అనంతపురం కల్చరల్, న్యూస్‌లైన్ : సమాజంపై సినిమాల ప్రభావం అధికంగా ఉంటుందని, భారతావని దాస్య శృంఖలాలను తెంచుకుని స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి ఆనాటి సినిమా మాధ్యమం ఎంతో దోహదం చేసిందని ఎమ్మెల్యే బీ.గురునాథరెడ్డి అన్నారు. అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు 73వ వర్ధంతి సందర్భంగా శనివారం స్థానిక ఎస్‌ఎస్ ప్యారడైజ్‌లో తొలిసారిగా శనివారం లఘు చిత్రాల ఉత్సవాన్ని(ఫిల్మ్ ఫెస్టివల్)ను నిర్వహించారు.
ఈ సందర్భంగా రఘుపతి వెంకయ్య చిత్రపటం ఎదుట కాండిల్స్ వెలిగించి నివాళులర్పించారు. ఈ ఉత్సవాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. హెచ్ డీ విజన్ ఇండియా అనంత ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకులు రషీద్ బాషా కార్యక్రమానికి అధ్యక్షతన వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు జనప్రియ కవి ఏలూరు యెంగన్న, వినియోగదారుల రక్షణ సమాఖ్య జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి, బళ్ళారి రాఘవ పురస్కార గ్రహిత మల్లేశ్వరయ్య, తదితరులు ముఖ్య అతిథులు పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు కూడా చలనచిత్ర పరిశ్రమతో అంతోఇంతో పరిచయ భాగ్యముందని, ఆసక్తి ఉండి అవకాశాల కోసం ఎదురు చూసే కళాకారులకు తన వంతు సాయమందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే తెలుగు వారు చలనచిత్రాలలో సాంకేతిక పరమైన జ్ఞానంతో సంచలనాలు సృష్టించారని, సమాజంపై అధిక ప్రభావం చూపే సినిమా సందేశాత్మకంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా అనంత వాసులు చిత్ర రంగంలో ఎన్నో దశాబ్దాల కిందటే పలువురికి ఆదర్శంగా నిలిచారని, మరోసారి హెచ్‌డీ విజన్ వారు ఔత్సాహికులను ప్రోత్సహించడం హర్షణీయమఇన అన్నారు. చిత్ర రంగానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మహానటులతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య నాయుడు వంటి మహామహులను ఎప్పటికీ గుర్తుంచుకోవలన్నారు. త్వరలో పెద్ద చిత్రాలతో కూడిన చిత్రోత్సవం జరగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. చలన చిత్ర పరిశ్రమను ‘అనంత’ వేదికగా అభివద్ధి చేయాలనే తలంపుతో చిత్రోత్సవాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నట్టు నిర్వాహకులు రషీద్‌బాషా తెలిపారు. ప్రతిభ కల్గి అవకాశం లేని వారు తమ సంస్థ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం కావచ్చని తెలిపారు. కవి అంకె రామలింగయ్య, అనంత కళా వాహిని ప్రధాన కార్యదర్శి రమేష్ వాఖ్యాతలుగా వ్యవహరించారు. హిందీ కవి మహమ్మద్ పీరా, గురురాజ్, తదితరులు పాల్గొన్నారు.
లఘు చిత్రాల సందడి
అనంతపురం ఫిల్మ్ ఫెస్టివల్‌లో ముంబై, పూనే, విశాఖపట్నం, హైదరాబాదుతో పాటు అనంతలో తీసిన లఘు చిత్రాలలో ఉత్తమంగా ఎంపికైన వాటిని ప్రదర్శించారు. రషీద్ బాషా తీసిన ‘ధ్వజం’తో చిత్రోత్సవం ప్రారంభమైంది. దాదాపు 15 చిత్రాలను ఎమ్మెల్యేతో పాటు ఆహూతులందరూ తిలకించారు. స్వాతంత్య్ర దినోత్సవ నేపథ్యంలో సాగిన ధ్వజం చిత్రం అమితంగా ఆకట్టుకుంది. ‘సమ్‌థింగ్ స్పెషల్’, ‘అలా ఎలా సెట్లైంది’, ‘నేచర్ బీడ్స్’, ‘ఆశా’, ‘యాసిడ్ ఫ్యాక్టరీ’, ‘క్యాచ్ మి ఇఫ్‌యూ కాంట్’ వంటి జనాదరణ పొందిన లఘు చిత్రాలు సందడి చేసాయి.
సమాజంపై సినిమాల ప్రభావం అధికం
Published Sun, Mar 16 2014 3:14 AM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM
Advertisement