విజయవాడలో అభ్యర్థినిని థర్మల్ స్కానింగ్ చేస్తున్న దృశ్యం
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర ఆలిండియా కేడర్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్–2020 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 72 పట్టణాల్లో, రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంల్లో పరీక్ష నిర్వహించారు. ఉదయం పేపర్–1 (జనరల్ స్టడీస్), మధ్యాహ్నం పేపర్–2 (సీశాట్) నిర్వహించారు.
కఠినంగానే ప్రశ్నలు..
జనరల్ స్టడీస్ పేపర్ మోడరేట్‌గా ఉండడంతోపాటు ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు తెలిపారు. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఇటీవలి పరిణామాలతోపాటు ఆధునిక చరిత్ర, అగ్రి ఎకానమీ, కరోనా ప్రభావంపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయన్నారు. కాఠిన్యపు స్థాయి గతేడాది మాదిరిగానే ఉందన్నారు. కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా ఉన్నా రోజూ వార్తలు, విశ్లేషణలు అధ్యయనం చేసేవారు సులువుగానే రాయొచ్చని చెప్పారు. అగ్రి ఎకానమీ, హిస్టరీ, ఆర్ట్, కల్చర్ అంశాల ప్రశ్నలు కష్టంగా ఉండగా.. పాలిటీపై ప్రశ్నలు సులువుగా తాజా అంశాలపై ఉన్నాయన్నారు. ఎంపీ లాడ్స్ నిధులు, పార్లమెంట్ సమావేశాలు, గాంధీయిజం, మార్క్సిజమ్, పార్లమెంటరీ డెమొక్రసీ తదితర అంశాలపై ప్రశ్నలున్నాయి. వ్యవసాయాధార ప్రశ్నలు కూడా ఎక్కువగానే వచ్చాయి. పర్యావరణ కాలుష్యం, జాతీయ పార్కులు, జీవ ఇంధనం, ప్రభుత్వ పథకాలు, వ్యాక్సిన్లు తదితర అంశాలపై ప్రశ్నలడిగారు. పేపర్–1లో 200 మార్కులకు 100 ప్రశ్నలు, పేపర్–2లో 200 మార్కులకు 80 ప్రశ్నలు ఇచ్చారు.
పేపర్–1 ప్రకారం కటాఫ్
పేపర్–1 ప్రకారం కటాఫ్ నిర్ణయిస్తారు. పేపర్–2 సీశాట్ కేవలం క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే. అందులో 33 శాతం మార్కులు వస్తే చాలు. జనరల్ కేటగిరీ కటాఫ్ మార్కులు.. 2018, 2019ల్లో 98 కాగా 2017లో 105.34గా ఉన్నాయి. ఈసారి గతేడాది కంటే పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ప్రిలిమ్స్‌లో అర్హత సాధించినవారికి జనవరి 8న మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment