సెంట్రల్ జైల్‌లో గం‘జాయ్’
Published Thu, Nov 28 2013 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ :అనేక నేరాలకు క్షణికావేశమో, విచక్షణాజ్ఞానాన్ని నశింపజేసే మత్తో కారణమవుతుంటాయి. నేరాలకు పాల్పడి, శిక్షలు పడ్డ వారిని చెడునడత నుంచి తప్పించి, సంస్కరించడమే జైళ్ల లక్ష్యం. అయితే అలాంటి చోటే ఖైదీలకు మాదకద్రవ్యాలు యథేచ్ఛగా అందుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఖైదీలకు గంజాయి సరఫరా అయిన ఘటనలే ఇందుకు సాక్ష్యం. కాసులకు కక్కుర్తిపడి కొందరు అధికారులు, సిబ్బంది ఈ అక్రమానికి పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో తనిఖీల్లో బయటపడుతున్నప్పటికీ ఉన్నతాధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడమూ ఇందుకు కారణమవుతోంది. జైలు గార్డుల్లో కొందరు రాత్రి షిఫ్ట్‌లకు వెళ్లే సమయంలో గంజాయిని బూట్లలో, తినుబండారాల్లో పెటి లోపలికి చేరవేస్తున్నారు. 50 గ్రాముల గంజాయిని జైలులోకి తరలిస్తే గార్డుకు రూ.500 చెల్లిస్తున్నట్టు సమాచారం. ఇలా తరలించిన గంజాయిని లోపల నమ్మకస్తులైన ఖైదీల ద్వారా బీడీల్లో కూరి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. గంజాయి కూరిన రెండు బీడీలు రూ.50, నాలుగు బీడీలు రూ. 100 చొప్పున అమ్ముతున్నట్టు తెలుస్తోంది.
ఏజెన్సీ, తెలంగాణ ప్రాంతాల నుంచి..
జిల్లాలోని ఏజెన్సీ నుంచి, తెలంగాణ లోని కొన్ని ప్రాంతాల నుంచి వస్తున్న గంజాయిని కొంతమంది గార్డుల ద్వారా జీవిత ఖైదీలకు అందజేస్తారు. గంజాయి గార్డుల ద్వారానే కాక ఖైదీలకు బంధువులు ఇచ్చే తినుబండారాల ద్వారా కూడా సరఫరా అవుతోంది. జైల్‌లో ఉన్న ఒక ఖైదీని చూసేందుకువచ్చిన బంధువులు ఇచ్చిన బిస్కెట్ ప్యాకెట్లో గంజాయి ఉన్నట్టు అధికారులు తనిఖీలలో గుర్తించారు. దీనిపై అధికారులు ఖైదీపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ నెల 23న రాత్రి డ్యూటీకి వెళ్లిన వార్డర్ నెంబర్ (168) సీహెచ్ రమేష్ 150 గ్రాముల గంజాయితో పట్టుపడ్డాడు. మెయిన్‌గేట్టు వద్ద విధులు నిర్వహిస్తున్న చీఫ్ హెడ్ వార్డర్ సుబ్రహ్మణ్యం రమేష్‌ను తనిఖీ చేయగా అతడి బూట్లలో గంజాయి లభించింది. గతంలో ఇలాంటి సంఘటలు అనేకం జరిగినా అధికారులు ముద్దాయిలు, వార్డర్ల వద్ద లంచం తీసుకుంటూ వాటిని గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం. ఐదు నెలల క్రితం తమిళనాడుకు చెందిన శక్తివేలు అనే ముద్దాయికి హై సెక్యూరిటీ వార్డు బ్లాక్ వద్ద రెండో టవర్ నుంచి నరేష్ అనే వార్డర్ సెల్ ఫోన్ అందించిన సంఘటన కూడా జైలు సిబ్బంది లంచగొండితనానికి ఉదాహరణ. ఈ సంఘటనకు సంబంధించి అధికారులు ముద్దాయి శక్తివేలు నుంచి, వార్డర్ నరేష్ నుంచి లంచం తీసుకుని వదిలి వేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వార్డర్‌పై విచారణ జరుగుతోంది..
ఈ నెల 23న శనివారం సెంట్రల్ జైల్‌లోకి గంజాయిని తీసుకువెళుతున్న వార్డర్‌కు మెమో ఇచ్చాము. దీనిపై విచారణ జరుగుతోంది. జైల్‌లోకి వెళ్లే వారిపై గట్టి నిఘా ఏర్పాటు చేశాం. ప్రతి వారినీ క్షుణంగా తనిఖీ చేసి పంపుతున్నాం. ఎవరి వద్దనైనా మాదకద్రవ్యాలు లభిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జైల్ లోపల గంజాయి అమ్మకాలు జరగడం లేదు. గస్తీని ముమ్మరం చేశాం.
- కె.న్యూటన్, సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్
Advertisement
Advertisement