గోడ కూలి ఇద్దరు చిన్నారుల దుర్మరణం
హైదరాబాద్: పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆ దంపతులకు కడుపుకోత మిగిలింది. ఇంటిగోడ కూలి వారి ఇద్దరు పిల్లలు నిద్రలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లారు. ప్రమాదం నుంచి స్వల్పగాయాలతో తల్లిదండ్రులు బయటపడ్డారు. సంజీవరెడ్డినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. కాగా ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సై లక్ష్మణ్ కథనం ప్రకారం... కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయికి చెందిన చింతకుంట రాజు కొంత కాలం క్రితం నగరానికి వచ్చి కూలీగా పని చేస్తున్నాడు.
రాజు తన భార్య జ్యోతి, కుమారుడు సాయిచరణ్(ఏడాదిన్నర), కుమార్తె నవ్య(రెండున్నర)లను తీసుకొని గత ఆదివారం(29న) బోరబండ సైట్-3లోని వీకర్స్ సెక్షన్ దేవయ్యబస్తీలో వాంబే పథకంలో నిర్మించిన ఓ ఇంట్లో అద్దెకు దిగాడు. సోమవారం రాత్రి అందరూ కలిసి భోజనం చేసి పడుకున్నారు. రాత్రి 10.30 ప్రాంతంలో ఇంటి మధ్యలో ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో గోడ పక్కనే పడుకుని ఉన్న చిన్నారులు సాయిచరణ్, నవ్య తలలకు తీవ్రగాయాలు కాగా... రాజు, జ్యోతిలకు స్వల్ప గాయాలయ్యాయి.
గోడ కూలి పెద్ద శబ్దం రావడంతో కింది పోర్షన్‌లో ఉంటున్న వారు వచ్చి గాయాలకు గురైన చిన్నారులను బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందారు. స్వల్పగాయాలకు గురైన తల్లిదండ్రులు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొంది డిశ్చార్జి అయ్యారు. ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ రమణగౌడ్, ఎస్‌ఐ లక్ష్మణ్ హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి పరిశీరించారు. చిన్నారుల మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, రాజు,జ్యోతి దంపతుల మధ్య రాత్రి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. గోడ కూలినప్పుడు పెద్ద శబ్దం రావడంతో కింది పోర్షన్‌లో ఉండే యువకులు వెళ్లి తలుపు తట్టగా చాలా సేపటి వరకూ తెరవకపోవడం, పిల్లలకు తీవ్రగాయాలై, తల్లిదండ్రులకు స్పల్పగాయాలు కావడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూలిన గోడ అతి పురాతనమైందని.. అయితే, ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక వేరే కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కూటి కోసం వస్తే..కడుపుకోత
Published Wed, Apr 1 2015 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM
Advertisement
Advertisement