ఏదీ చేయూత? | Vegetable zone not implemented in town | Sakshi
Sakshi News home page

ఏదీ చేయూత?

Published Sun, Feb 9 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

Vegetable zone not implemented in town

గజ్వేల్, న్యూస్‌లైన్: సాగునీరు అంతంతమాత్రంగానే ఉన్న మెతుకుసీమలో రైతులంతా ఆరుతడి పంటలే వేసుకోవాలని అధికారులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. సూక్ష్మసేద్యానికి చేయూతనిస్తామని బీరాలు పలుకుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించిన జిల్లాలో రైతులకు సరైన పోత్సాహం లభించడం లేదు.

 మెతుకుసీమను ‘వెజిటబుల్ జోన్’గా మార్చాలని రెండున్నరేళ్ల కిందట సర్కార్ నిర్ణయించినా, అమలుకు మాత్రం నోచుకోలేదు. రైతులకు విస్తృత ప్రయోజనం చేకూర్చేందుకు రూ.40 కోట్లతో ప్రతిపాదనలు తయారుచేసినా వాటికీ మోక్షం కలగలేదు. మరోవైపు కూరగాయల రైతులకు సూక్ష్మనీటి సేద్యపు పథకం వర్తింపు కూడా అందని ద్రాక్షగా మారింది.  

 కలగానే ‘వెజిటబుల్ జోన్’
 ఒకప్పుడు కూరగాయలు పండించాలంటే రైతులు జంకేవారు. జిల్లా అంతటా దాదాపు ఇదే పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించిన ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకెళ్తే కనీసం రవాణా ఛార్జీలు సైతం గిట్టుబాటు కాని దుస్థితి ఉండేది. అన్ని చోట్లా దళారులు తిష్ట వేసి కారుచౌకగా రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసి నిలువునా దోపిడీ చేసేవారు. ఫలితంగా కూరగాయల సాగు అతి తక్కువ విస్తీర్ణంలోనే ఉండేది.

 అయితే గత ఆరేళ్లలో పరిస్థితి పూర్తిగా మారింది. కూరగాయల సాగు వాణిజ్య పంటలకు ధీటుగా సాగుతోంది. జిల్లాలో ప్రస్తుతం 35 వేల ఎకరాల్లో కూరగాయలు, మరో 15 ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. పందిరి విధానంలో బీర, కాకర, పొట్లకాయ, సొరకాయ, దొండ పంటలు సాగవుతుండగా, సాధారణ విధానాల్లో టమాట, ఆలుగడ్డ, బీర్నీస్, మిర్చి, బెండ తదితర రకాలతోపాటు ఆకుకూరలను జిల్లా రైతులు సాగు చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినన్ని కూరగాయలను అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాయి. ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టి సారించి ఇక్కడ రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి.

ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలో వంటిమామిడి గ్రామాన్ని కేంద్రంగా ఎంచుకున్న రిలయన్స్ ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సర్, ఐటీసీ లాంటి సంస్థలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాయి. ఇక్కడ కొన్న కూరగాయలను హైదరాబాద్ నగరానికే కాకుండా రాష్ట్రీయ మార్కెట్‌లకు కూడా పంపుతున్నారు. దీంతో కూరగాయల సాగు విస్తీర్ణం కూడా పెరగడంతో  ఈ ప్రాంతం ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో పర్యటించిన సందర్భంలోనూ జిల్లాను ‘వెజిటబుల్ జోన్’గా మార్చి చేయూతనివ్వాలని వినతులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే జిల్లాలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, తొగుట, నంగునూరు, సిద్దిపేట, దుబ్బాక, చిన్నకోడూరు, చేగుంట, దౌల్తాబాద్, శివ్వంపేట, నర్సాపూర్, జిన్నారం, సంగారెడ్డితో పాటు మరో నాలుగు మండలాలను వెజిటబుల్ జోన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అది కార్యరూపం దాల్చడం లేదు.

 ఆరు కలెక్షన్ సెంటర్లలో రెండింటికే మోక్షం
 వెజిటబుల్ జోన్ ప్రతిపాదనలో భాగంగా రైతుల ఉత్పత్తులను గిట్టుబాటు ధర అందించి సేకరించడానికి తొలి దశలో జిల్లాలో 6 వెజిటబుల్ కలెక్షన్ సెంటర్‌లను ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో కేంద్రాన్ని రూ. 36 లక్షల వ్యయంతో నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు జిన్నారం మండలం గుమ్మడిదల, ములుగు మండలం వంటిమామిడిలో మాత్రమే ఏర్పాటు చేయగలిగారు. మరో నాలుగు చోట్ల కేంద్రాల ఏర్పాటు చేయాల్సి ఉంది.

 డిప్యూటీ సీఎం ప్యాకేజీపై సన్నగిల్లిన ఆశలు
 కూరగాయల రైతులకు విస్తృత ప్రయోజనం కలిగించడానికి రూ.40 కోట్లు మంజూరు చేయాలని రెండున్నరేళ్ల కిందట డిప్యూటీ సీఎం వద్దకు మరో ప్రతిపాదన వెళ్లింది. ఈ ప్రతిపాదనలకు కూడా  మోక్షం లభిస్తే భారీ ప్రయోజనాలు చేకూరే అవకాశముండేది. కూరగాయల సాగుచేసే రైతులను 50 ఎకరాలకు ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి వారికి ప్రభుత్వ పరంగా 50 శాతం సబ్సిడీపై విత్తనాలు, 90 శాతం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్, ఎస్సీ, ఎస్టీలకైతే 100 శాతం, 50 శాతం సబ్సిడీపై ఎరువులు, పురుగు మందుల పంపిణీ, తరుచూ శిక్షణా తరగతులు వంటి కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించే అవకాశం కలిగేది. కానీ ఈ ప్యాకేజీ వ్యవహారంపై చడీచప్పుడు లేకుండా తయారు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

 ఏడాదిన్నర సంది తిరుగుతున్న
 నాకున్న ఎకరంన్నర భూమిలో కూరగాయల పండిస్తున్న. బోరు ఉన్నప్పటికీ అది నీరు తక్కువగా పోస్తుంది. అందువల్లే డ్రిప్ పెట్టుకుని కూరగాయలు పండిద్దామనుకున్న. ఏడాదిన్నర సంది డ్రిప్ కావాలని ఆఫీస్‌ల చుట్టూ కాళ్లరాగిరేలా తిరుగుతుండ. ఎవరూ పట్టించుకుంటలేరు. ఈసారి అద్దెకరా భూమిలో రూ.9 వేలు పెట్టుబడి పెట్టి బీర్నీస్ సాగు చేసిన. నీళ్లు సరిపోక దిగుబడి పడిపోయింది. చేతికందిన కొద్దిపాటి బీర్నీస్‌ను మార్కెట్‌కు తీసుకెళ్తే కిలోకు రూ.10 ధర లెక్కగట్టారు. దీంతో ఇప్పటివరకు పంటమీద రూ.4 వేలు వచ్చింది. చేలో ఉన్న బీర్నీస్‌కు మరో రూ.1,000 వచ్చే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement