B.gurunath reddy
-
ఎన్నికల్లో గెలుపోటములు సహజమే
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: ఎవ్వరూ అధైర్యపడవద్దు... ఓటమి కి కుంగిపోవద్దు... ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమే... ప్రజాతీర్పును శిరసావహించి ధైర్యంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బి.గురునాథ్‌రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం తన నివాసంలో అర్బన్ నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించారు. ప్రజాతీర్పును గౌరవించాలని సూచించా రు. ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవద్దని, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకునేందుకు తన ఇంటి తలుపులు తెరచి ఉంటాయని భరోసా ఇచ్చారు. 30 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీతో మూడేళ్ల క్రితం పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడిందన్నారు. ఇరుపార్టీల నడుమ ఓట్ల శాతం అతి స్వల్పమేనన్నారు. 67 ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకుని సమర్థవంతమైన ప్రతిపక్షంగా నిలిచామన్నారు. పాలనలో ప్రభుత్వానికి సహకరిస్తూనే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పోరుబాట పడతామన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా... పదేళ్లు ప్రతిపక్షనేతగా పనిచేసినా ఏనా డూ ప్రజాసంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసమస్యలపై ఎన్నో దీక్షలు, ధర్నాలు, పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఎవరైనా శిరసావహించాల్సిందేనన్నారు. ఈ ఐదేళ్లు ప్రజ ల మధ్యలో ఉండి, వారి సమస్యల పరి ష్కారానికి కలసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ఆదరిస్తారని సూచించారు. సమావేశంలో మైనార్టీ నేత సాలార్‌బాషా, పార్టీ నగర కమిటీ అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, సిటీ యూ త్ అధ్యక్షుడు మారుతీనాయుడుతో పా టు గెలుపొందిన కార్పొరేటర్లు, డివిజన్ కమిటీ నాయకులు, మహిళా విభాగం, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
రాజకీయ చైతన్య ప్రతీక
రెడ్డి సామాజిక వర్గానికే ఆదరణ 15 ఎన్నికల్లో 11 సార్లు వారికే పట్టం బీఎన్ఆర్ కుటుంబానికి ఐదుసార్లు ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు నిలయమైన అనంతపుంర అర్బన్ శాసనసభా నియోజక వర్గం రాజకీయ చైతన్యానికి నిదర్శనం. 1952లో ఏర్పడిన ఈనియోజక వర్గంలో ఇప్పటివరకు రెండు ఉప ఎన్నికలతో సహా 15 సార్లు ఎన్నికలు జరిగాయి. గతంలో మునిసిపాలిటీతో పాటు బుక్కరాయసముద్రం, రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాలు నియోజక వర్గంలో ఉండేవి. 2009లో నియోజక వర్గాల పునర్విభజన తరువాత నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 50 డివిజన్లతో పాటు రూరల్ మండల పరిధిలోని ఎ.నారాయణపురం, రుద్రంపేట, రాజీవ్‌కాలనీ, రూరల్ పంచాయతీలు మాత్రమే నియోజక వర్గం పరిధిలోకి వచ్చాయి. బుక్కరాయసముద్రం, రాప్తాడు, రూరల్ మండలంలోని ఇతర పంచాయతీలు వేర్వేరు నియోజక వర్గాల పరిధిలోకి వెళ్లాయి. నియోజక వర్గంలో గ్రామీణ ప్రాంత ఓటర్లు కేవలం 24 వేల మంది ఉన్నారు. మిగతా 2.17 లక్షల మంది నగరంలో ఉన్నారు. సమస్యల పరిష్కారం కోసం పరితపించే అభ్యర్థిని ఎన్నుకుంటూ.. పట్టించుకోని నాయకున్ని పక్కనపెడుతూ వస్తున్నారు. {పధానంగా తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, మురికికాలువలు, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ లాంటి సమస్యలు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి. బలిజలు, ముస్లింలు, ఆర్యవైశ్యులు, రెడ్లు, కమ్మ, క్రిస్టియన్ వర్గాలతో పాటు {శామిక వర్గాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల ప్రాబల్యం ఎక్కువ. అనంత అభివృద్ధిలో ‘వైఎస్’ మార్క అనంతపురం ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. తాత్కాలికంగా కాకుండా కనీసం 40 ఏళ్ల పాటు దాహార్తి సమస్య ఏర్పడకుండా పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి ఒక టీఎంసీ నీళ్లు అనంతపురం నగరానికి తీసుకురావడానికి రూ.67 కోట్లు వెచ్చించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.15 కోట్లతో రహదారుల నిర్మాణం, అనంతపురం-తాడిపత్రి రహదారికి రూ.55 కోట్లు వెచ్చించి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. వర్షం వస్తే మురుగునీరు రోడ్లు, నివాసాల్లోకి రాకుండా ఉండేందుకు నగరంలో ప్రధాన వంకలైన మరువవంక, నడిమివంకలకు రూ.56 కోట్లు మంజూరు చేసిన కరకట్టలు నిర్మించారు. వైఎస్ హయాంలో నగరంలోని పేద వర్గాలకు ఇందిరమ్మ పథకం కింద 2,200 ఇళ్లు నిర్మించి ఇచ్చారు. వేలాది మంది అభాగ్యులు, వద్దులు, వికలాంగులు, వితంతువులకు ఫించన్లు మంజూరు చేశారు. ఇలా అర్బన్ నియోజక వర్గం అభివద్ధికి మహానేత వైఎస్ హయాంలో బాటలు వేశారు. ఫలితంగా ప్రజలు వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీకి మరోమారు పట్టం కట్టేందుకు ఎదురుచూస్తున్నారు. బీఎన్ఆర్ కుటుంబంపై విశ్వాసం ప్రస్తుత ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, ఆయన సోదరుడు బి.నారాయణరెడ్డి (బీఎన్ఆర్)కు నియోజక వర్గ ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు. గురునాథరెడ్డి రెండుసార్లు, బి.నారాయణరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గురునాథ్‌రెడ్డి కుటుంబం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో ఈ నియోజక వర్గం ఇపుడు వైఎస్సార్సీపీకి కంచుకోటగా మారింది. టీడీపీ ఆవిర్భవించిన తరువాత జరిగిన తొలి రెండు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రాను రాను తెలుగుదేశం పార్టీ బలహీనపడుతూ ప్రత్యర్థులకు భారీ మెజార్టీ కట్టబెడుతున్నారు. 1985, 1989 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా ఆ తరువాత పొత్తులో భాగంగా 1994 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి అనంతపురం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీఎన్ఆర్ కుటుంబ సభ్యులు వరుసగా విజయాలు నమోదు చేస్తున్నారు. దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకమునుపే ప్రచారపర్వంలో దూసుకుపోతోంది. పార్టీ అభ్యర్థి బి.గురునాథరెడ్డి మరోసారి ఫ్యాన్ గాలిని రెపరెపలాడించే దిశగా పయనిస్తున్నారు. బలిజ, రెడ్లు, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్, ఆర్యవైశ్యులు, ఉద్యోగ వర్గాల, శ్రామికుతో పాటు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ వర్గాల ఓట్లు ఎక్కువగా వైఎస్సార్సీపీకి పడే సూచనలు ఉన్నాయి. ప్రజాసమస్యలపై తక్షణం స్పందించే గుణం ఉండటంతో గురునాథరెడ్డిని ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ డీలా నోటిఫికేషన్ విడుదలైనా ఇంకా అభ్యర్థి ఎంపికలో నెలకొన్న గందరగోళం వల్ల టీడీపీ, బీజేపీలు డీలా పడగా... కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. టీడీపీలో నెలకొన్న కుమ్ములాటల వల్ల ఈ సారి పొత్తులో భాగంగా అర్బన్ సీటు బీజేపీకి కేటాయించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతున్నా ఇప్పటికే తేలకపోవడంతో ఆయా పార్టీల శిబిరాల్లో నిరుత్సాహం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. టీడీపీలో ఎవరికి టికెట్టు ఇచ్చినా మరోవర్గం సహకరించే పరిస్థితి లేదు. లేదా బీజేపీకి ఇచ్చినా టీడీపీ వర్గాల నుంచి సహకారం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇరు పార్టీలు, ఇరు వర్గాల నడుమ ఆశించిన సఖ్యత లేకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఢీకొట్టే పరిస్థితి కనిపించడం లేదు -
సమాజంపై సినిమాల ప్రభావం అధికం
అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్ : సమాజంపై సినిమాల ప్రభావం అధికంగా ఉంటుందని, భారతావని దాస్య శృంఖలాలను తెంచుకుని స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి ఆనాటి సినిమా మాధ్యమం ఎంతో దోహదం చేసిందని ఎమ్మెల్యే బీ.గురునాథరెడ్డి అన్నారు. అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు 73వ వర్ధంతి సందర్భంగా శనివారం స్థానిక ఎస్ఎస్ ప్యారడైజ్‌లో తొలిసారిగా శనివారం లఘు చిత్రాల ఉత్సవాన్ని(ఫిల్మ్ ఫెస్టివల్)ను నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుపతి వెంకయ్య చిత్రపటం ఎదుట కాండిల్స్ వెలిగించి నివాళులర్పించారు. ఈ ఉత్సవాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. హెచ్ డీ విజన్ ఇండియా అనంత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు రషీద్ బాషా కార్యక్రమానికి అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు జనప్రియ కవి ఏలూరు యెంగన్న, వినియోగదారుల రక్షణ సమాఖ్య జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి, బళ్ళారి రాఘవ పురస్కార గ్రహిత మల్లేశ్వరయ్య, తదితరులు ముఖ్య అతిథులు పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు కూడా చలనచిత్ర పరిశ్రమతో అంతోఇంతో పరిచయ భాగ్యముందని, ఆసక్తి ఉండి అవకాశాల కోసం ఎదురు చూసే కళాకారులకు తన వంతు సాయమందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే తెలుగు వారు చలనచిత్రాలలో సాంకేతిక పరమైన జ్ఞానంతో సంచలనాలు సృష్టించారని, సమాజంపై అధిక ప్రభావం చూపే సినిమా సందేశాత్మకంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా అనంత వాసులు చిత్ర రంగంలో ఎన్నో దశాబ్దాల కిందటే పలువురికి ఆదర్శంగా నిలిచారని, మరోసారి హెచ్డీ విజన్ వారు ఔత్సాహికులను ప్రోత్సహించడం హర్షణీయమఇన అన్నారు. చిత్ర రంగానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మహానటులతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య నాయుడు వంటి మహామహులను ఎప్పటికీ గుర్తుంచుకోవలన్నారు. త్వరలో పెద్ద చిత్రాలతో కూడిన చిత్రోత్సవం జరగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. చలన చిత్ర పరిశ్రమను ‘అనంత’ వేదికగా అభివద్ధి చేయాలనే తలంపుతో చిత్రోత్సవాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నట్టు నిర్వాహకులు రషీద్బాషా తెలిపారు. ప్రతిభ కల్గి అవకాశం లేని వారు తమ సంస్థ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం కావచ్చని తెలిపారు. కవి అంకె రామలింగయ్య, అనంత కళా వాహిని ప్రధాన కార్యదర్శి రమేష్ వాఖ్యాతలుగా వ్యవహరించారు. హిందీ కవి మహమ్మద్ పీరా, గురురాజ్, తదితరులు పాల్గొన్నారు. లఘు చిత్రాల సందడి అనంతపురం ఫిల్మ్ ఫెస్టివల్లో ముంబై, పూనే, విశాఖపట్నం, హైదరాబాదుతో పాటు అనంతలో తీసిన లఘు చిత్రాలలో ఉత్తమంగా ఎంపికైన వాటిని ప్రదర్శించారు. రషీద్ బాషా తీసిన ‘ధ్వజం’తో చిత్రోత్సవం ప్రారంభమైంది. దాదాపు 15 చిత్రాలను ఎమ్మెల్యేతో పాటు ఆహూతులందరూ తిలకించారు. స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో సాగిన ధ్వజం చిత్రం అమితంగా ఆకట్టుకుంది. ‘సమ్‌థింగ్ స్పెషల్’, ‘అలా ఎలా సెట్లైంది’, ‘నేచర్ బీడ్స్’, ‘ఆశా’, ‘యాసిడ్ ఫ్యాక్టరీ’, ‘క్యాచ్ మి ఇఫ్యూ కాంట్’ వంటి జనాదరణ పొందిన లఘు చిత్రాలు సందడి చేసాయి. -
వాల్మీకుల సంక్షేమానికి కృషి
అనంతపురం సిటీ, న్యూస్‌లైన్ : వాల్మీకులు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి పిలుపునిచ్చారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రుద్రంపేట కూడలిలోని వాల్మీకి కల్యాణమంటపంలో శుక్రవారం వాల్మీకి జయంతి సభ నిర్వహించారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ ఎం.గేయానంద్‌తో పాటు ఎమ్మెల్యే ప్రసంగించారు. వాల్మీకులను ఎస్టీలుగా గుర్తించి, వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ రామాయణ కావ్యాన్ని సంస్కృతంలో అందించిన ఆది కవి వాల్మీకి అని కొనియాడారు. ఇకపై ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే వాల్మీకి జయంతిని పురస్కరించుకుని విద్యార్థులు వాల్మీకి జీవిత విశేషాలను తెలుసుకునే విధంగా వ్యాస రచన, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తామన్నారు. అనంతరం వాల్మీకి నేతలు మాట్లాడుతూ.. వాల్మీకులు సంఘటితమై తమ హక్కుల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు కూడా వాల్మీకులను గుర్తించి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేర్చి.. అభ్యున్నతికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తొలుత విద్యుత్ కార్యాలయం వద్ద ఉన్న వాల్మీకి విగ్రహానికి పూల మాలలు వేసి.. ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీఓ హుసేన్‌సాబ్, బీసీ వెల్ఫేర్ ఇన్చార్జ్ డీడీ రామాంజనేయులు, బీసీ కార్పొరేషన్ ఈడీ నాగముని, నగరపాలక సంస్థ కమిషనర్ రంగయ్య, ప్రముఖ సర్జన్ డాక్టర్ టి.మురళీకృ ష్ణ, వాల్మీకి సంఘం నాయకులు బోయ తిరుపాల్, రామాంజనేయులు, శ్రీధర్, సరోజమ్మ, సుశీలమ్మ, లీలావతి, ప్రభాకర్, గంగాధర్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాక వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తామని ఆ పార్టీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలోని వాల్మీకి భవన్లో శుక్రవారం ఆయన వాల్మీకి సంఘం నేత బోయ తిరుపాల్ అధ్యక్షతన నిర్వహించిన వాల్మీకి జయంతి సభలో మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు రంగం సిద్ధం చేశారని గుర్తు చేశారు. ఆయన హఠాన్మరణం తర్వాత ఆ ఫైలును ప్రభుత్వం మరుగున పడేసిందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్చుతామని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మొదటి ప్లీనరీ సమావేశంలో హామీ ఇచ్చారన్నారు. వాల్మీకులను విస్మరించే వారికి రాజకీయ మనుగడ ఉండదన్నారు.