
వాదాలకుంటలో భారీ దోపిడీ
వాదాలకుంట (గోపాలపురం), న్యూస్‌లైన్ : వాదాలకుంటలోని ఓ ఇంట్లో శుక్రవారం రాత్రి దొంగలు పడి 72 కాసుల బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదు దోచుకుపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వాదాలకుంట గ్రామం నడిబొడ్డున ఉన్న రామాలయం సమీపంలో ముళ్లపూడి గెరటారావు ఇల్లు ఉంది. ఆయన శుక్రవారం రాత్రి పొలానికి వెళ్లారు. అతని భార్య చినసత్యవతి ఆరుబయట నిద్రిస్తోంది.
ఆమె తోటి కోడలు పెదసత్యవతి, ఇద్దరు కుమారులు, ఓ కోడలు ఇంట్లో నిద్రిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సుమారు 12 గంటలకు ముసుగులు ధరించిన నలుగురు యువకులు ఆ ఇంటి పెరట్లోకి చొరబడ్డారు. చిన సత్యవతి నోట్లో చీర కుక్కడంతో ఆమెకు మెళకువ వచ్చింది. ఏం జరుగుతోందో అర్ధం చేసుకునేలోపే అరిస్తే చంపేస్తామని ఆమెను బెదిరించారు. ఆమెను తీసుకుని ఇంట్లోకి చొరబడి అక్కడ నిద్రిస్తున్న కుమారులు, కోడలిని ఒక్కొక్కరిని చినసత్యవతితోనే నిద్రలేపించారు. కేకలు వేస్తే చంపేస్తామని వారిని కత్తి, చాకులతో బెదిరించారు. వారి చేతులు కట్టేశారు.
కోడలు మెడలో ఉన్న బంగారం, కొడుకు చేతికి ఉన్న ఉంగరాలు వలుచుకున్నారు. పక్కగదిలో నిద్రిస్తున్న చిన సత్యవతి తోటికోడలు పెదసత్యవతిని లేపి ఆమె మెడపై కత్తి పెట్టి బీరువా తాళాలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. తాళాలు తీసుకుని బీరువా తెరిచి అందులో బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఈ తతంగమంతా అయ్యేప్పటికి గంట సమయం పట్టింది. దొంగలు వెంట తెచ్చుకున్న కత్తి, రంపపు బ్లేడును వదిలేశారు. నిద్రలేపి బెదిరించి, చేతులు కట్టి చంపుతామనడంతో భయపడినట్టు బాధితులు తెలిపారు. తాము ఉన్నంత వరకు ఎవరైనా అరిస్తే చంపేస్తామని బెదిరించారని చెప్పారు. నలుగురికీ సుమారు 30 ఏళ్ల వయసు ఉంటుందన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తెలిసినవారే చేశారు : బాధితుల ఆరోపణ
తమ ఇంటికి రంగులు వేసిన యువకులే దోపిడీకి పాల్పడి ఉంటారని బాధితులు పేర్కొన్నా రు. దీంతో ఆ ఇంటికి రంగులు వేసిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు పోలవరం సీఐ జీఆర్‌ఆర్ మోహన్ చెప్పారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ఏవీ సుబ్బరాజు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయవాడ నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించారు. ఫొరెన్సిక్ విభాగం వారు వేలి ముద్రలు సేకరించారు.