అసెంబ్లీలో నిస్పక్షపాతంగా వ్యవహరిస్తున్నానని స్పీకర్ కోడెల శివప్రసాద్ చెబుతున్న తీరును చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించటమంటే ఇదేనేమోనని అనిపిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు.
నరసరావుపేట వెస్ట్ : అసెంబ్లీలో నిస్పక్షపాతంగా వ్యవహరిస్తున్నానని స్పీకర్ కోడెల శివప్రసాద్ చెబుతున్న తీరును చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించటమంటే ఇదేనేమోనని అనిపిస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి, పట్టణ కన్వీనర్ ఎస్.ఏ.హనీఫ్‌లతో కలిసి సోమవారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్‌పై ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే.. మీరు అది మాట్లాడకూడదు, ఇది మాట్లాడకూడదంటూ నిర్దేశించే స్పీకర్ ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత ఐ విల్ స్పీక్ అని అంటే యు కెనాట్ స్పీక్ అంటూ డిక్ట్యం పాస్ చేసిన స్పీకర్‌ను అసెంబ్లీ చరిత్రలో చూడలేదన్నారు. ఇది స్పీకర్ నియంతృత్వ పోకడకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.
సభను ఆర్డర్‌లో పెట్టి సభ్యులతో మాట్లాడించాల్సిన స్పీకర్, అధికార పక్ష సభ్యులకు మైకిచ్చి ప్రతిపక్ష నాయకుడిని తిట్టించటం ఆయన పక్షపాతవైఖరిని తెలియజేస్తోందన్నారు. నిండు సభలో అంతు చూస్తా.. పాతేస్తానన్న అధికార పక్ష సభ్యులను వదిలి వెల్‌లో నిరసన తెలిపిన ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయటం ఏవిధమైన సంప్రదాయమో చెప్పాలన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడనీయకుండా మార్షల్స్‌తో రోడ్డుపై పడేయించటం అసెంబ్లీ చరిత్రలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. అసెంబ్లీ కార్యదర్శికి తెలియకుండా చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు శాసనసభ వీడియో టేపులను తీసుకెళ్లటంపై స్పీకర్ తన స్పందన ఏమిటో చెప్పలేదన్నారు.
వీడియో టే పులను ఎడిట్ చేసి ప్రతిపక్ష సభ్యులు అల్లరి చేస్తున్నట్లు చూపించటం స్పీకర్ కుట్రలో భాగంగా కాదా అని నిలదీశారు. ఇది మీ పాత సంస్కృతికి అద్దం పడుతోందన్నారు. పార్టీ, పార్టీ జెండాలు ఉన్న వేదికలకు స్పీకర్లు దూరంగా ఉంటారని గోపిరెడ్డి పేర్కొన్నారు. కానీ పార్టీ, పార్టీ జెండాలు లేకుండా మీరు ఏ కార్యక్రమంలోనైనా పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం లేకుండా శాసనసభను నడపటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ దుశ్చర్యలకు స్పీకర్ వంతపాడుతున్నారని ఆరోపించారు. స్పీకర్, ప్రభుత్వం తీరును ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని చెప్పారు. ప్రజాపోరాటాలతో ప్రభుత్వ దురాగతాలను ఎండగడతామని హెచ్చరించారు.