రాజమండ్రి రూరల్ : రాజమండ్రి సెంట్రల్ జైలు వార్డర్‌ను కిడ్నాప్ చేసి రూ.10 వేలు డిమాండ్ చేసిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం రంగంపేట గ్రామానికి కంటిపూడి నరేంద్ర ఉద్యోగాలు వెతుక్కునేందుకు హైదరాబాద్ వెళ్లే నిమిత్తం సోమవారం రాత్రి హౌసింగ్ బోర్డు కాలనీలోని స్నేహితుడు, రాజమండ్రి సెంట్రలు జైలు వార్డర్ అయిన మురళీకిషోర్ ఇంటికి వచ్చాడు. స్నేహితులు ఫణి, ఆనంద్‌లతో కలిసి దివాన్‌చెరువులోని ఓ ధాబాకు వెళ్లాడు. అదే ధాబా వద్ద రాజమండ్రికి చెందిన పైడి శాండీ, కరుటూరి చాణక్య, షకిల్ సునందబాబు, అనిరుది శ్యామ్‌కుమార్‌లు అప్పటికే మద్యం తాగి ఉన్నారు.
తాగిన మైకంలో వారు నరేంద్ర, అతడి స్నేహితులను పరుషపదజాలంతో తిడుతూ గొడవపడ్డారు. ఈలోగా నరేంద్ర జైలు వార్డర్ మురళీ కిషోర్‌కు ఫోన్‌లో విషయం తెలిపాడు. దీంతో ఆయన హుటాహుటిన దివాన్‌చెరువులోని ఆ ధాబావద్దకు వచ్చాడు. ఆయనను శాండీ, అతడి స్నేహితులు బీరు బాటిల్‌తో కొట్టి, బెదిరించి కారులో ఎక్కించుకుని పరారయ్యారు. నరేంద్రకు వార్డర్ సెల్ ఫోన్ నుంచి కాల్ చేసి రూ.10 వేలు ఇస్తే కానీ కిషోర్‌ను వదిలేది లేదని చెప్పారు. ఆ డబ్బులు తీసుకుని ఏవీ అప్పారావు రోడ్డులోకి కానీ, సెంట్రల్ జైల్ పెట్రోలు బంకు వద్దకు కానీ రావాలని తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల వరకూ ఈ వ్యవహారం సాగుతూనే ఉంది. దీంతో ఈ విషయాన్ని నరేంద్ర బొమ్మూరు పోలీసులకు తెలిపాడు.
వారి సూచన మేరకు డబ్బులు ఇస్తామని చెప్పి పెట్రోలు బంకు వద్దకు పోలీసులతో కలిసి వెళ్లాడు. పోలీసులను గమనించిన నిందితులు వార్డర్ మురళీకిషోర్‌ను విడిచిపెట్టి పరారయ్యారు. నరేంద్ర ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై కిషోర్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వార్డర్ కిడ్నాప్ కేసులో శాండీతోపాటు అతడి స్నేహితులు చాణక్య, సునందబాబు, శ్యామ్‌కుమార్‌లను పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. వారినుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురు యువకులూ ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు సమాచారం.
జైలు వార్డర్ కిడ్నాప్
Published Wed, Aug 5 2015 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM
Advertisement
Advertisement