సాక్షి, అమరావతి: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు సందర్భంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో వంశీ మాట్లాడుతున్న సమయంలో.. ఆయన మాట్లాడటానికి వీళ్లేదని టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. ఎమ్మెల్యేగా కొనసాగేందుకు వంశీ అనర్హుడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపై ఘాటుగా స్పందించిన వంశీ.. తానకు మాట్లాడే హక్కు ఎందుకు లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినంత మాత్రాన తనను సస్పెండ్ చేస్తారా? అంటూ చంద్రబాబును సభలోనే నిలదీశారు. తాను అనేక సందర్భాల్లో సీఎం జగన్‌ను కలిశానని, పోలవరం కాలువ సమస్యలపై ఆయనతో చర్చించినట్లు వంశీ గుర్తుచేశారు.
సభలో వంశీ మాట్లాడుతూ.. ‘ఇళ్ల పట్టాలు, పోలవరం కుడి కాలువ రైతులు గురించి సీఎం జగన్‌ను కలిశాను. నా నియోజకవర్గ సమస్యలు సీఎంకు చెప్పుకున్నాను. మానవతా దృక్పథంతో సీఎం సానుకూలంగా స్పందించారు. తరువాత నాపై చంద్రబాబు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. సీఎం ఇంగ్లీష్ మీడియం పెట్టాన్ని స్వాగతించాను.పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఎంతో ఉపయోగ పడుతుంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు వలన పేదలు ఎంతో లాభపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ వలన ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి. ఇంగ్లీష్ మీడియం వల్లన సమాజం బాగుపడుతుంది. అమ్మఒడితో పేద పిల్లల మేలు జరుగుతుంది. పప్పు బ్యాచ్ నాపై విమర్శలు చేస్తున్నారు. జయంతికి వర్ధంతి తేడా తెలియని వాళ్లు విమర్శలు చేస్తున్నారు. గుడ్డెద్దు ముసిలి ఎద్దు నాపై విమర్శలు చేస్తున్నారు. నలబై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందనే చంద్రబాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు. వరదలు వలన ఇసుక తీయడం ఇబ్బంది అని చెప్పాను. నేను టీడీపీ సభ్యుడునే నాకు మాట్లాడే హక్కు లేదా. నేను టీడీపీతో ఉండలేను.’ అని అన్నారు.
కాగా టీడీపీ సభ్యులు వంశీని అడ్డుకోవడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా సభలో మాట్లాడే హక్కు వంశీకి ఉందని స్పష్టం చేశారు. ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే హక్కు టీడీపీ సభ్యులకు లేదని హెచ్చరించారు. అనంతరం వంశీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. సీఎం జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలపై సంతోషం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఇవాళ సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్య పెంచుతూ హిందూ ధార్మిక చట్టంలో సవరణల బిల్లు, మద్యం రేట్లు పెంచుతూ ఎక్సైజ్ చట్టంలో సవరణలు చేసిన బిల్లు, పాఠశాల విద్య నియంత్రణ కమిషన్ చట్టంలో సవరణలు చేసిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఉల్లి ధరలు, రైతు భరోసా, మద్దతు ధరలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment