భీమడోలు : రాష్ర్ట మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ మాతృమూర్తి వట్టి వాసుకి(82) శనివారం కన్నుమూశారు. ఆమె దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. భర్త డీసీసీబీ మాజీ చైర్మన్ వట్టి వెంకటరంగ పార్థసారధి. కుమారులు మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, రమేష్‌లు కన్నీటి పర్యంతమయ్యారు. తాడేపల్లిగూడెంకు చెందిన ఉమ్మడి ఆంధ్రరాష్ర్టంలో పసల సూర్యచంద్రరావు డెప్యూటీ స్వీకర్‌గా పని చేశారు. ఆయన ఏకైక కుమార్తె వాసుకి. ఆమెకు ఎంఎంపురానికి చెందిన వట్టి వెంకటరంగ పార్థసారధితో వివాహం జరిగింది. భర్త, కుమారుడు రాజకీయాల్లో రాణించేందుకు పూర్తి సహాయ సహకారాలందించిన వాసుకి సేవలు ఎనలేనివని పలువురు శ్రద్ధాంజలి ఘటించారు. ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి.
ప్రజాప్రతినిధుల సంతాపం
ఏలూరు (టూటౌన్) : రాష్ట్ర సహకార కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు రాత్రి ఎంఎంపురంలోని వసంత్‌కుమార్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. వాసుకి మృతికి పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు, ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, జడ్పీ మాజీ చైర్మన్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌లు సంతాపం వ్యక్తం చేశారు. వైసీపీ కన్వీనర్లు పుప్పాల వాసుబాబు( ఉంగుటూరు) తలారి వెంకట్రావు (గోపాలపురం), గంటా మురళీకృష్ణ, వైసీపీ నాయకులు ఇందుకూరి రామకృష్ణంరాజు, జిల్లా నాయకులు కరాటం రాంబాబు, నాయకులు కరణం పెద్దిరాజు, బాదర్వాడ కృష్ణమోహనరాజు, వగ్వాల భాస్కర్, దేవినేని అవినాష్, , కారుమంచి రమేష్, జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన వివిధ వర్గాల నాయకులు నివాళులర్పించారు.
వట్టి వసంతకుమార్ మాతృమూర్తి కన్నుమూత
Published Sun, Sep 27 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM
Advertisement
Advertisement