సాక్షి, హైదరాబాద్ : రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో ఏపీకి మంచి భవిష్యత్తు ఉందని హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్ అన్నారు. రెండు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న అమెరికా భారత్ రక్షణ సంబంధాల అంతర్జాతీయ సదస్సులో భాగంగా ఢిల్లీ రాయబార కార్యాలయ అధికారి కెప్టెన్ డేనియల్ ఇ ఫిలియన్, ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో కలిసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల విశాఖపట్నంలో అమెరికా, భారత్ త్రివిధ సైనిక దళాలు ప్రదర్శించిన సైనిక విన్యాసాలు రక్షణ రంగంలో ఏపీ సామర్థ్యానికి అద్దం పట్టాయన్నారు. ఏపీ, తెలంగాణలతో అత్యున్నత రక్షణ సాంకేతిక సహకార బంధం ఏర్పరుచుకునేందుకు పలు అమెరికన్ కంపెనీలు ఆసక్తితో ఉన్నాయన్నారు.
భౌగోళికంగా చూస్తే.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అనేక అనుకూలతలున్నాయని తెలిపారు. అమెరికా విద్యాసంస్థల్లో చదివే భారతీయ విద్యార్థులను ప్రోత్సహించేందుకు వీసాల జారీని కొనసాగించడంతో పాటు, భవిష్యత్తులో వాటి సంఖ్యను కూడా పెంచుతామని చెప్పారు. తాజాగా అమెరికా, భారత్ నడుమ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఒప్పందానికి రెండు దేశాలు తుది రూపునిచ్చినట్టు తెలిపారు. దీని మూలంగా రెండు దేశాల రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బదిలీతో పాటు.. భాగస్వామ్య ఒప్పందాలకు మార్గం సుగమం చేస్తుందని రీఫ్‌మన్ వెల్లడించారు.
ఇంగ్లిష్‌మీడియం నిర్ణయం భేష్
ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనను తప్పనిసరిచేస్తూ ఏపీ ప్రభుత్వం చట్టం చేయడాన్ని రీఫ్‌మన్ స్వాగతించారు. అంతర్జాతీయంగా సాంకేతికత, ఇతర అంశాల్లో ఇంగ్లిష్‌కు అత్యంత ప్రాధాన్యం ఉందని, విద్యార్థులకు బాల్యం నుంచి ఇంగ్లిష్‌ను నేర్పించడం ద్వారా వివిధ అంశాల్లో ప్రావీణ్యం సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో ఏపీ వాటాను పెంచుతాం
సాక్షి, హైదరాబాద్: భారత ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ వాటాను రానున్న రెండేళ్లలో మూడింతలు పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఎనిమిది రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా ఉందన్నారు. హైదరాబాద్‌లో రెండు రోజులుగా జరుగుతున్న భారత్, అమెరికా రక్షణ సంబంధాల అంతర్జాతీయ సదస్సులో గురువారం ఆయన ప్రసంగించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను పురోభివృద్ధి బాటలో నడిపేందుకు రూపొందిస్తున్న రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే రంగాలు, అంశాలను గుర్తించినట్టు తెలిపారు.
రక్షణ రంగానికి సంబంధించి రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న డిఫెన్స్ కారిడార్లు రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించామన్నారు. భారతీయ సైనిక బలగాలు, నౌకదళంతో ఏపీ ఇప్పటికే పలు ఒప్పందాలు కుదుర్చుకుందని, రామాయపట్నం పోర్టులో నేవీ బేస్, దొనకొండలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు తదితరాలను గౌతంరెడ్డి ఉదహరించారు. సబ్‌మెరైన్, ఎయిర్‌క్రాఫ్ట్ బేస్, ఆఫ్‌షోర్ రిజర్వు తదితరాలతో ఇప్పటికే విశాఖ పారిశ్రామిక, సైనిక కేంద్రంగా ఉందన్నారు.
రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం
అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో హిందూ మహాసముద్రంలో దేశ తూర్పు తీరం కీలక పాత్ర పోషించనుందని.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ (డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్)ని ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అమెరికా, భారత్ మధ్య జరుగుతున్న రక్షణ ఒప్పందాల నేపథ్యంలో ఏపీకి చెందిన కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లు ‘సప్లయ్ చెయిన్ మేనేజ్‌మెంట్’లో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. రక్షణ రంగ ఉత్పత్తులకు సంబంధించి ఇప్పటికే ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్(ఓఈఎం) సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.
ఏపీ రూపొందించే పారిశ్రామిక విధానంలో డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి ప్రాధాన్యమిస్తూ డిఫెన్స్ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా ఓఈఎంలకు ఉత్పత్తి సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ రంగంలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తామని గౌతంరెడ్డి వెల్లడించారు. మానవ రహిత విమానాల(యూఏవీ) కోసం ప్రత్యేక పాలసీ సిద్ధం చేస్తున్నామన్నారు. ఎక్కువ ఉద్యోగాలు, పెట్టుబడులతో రాష్ట్రానికి సహకరించాల్సిందిగా వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో విశాఖ కేంద్రంగా ఆర్థిక విప్లవం వస్తుందని గౌతంరెడ్డి వెల్లడించారు.
మాట్లాడుతున్న మంత్రి మేకపాటి గౌతంరెడ్డి. చిత్రంలో రీఫ్‌మన్
Comments
Please login to add a commentAdd a comment