సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తో రాజకీయం చేయడం టీడీపీకి అంత మంచిది కాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల కొండపైన శిలువ ఉందని టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. టీటీడీలో అన్యమత ప్రచారం జరిగిందనేది అవాస్తవమని ఆయన తేల్చి చెప్పారు. తెలుగుదేశం, ఆ పార్టీ సోషల్ మీడియా నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. కొండపై శిలువ ఉందని నిరూపిస్తే తను రాజీనామా చేస్తానని, లేనిపక్షంలో లోకేష్ రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు. తిరుమల వెంకటేశ్వరస్వామితో రాజకీయాలు చేయొద్దని టీడీపీకి హితవు పలికారు.
ఇప్పటికే నాశనమయ్యారు.. తిరుమల వెంకన్న జోలికి వస్తే ఇంకా నాశనమైపోతారని వెల్లంపల్లి శ్రీనివాసరావు టీడీపీని దుయ్యబట్టారు. ‘తెలుగుదేశం హయాంలో కొండపై దళారీ వ్యవస్థ బలపడింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 మంది దళారీలు అరెస్ట్ అయ్యారు. టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్‌పై ప్రశ్నలు అడిగి అన్యమతం గురించి సభలో ఎలా మాట్లాడతారు? శ్రీవాణి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిందే టీడీపీ. ఈ ట్రస్ట్ ద్వారా రూ.10 వేలు విరాళం ఇచ్చిన భక్తుడికి ఏడాదిలో ఒకసారి స్వామివారి దర్శనం కలుగజేస్తున్నాం. సాధారణ రోజుల్లో ప్రతిదినం 200 మందికి ఈ అవకాశం కల్పిస్తున్నాం. టీటీడీలో ఉన్న తొమ్మిది ట్రస్ట్‌ల్లో శ్రీవాణి ట్రస్టు ఒకటి. దీనికి వచ్చే విరాళాలతో ధర్మప్రచారం, ఆలయాల పునరుద్ధరణ, ధూపదీప నైవేద్యాలు, హిందూ ఆలయ పరిరక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’ అని వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment