లో కమిషన్ వెబ్సైట్ https://upsconline.nic.inద్వారా అందించాలని కోరింది. అభ్యర్ధులు వెబ్‌సైట్‌ను సందర్శించి పరీక్షా కేంద్రాలపై తమ ఎంపికను సమర్పించాలని కోరింది. అభ్యర్ధుల వినతులను ‘ఫస్ట్ అప్లై-ఫస్ట్ అలాట్’ పద్ధతిన పరిశీలిస్తామని స్పష్టం చేసింది. సీలింగ్ కారణంగా తాము కోరుకున్న పరీక్షా కేంద్రాన్ని పొందలేని వారు మిగిలిన వాటి నుంచి ఒక కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది. చదవండి : యూపీఎస్సీ 2020 సన్నద్ధమవుదామిలా.. -
ఆక్సిజన్ సిలిండర్‌తో సివిల్స్ పరీక్ష
తిరువనంతపురం: ఓ సివిల్స్ అభ్యర్థి తపనను అనారోగ్యం కూడా అడ్డుకోలేకపోయింది. ఎముకల వ్యాధితో బాధ పడుతున్నా, ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసి అందరి చేత శభాష్ అనిపించుకుంది. కేరళలోని కొట్టాయంకు దగ్గరలో ఉన్న ఎరుమెలికి చెందిన లతీషా అన్సారీ(24) పుట్టినప్పటి నుంచి టైప్ –2 ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా అనే అరుదైన ఎముకల వ్యాధితో బాధపడుతోంది. అలాగే పల్మనరీ హైపర్ టెన్షన్ వల్ల ఏడాది నుంచి ఆమెకు ఎల్లప్పుడూ ఆక్సిజన్ సిలిండర్ అవసరం ఏర్పడింది. అయినప్పటికీ సివిల్స్ రాయాలనుకున్న లతీషా కోసం ఆమె తండ్రి అన్సారీ ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు. దీంతో చక్రాల కుర్చీలో, ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో ఆమె ఆదివారం నిర్వహించిన సివిల్స్ ప్రాథమిక పరీక్షకు హాజరయింది. పరీక్ష అనుమతి కోసం ప్రత్యేక చొరవ చూపిన జిల్లా కలెక్టర్ సుధీర్‌బాబుకు అన్సారీ కృతజ్ఞతలు తెలిపారు. లతీషా ఎం.కాం. వరకు చదువుకుందని అన్సారీ వెల్లడించారు. -
ముప్పుతిప్పలు పెట్టిన ప్రిలిమ్స్ ప్రశ్నలు!
సాక్షి, అమరావతి/ సాక్షి అమరావతి బ్యూరో: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసులకు సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9.30 నుంచి 11.30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు పేపర్ 2 నిర్వహించారు. దేశవ్యాప్తంగా 12 నుంచి 13 లక్షల మంది హాజరయ్యే ఈ పరీక్షకు ఆంధ్రప్రదేశ్‌లో 33 వేల మందికి పైగా దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 35 నుంచి 40 శాతం మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. విజయవాడలో 12,176 మంది పరీక్ష రాయాల్సి ఉండగా సుమారు 4,800 మంది హాజరయ్యారు. విశాఖపట్నంలో 11,566 మంది, తిరుపతిలో 6,635 మంది, అనంతపురంలో 2,869 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 35 శాతానికి మించి రాలేదు. ఇన్‌డైరెక్టు ప్రశ్నలే అధికం గతంలో కన్నా ఈసారి ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. ఇన్‌డైరెక్టు ప్రశ్నలే అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. జనరల్ స్టడీస్‌లో నేరుగా సమాధానాలు గుర్తించే ప్రశ్నలు చాలా తక్కువగా వచ్చాయని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ ఇండెక్స్‌ను ఆధారం చేసుకొని ఇచ్చిన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయన్నారు. జాగ్రఫీలో చాలా తక్కువ ప్రశ్నలు వచ్చినట్లు పేర్కొన్నారు. ‘మోడ్రన్ ఇండియా’లో ప్రశ్నలు అడిగినా అవి ఒకింత కష్టంగానే ఉన్నాయని తెలిపారు. రెండో పేపర్లో వచ్చిన ప్రశ్నలు మేథమెటిక్స్ సబ్జెక్టు చదువుకున్న వారికి సులభంగా ఉన్నాయని చెప్పారు. జనరల్ ఇంగ్లిష్ ప్రశ్నలు గతంలో కన్నా కొంత సులభంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ‘‘ప్రిలిమ్స్ ప్రశ్నలను గమనిస్తే స్టేట్మెంట్ బేస్డ్ ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తోంది. ఈసారి పరీక్షలకు అభ్యర్థుల హాజరు కూడా తగ్గింది’’ అని సివిల్స్ శిక్షణ సంస్థ బ్రెయిన్‌ట్రీ డైరెక్టర్ గోపాలకృష్ణ వివరించారు. ఫ్యాక్చువల్ బేస్డ్ ప్రశ్నలు ఎక్కువగా అడిగారని, లోతుగా విశ్లేషించేలా అవి ఉన్నాయని సివిల్స్ సబ్జెక్టు నిపుణురాలు బాలలత తెలిపారు. ‘‘కరెంట్ ఆఫైర్స్ ప్రశ్నలు ఎక్కువ ఇచ్చినా వాటిని నేరుగా అడగలేదు. ప్రాథమిక అంశాలపై అవగాహన ఉంటే తప్ప వాటి సమధానాలు గుర్తించలేని విధంగా ప్రశ్నలున్నాయి’’ అని విజన్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ సెంటర్ హెడ్ శశాంక్ వివరించారు. కటాఫ్‌పై వేర్వేరు అంచనాలు ఈసారి సివిల్స్ ప్రశ్నల తీరుతో కటాఫ్ మార్కులపై నిపుణుల అంచనాలు వేర్వేరుగా ఉన్నాయి. గత ఏడాది ప్రిలిమ్స్ కటాఫ్ మార్కులు 105 కాగా, ఈసారి కటాఫ్ అదే విధంగా ఉండడమో, ఒకటి రెండు మార్కులు తగ్గడమో ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు. పోస్టులు సంఖ్య తగ్గుతుండడమే దీనికి కారణంగా చెబుతున్నారు. గత ఏడాది 1000 పోస్టులుండగా ఈసారి 200 వరకు తగ్గుతున్నాయని పేర్కొంటున్నారు. ప్రశ్నలు అడిగిన తీరు చూస్తే కటాఫ్ 105 నుంచి 110 మధ్య ఉంటుందని మరికొందరు అంచనా వేస్తున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి అక్టోబర్ 1న మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. గత ఏడాది తమిళనాడులో సివిల్స్ పరీక్షకు హాజరైన ఐపీఎస్ అధికారి ఒకరు హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి అలాంటి వాటికి ఆస్కారమివ్వకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. -
7న సివిల్స్ ప్రిలిమినరీ
► 9 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ ► 3,553 మంది అభ్యర్థుల దరఖాస్తు ► పకడ్బందీ ఏర్పాట్లకు కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్ : ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షలు ఈ నెల 7న జిల్లాలోని తొమ్మిది కేంద్రాల్లో జరుగుతాయని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. 3,553 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని, నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్.. జేసీ–2 సయ్యద్ ఖాజామొíß ద్దీన్, ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. యూపీఎస్సీ నిర్దేశించిన నియమావళిని పరీక్షల వి««దlులను నిర్వర్తిస్తున్న అధికారులు కచ్చితంగా పాటించాలన్నారు. జిల్లాలో పరీక్ష నిర్వహించడం ఇది రెండవసారన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 72 పట్టణాల్లో 2,655 కేంద్రాల్లో 11.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ముందుగానే పరిశీలించి లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తహశీల్దారులను ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అదికారులను ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జీ డీఆర్ఓ మల్లీశ్వరిదేవి, అదనపు ఎస్పీ పి.మల్యాద్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాలు ఇవే .. యూపీఎస్సీ పరీక్షలు తొమ్మిది కేంద్రాల్లో జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. జేఎన్టీయూ (సెంటర్–ఎ), జెన్టీయూ (సెంటర్–బి), కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశా, ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల, ఎస్ఎస్బీఎన్ జూనియర్ కళాశాల, కేఎస్ఆర్ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్ కళాశాల, కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎస్కేయూ), ప్రభుత్వ జూనియర్ కళాశాల. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 26 మంది విభిన్న ప్రతిభావంతులకు ఎస్ఎస్బీఎన్ జూనియర్ కళాశాలలో ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమస్యలు ఉంటే 08554–275811కి ఫోన్ చేసి చెప్పాలి. అభ్యర్థులకు ఎటువంటి సమాచారం కావాలన్నా 011–23385271, 011–23381125, 011–23098543 నంబర్లలో లేదా ఠీఠీఠీ.upటఛి.జౌఠి.జీn సంప్రదివచ్చవచ్చు.