విలువైన ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం
Published Fri, Mar 3 2017 7:38 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
ఇచ్ఛాపురం : కూరగాయల పెట్టెల చాటున గుట్టుగా తరలిస్తున్న ఖైనీ ప్యాకెట్ల బాక్సులను గురువారం ఇచ్ఛాపురం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజా, మిరాజ్ ఖైనీ ప్యాకెట్ల బాక్సులతో వస్తున్న ఏపీ16 టీఏ 0575 నంబరు గల ఎయిచెర్ వ్యాన్, పైలట్‌గా వ్యవహరిస్తున్న ఏపీ 31 సీడబ్ల్యూ 2488 నంబరు గల మారుతి డిజైర్ కారును ఇచ్ఛాపురం శివారులోని ధనరాజ్ తులసమ్మ ఆలయం సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను తనిఖీ చేయగా కూరగాయల స్ట్రేల మాటున 190 బాక్సుల్లో రూ.8,65,200 విలువైన ఖైనీ ప్యాకెట్ల బాక్సులు కనిపించాయి.
ఈ ఘటనలో కోన వెంకట బాల సింహాచలం అలియాస్ శ్రీను, ద్వారపూడి స్వామినాయుడు అలియాస్ బుజ్జి, పెంటకోట శివప్రసాద్ అలియాస్ శివ, లగుడు సత్యనారాయణ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి, బరంపురం నుంచి వీటిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన వ్యాపారి ఈ వ్యానును బుక్ చేసుకొని మాములు సరుకును ఒడిశాకు తీసుకెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఖైనీ పాకెట్లను తీసుకువస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు. కొత్తవలస పోలీసులకు కూడా సమాచారం అందించామని తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయమున్న ప్రతి ఒక్కరినీ అరెస్టు చేస్తామని చెప్పారు. గతంలోనూ ఈ వాహనం పట్టుబడి కేసు నమోదైనట్లు ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, డీఎస్పీ వివేకానంద తెలిపారు. వీరితో పాటు సీఐ అవతారం, ఎస్‌ఐలు మంగరాజు, చిన్ననాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement