పూర్తిగా ఆగిపోయిన వెలిగొండ ప్రాజెక్టు రెండు
మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులకు మళ్లీ బ్రేక్ పడింది. పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు టన్నెల్ పనులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రెండో టన్నెల్ పనులు నిలిచిపోగా..పది రోజుల నుంచి మొదటి టన్నెల్ పనులు కూడా ఆగిపోయాయి. గత నెలలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులు ఏడాదిలోపు పూర్తి చేసి నీరందిస్తామని ప్రకటించారు. పనులు ఆగిపోవడంతో సీఎం హామీ అమలుపై సందేహాలు నెలకొన్నాయి.
గట్టి రాయే ప్రధాన అడ్డంకి..
పనులు నిలిచిపోవడానికి ప్రధాన కారణం సొరంగ మార్గం తవ్వేటప్పుడు గట్టి రాయి పడటమే. ఈ రాయి తగిలి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్) ముందు భాగంలోని బ్లేడ్లు విరిగిపోతున్నాయి. మొదటి టన్నెల్ వ్యాసార్ధం 8 మీటర్లు కాగా..రెండో టన్నెల్ వ్యాసార్ధం 9.2 మీటర్లు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నెలకు 400 మీటర్ల దూరం పనిచేయాల్సి ఉండగా..ఇప్పటి వరకు 250 నుంచి 275 మీటర్లకు మించి పనులు సాగలేదు. మొత్తం మీద ఇప్పటి వరకు మొదటి సొరంగం 9 కి.మీ, రెండో సొరంగం 12 కిలోమీటర్ల పొడవున టన్నెల్ నిర్మాణం పూర్తయింది. ఇందు కోసం సుమారు రూ.850 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసింది.
బిల్లుల చెల్లింపు, అనుమతుల్లోనూ జాప్యం:
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రెండో టన్నెల్ పనులు నిలిచిపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వివిధ అనుమతులు, బిల్లుల చెల్లింపులో జాప్యం కూడా కారణమైంది. శ్రీశైలం రిజర్వాయర్ వద్ద నిర్మించే హెడ్ రెగ్యులేటర్‌కు పోయేందుకు అటవీశాఖ, నీటి పారుదల శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. మొదటి టన్నెల్ పనులు పది రోజుల నుంచి నిలిచిపోయాయి. బలమైన రాయి తగలడంతో టన్నెల్ బోరింగ్ మిషన్ కట్టర్లు విరిగిపోతున్నట్లు గుర్తించారు. జర్మనీ, అమెరికా దేశాల నుంచి ఈ కట్టర్లు తెప్పించాల్సి ఉంది.
రాయికి తగినట్లు మిషన్లు తయారు చేసేందుకు..రాయి పటిష్టతను పరీక్షించేందుకు విదేశాలతో పాటు చెన్నై ఐఐటీకి పంపారు. ఫలితాలు వచ్చాక వాటిని అనుసరించి కట్టర్లు తయారు చేయించి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. అప్పటి వరకు టన్నెల్ నిర్మాణంలో జాప్యం నెలకొనే అవకాశం ఉంది. తొలుత అంచనాల మేరకు 2008 నాటికి మొదటి టెన్నెల్ పనులు పూర్తి కావాల్సి ఉండగా..2010లో పనులు ప్రారంభించారు. 2012 జూన్‌కు పనులు ముగించాలని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగా..ఈ ఏడాది చివరికి కూడా పనులు పూర్తయ్యే అవకాశం లేదు.
నిలిచిన వెలిగొండ పనులు
Published Fri, Oct 17 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM
Advertisement
Advertisement