వాల్మీకుల సంక్షేమానికి కృషి | valmiki MLA B Gurunath reddy excelled in all fields | Sakshi
Sakshi News home page

వాల్మీకుల సంక్షేమానికి కృషి

Published Sat, Oct 19 2013 2:52 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

valmiki  MLA B Gurunath reddy excelled in all fields

 అనంతపురం సిటీ, న్యూస్‌లైన్ : వాల్మీకులు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి పిలుపునిచ్చారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రుద్రంపేట కూడలిలోని వాల్మీకి కల్యాణమంటపంలో శుక్రవారం వాల్మీకి జయంతి సభ నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ ఎం.గేయానంద్‌తో పాటు ఎమ్మెల్యే ప్రసంగించారు.
 
 వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించి, వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ రామాయణ కావ్యాన్ని సంస్కృతంలో అందించిన ఆది కవి వాల్మీకి అని కొనియాడారు. ఇకపై ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే వాల్మీకి జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు వాల్మీకి జీవిత విశేషాలను తెలుసుకునే విధంగా వ్యాస రచన, సాంస్కృతిక పోటీలు
 నిర్వహిస్తామన్నారు.
 
 అనంతరం వాల్మీకి నేతలు మాట్లాడుతూ.. వాల్మీకులు సంఘటితమై తమ హక్కుల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు కూడా వాల్మీకులను గుర్తించి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేర్చి.. అభ్యున్నతికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తొలుత విద్యుత్ కార్యాలయం వద్ద ఉన్న వాల్మీకి విగ్రహానికి పూల మాలలు వేసి.. ఘన నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీఓ హుసేన్‌సాబ్, బీసీ వెల్ఫేర్ ఇన్‌చార్జ్ డీడీ రామాంజనేయులు, బీసీ కార్పొరేషన్ ఈడీ నాగముని, నగరపాలక సంస్థ కమిషనర్ రంగయ్య, ప్రముఖ సర్జన్ డాక్టర్ టి.మురళీకృ ష్ణ, వాల్మీకి సంఘం నాయకులు బోయ తిరుపాల్, రామాంజనేయులు, శ్రీధర్, సరోజమ్మ, సుశీలమ్మ, లీలావతి, ప్రభాకర్, గంగాధర్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
 అధికారంలోకి వచ్చాక
 వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం  
 వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తామని ఆ పార్టీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలోని వాల్మీకి భవన్‌లో శుక్రవారం ఆయన వాల్మీకి సంఘం నేత బోయ తిరుపాల్ అధ్యక్షతన నిర్వహించిన వాల్మీకి జయంతి సభలో మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు రంగం సిద్ధం చేశారని గుర్తు చేశారు. ఆయన హఠాన్మరణం తర్వాత ఆ ఫైలును ప్రభుత్వం మరుగున పడేసిందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చుతామని వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మొదటి ప్లీనరీ సమావేశంలో హామీ ఇచ్చారన్నారు. వాల్మీకులను విస్మరించే వారికి రాజకీయ మనుగడ ఉండదన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement