అన్నదాత ఆక్రందన
– 4.75 లక్షల హెక్టార్లలో ఎండిన వేరుశనగ
– వర్షం వచ్చినా దిగుబడి కష్టమే
– నీటి కొరత వేధిస్తున్నా రెయిన్‌గన్ల ద్వారా హడావిడి
– 36 వేల హెక్టార్లను తడిపినట్లు తప్పుడు గణాంకాలు
అనంతపురం అగ్రికల్చర్ :
+ అమడగూరు మండలంలో 6,064 హెక్టార్లలో వేరుశనగ పంట సాగైంది. ఇందులో 450 హెక్టార్లలో పంట ఎండిపోతుండగా 62 రెయిన్‌గన్లు, 62 స్ప్రింక్లర్ సెట్ల ద్వారా ఇప్పటికే 483 హెక్టార్లకు రక్షకతడి ఇచ్చినట్లు అధికారులు నివేదిక తయారు చేశారు. వాస్తవానికి వస్తే 5 వేల హెక్టార్లకు పైబడి విస్తీర్ణంలో పంట ఎండింది. 62 రెయిన్‌గన్లు ఇచ్చినా అందులో కొన్ని అధికార పార్టీ నేతల ఇళ్ల దగ్గర పెట్టుకున్నారు. 40 రెయిన్‌గన్ల ద్వారా ఇప్పటివరకు 206 హెక్టార్ల పంటకు మాత్రమే రక్షకతడి ఇచ్చారు.
+ తనకల్లు మండలంలో 8,812 హెక్టార్లలో వేరుశనగ వేశారు. 88 రెయిన్‌గన్లు, 88 స్ప్రింక్లర్ సెట్ల ద్వారా 871 హెక్టార్లలో పంటకు రక్షకతడి ఇచ్చి కాపాడినట్లు అధికారుల నివేదిక చెబుతోంది. వాస్తవానికి ఈ మండలంలో 4,800 హెక్టార్లలో పంట ఎండుముఖం పట్టింది. పది రోజులుగా 50 నుంచి 59 రెయిన్‌గన్ల ద్వారా 350 హెక్టార్లకు మించి రక్షకతడి ఇవ్వలేదు. ఈ రెండు మండలాల్లోనే కాదు.. దాదాపు అన్ని మండలాల్లోనూ ఇలాంటి లెక్కలే కన్పిస్తున్నాయి.
+ వేరుశనగ పంట సర్వనాశనమై అన్నదాత ఇంట ఆక్రందనలు వినిపిస్తున్నా జిల్లా యంత్రాంగం మాత్రం ముఖ్యమంత్రి మెప్పు కోసం ఆరాటపడుతోంది. ఏడెనిమిది రోజులుగా రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్ల ద్వారా రక్షకతడులంటూ హడావిడి చేస్తున్నారు. అయితే.. నీటి కొరత కారణంగా ఆశించిన స్థాయిలో ఇవ్వలేని పరిస్థితి. అధికారులు మాత్రం రెయిన్‌గన్ల ద్వారా ఇప్పటికే రూ.200 కోట్ల విలువ చేసే వేరుశనగ పంటను కాపాడి.. ప్రభుత్వానికి రూ.40 కోట్ల వరకు పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) మిగిలేలా చేశామంటూ తప్పుడు గణాంకాలు నమోదు చేశారు.
5.75 లక్షల హెక్టార్లలో ఎండిన పంట
ఈ సారి ముందస్తు వర్షాలు మురిపించడంతో జూన్‌లో 3.55 లక్షల హెక్టార్లు, జూలైలో 1.90 లక్షల హెక్టార్లు, ఆగస్టులో 61 వేల హెక్టార్లు... మొత్తం 6.06 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వేరుశనగ వేసినట్లు అధికారిక నివేదిక చెబుతోంది. జూలై 29 తర్వాత వర్షం జాడ కనిపించలేదు. దీంతో 4.75 లక్షల హెక్టార్ల పంట పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పుడు వర్షం వచ్చినా పండే పరిస్థితి లేదు. ఈ నెలలో ఒక్క మండలంలో కూడా కనీసం పదును వర్షం పడకపోవడం గమనార్హం. 88.7 మిల్లీమీటర్ల(మి.మీ) సాధారణ వర్షాపాతానికి గానూ కేవలం 4.5 మి.మీ వర్షం కురిసింది. 95 శాతం లోటు వర్షపాతం ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడుల రూపంలో దాదాపు రూ.1,000 కోట్ల వరకు భూమిలో పోయడంతో రైతుల ఇంట దయనీయ పరిస్థితులు కన్పిస్తున్నాయి.
ఫలితం ఇవ్వని రెయిన్‌గన్లు
ఒక్క ఎకరా పంట కూడా ఎండకుండా రక్షక తడులతో కాపాడతామంటూ రాష్ట్ర సర్కారు గొప్పలు చెప్పింది. రక్షకతడుల కోసమంటూ 4,621 రెయిన్‌గన్లు, 4,279 స్ప్రింక్లర్ సెట్లు, 2,859 డీజిల్ ఇంజిన్లు, 1.28 లక్షల హెచ్‌డీ పైపులను జిల్లాకు కేటాయించింది. వాటిని పంట విస్తీర్ణాన్ని బట్టి మండలాల వారీగా సరఫరా చేశారు. అయితే..రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో భూగర్భజలాలు 19 మీటర్ల సగటు లోతుకు పడిపోయాయి. ఎక్కడా నీరు సమృద్ధిగా లభించని పరిస్థితి. దీని గురించి ఆలోచించకుండా అధికారులు పరికరాల సరఫరాతో సరిపెట్టారు. వీటిని తమకు స్వాధీనం చేయాలని అధికార పార్టీకి చెందిన మండల, గ్రామ స్థాయి నేతలు ఎక్కడికక్కడ అధికారులకు హుకుం జారీ చేయడంతో పంపిణీ ఇష్టారాజ్యమైంది.
గణాంకాలపై అనుమానాలు
నీరు అందుబాటులో లేకపోవడంతో రెయిన్‌గన్లను చాలా వరకు ఉపయోగించలేదు. 4,621 రెయిన్‌గన్లు జిల్లాకు చేరాయని, ఇందులో 3,461 ఉపయోగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మరి మిగతా వాటి పరిస్థితి ఏమిటనేది చెప్పడం లేదు. జిల్లా అంతటా పంట దారుణంగా ఎండిపోతుండగా.. ఈ నెల 26న సాయంత్రం తయారు చేసిన అధికారిక నివేదికలో మాత్రం 46 వేల హెక్టార్లలో పంట ఎండిపోతోందని, ఇప్పటివరకు 26 వేల హెక్టార్లకు రక్షకతడులు ఇచ్చామని పేర్కొన్నారు. అయితే.. అమడగూరు, తనకల్లు మండలాల మాదిరిగానే మిగతా అన్ని మండలాలకు సంబంధించి తప్పుడు నివేదికలు తయారు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.