తప్పని పోటీ!
తప్పని పోటీ!
Published Wed, Mar 1 2017 11:08 PM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM
ఇద్దరి నామినేషన్ల తిరస్కరణ
బరిలో ఐదుగురు
ముగ్గురు ఇండిపెండెంట్లను పోటీనుంచి తప్పించేందుకు టీడీపీ యత్నాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవులకు పోటీ తప్పని పరిస్థితి కనపడుతోంది. బుధవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం చేపట్టి ఇద్దరి నామినేషన్లు తిరస్కరించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు మైలా వసంతరావు, కోళ్ల రామచంద్రరావు నామినేషన్ పత్రాలు సక్రమంగా లేనికారణంగా తిరస్కరించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థులు అంగర రామ్మోహనరావు, మంతెన వెంకట సత్యనారాయణరాజు, ఇండిపెండెంట్లు నల్లి రాజేష్, డీఎస్‌ఎస్ ప్రసాద్, మేడపాటి సాయిచంద్ర మౌళేశ్వరరెడ్డి నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇదిలావుంటే.. నామినేషన్ల పరిశీలన సమయంలోనే ఇండిపెండెంట్ అభ్యర్థులను బరి నుంచి తప్పించేందుకు తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ప్రయత్నించగా.. సఫలం కాలేదు. నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసిన వారిపై వత్తిడి తెచ్చి ఆ సంతకాలు తమవి కాదని రిటర్నింగ్ అధికారికి చెప్పించే ప్రయత్నం చేశారు. ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగిన మైలా వసంతరావు, కోళ్ల రామచంద్రరావు, నల్లి రాజేష్‌లకు తెలుగుదేశం సభ్యులు మద్దతుగా సంతకాలు పెట్టారు. దీంతో వారిని బరి నుంచి తప్పించేందుకు సంతకాలు చేసిన వారిపై ఒత్తిడి తెచ్చారు. భీమవరం పట్టణానికి చెందిన కోలా రామచంద్రరావుపై ఎమ్మెల్యే నుంచి ఒత్తిళ్లు పెరగటంతో ఆయన నామినేషన్ల పరిశీలన కార్యక్రమానికి హాజరు కాలేదు. తాను పోటీనుంచి తప్పుకుంటున్నట్లు భీమవరం నుంచే ప్రకటించారు.
’ఆ సంతకం నాది కాదు’
ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మైలా వసంతరావు సమర్పించిన నామినేషన్ పత్రాలలో తాను సంతకాలు చేయలేదని కాళ్ల జెడ్పీటీసీ వర్రి వెంకటరమణ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. తన పేరిట సంతకాలు ఉన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. మైలా వసంతరావు అనే వ్యక్తి తనకు తెలియదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని లిఖితపూర్వక ఫిర్యాదును సమర్పించారు. దీనిపై వసంతరావు స్పందిస్తూ.. ఆ సంతకం వెంకటరమణదేనన్నారు. ఆ సంతకం తనది కాదని వెంకటరమణ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, తప్పుడు సంతకంతో నామినేషన్ సమర్పించాననే ఆపవాదు తనకు రావడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ నామినేషన్ పత్రంలో 10 మంది ఓటర్లు సంతకాలు చేయాల్సి ఉండగా, వెంకటరమణ ఆ సంతకం తనదికాదని చెప్పడంతో వసంతరావును బలపరిచిన వారి సంఖ్య తొమ్మిదికి తగ్గింది. దీంతో ఆ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించారు. వెంకటరమణ ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని వెంకటరమణ నిజంగా కాళ్ల జెడ్పీటీసీ అవునా, కాదా అని నిర్ధారణ చేయడానికి జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణను ఎన్నికల అధికారి పిలిపించారు. జెడ్పీ సమావేశాలకు హాజరైన సందర్భాలలో ఆమె చేసిన సంతకాలను కూడా పరిశీలించారు. సత్యనారాయణ జెడ్పీ రికార్డులను పరిశీలించి సంతకం కాళ్ల జెడ్పీటీసీదేనని ధ్రువీకరించారు. వెంకటరమణ నేరుగా ఫిర్యాదు ఇవ్వడం, నామినేషన్ పత్రంలో మరికొన్ని లోపాలు కూడా బయటపడడంతో నిబంధనలు మేరకు మైలా వసంతరావు నామినేషన్‌ను తిరస్కరించారు.
పోటీలోనే ఉంటా : రాజేష్
మాల మహానాడు రాష్ట్ర సమన్వయకర్త నల్లి రాజేష్‌కు మద్దతుగా సంతకాలు చేసిన తెలుగుదేశం సభ్యులను సైతం ఎన్నికల రిటర్నింగ్ అధికారి వద్దకు తీసుకువచ్చి సంతకాలు తాము పెట్టలేదని చెప్పించే ప్రయత్నం చేశారు. అప్పటికే సమయం మించిపోవడంతో సాధ్యం కాలేదు. దీంతో అతని నామినేషన్ సక్రమంగా ఉన్నట్టు ఎన్నికల అధికారి తేల్చారు. తనపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా బరి నుంచి తప్పుకునేది లేదని రాజేష్ వెల్లడించారు. తనకు అధికార పార్టీకి చెందిన ఎస్సీలు, కాపు సామాజిక వర్గాల నుంచి 270 మంది మద్దతు ఇప్పటికే ఉందని ఆయన చెబుతున్నారు. ఆయనను రంగం నుంచి తప్పించేందుకు తెలుగుదేశం ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Advertisement
Advertisement