
బీఫారం వత్తాదంతావా?
- అభ్యర్థులో అయోమయం
- ముందైతే నామినేషన్ వేద్దాం... తరువాత చూద్దాం..
యలమంచిలి, న్యూస్‌లైన్: నామినేషన్ అయితే వేశాంగానీ చివరకు పార్టీ బీఫారం వస్తుందో రాదోనని పలు పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అభ్యర్థులంతా బీ-ఫారాలకోసం పైరవీలు కూడా ప్రారంభించారు. తమ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు అన్నిమార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ ప్రాతిపదికన జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రధానపార్టీల తరపున పోటీచేయడానికి అభ్యర్థులు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇప్పటికే ఆయాపార్టీల నుంచి పలువురు అభ్యర్థులు హామీలు తీసుకోగా కొంతమంది మాత్రం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బి-ఫారం ఇస్తే ఆయా పార్టీల తరపున, లేదంటే ఇండిపెండెంట్‌గా పోటీచేయడానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలో నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతుండగా నర్సీపట్నం మున్సిపాలిటీలో 27 వార్డులకు 160, యలమంచిలిలో 24వార్డులకు 135 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఒక్కొక్క పార్టీనుంచి పలు వార్డుల్లో ముగ్గురు నలుగురు ఆశావహులు నామినేషన్లను దాఖలు చేశారు. యలమంచిలి మున్సిపాలిటీలో 2వ వార్డులో టీడీపీ నుంచి ఏకంగా ఐదుగురు నామినేషన్లు వేశారు. అయితే వీరిలో ఎవరికి బీఫారం దక్కితే వారే అధికారికంగా పార్టీ అభ్యర్థి అవుతారు. మిగతావారంతా స్వతంత్రులుగానే పోటీలు ఉంటారు. అలాగే 4,7,8 వార్డుల్లో 4 చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ప్రధాన పార్టీలకు అభ్యర్థుల ఎంపిక కూడా తలనొప్పిగా మారనుంది.
ఆయా పార్టీల టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు బి-ఫారం దక్కకపోతే ప్రత్యామ్నాయాలను కూడా వెతుక్కుంటున్నారు. అవసరమైతే పార్టీలు మారేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులపై ఆయా పార్టీలు దృష్టిసారించాయి. గెలుపు గుర్రాలకోసం ప్రయత్నాలు ప్రారంభించాయి.
ఈమేరకు ఆయా ప్రాంతాల్లో అభ్యర్థుల కులాలు, బంధుత్వాలు ఎంతప్రభావం చూపిస్తాయన్న అంచనా వేస్తున్నాయి. వార్డుల్లో ఆర్థిక, అంగబలమున్న అభ్యర్థులకు బి-ఫారాలు ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నాయి.