నీ సంగతి తేలుస్తా.. | Chandra Babu Naidu and Lokesh Misbehave With Marshalls | Sakshi
Sakshi News home page

నీ సంగతి తేలుస్తా..

Published Fri, Dec 13 2019 3:47 AM | Last Updated on Fri, Dec 13 2019 8:09 AM

Chandra Babu Naidu and Lokesh Misbehave With Marshalls - Sakshi

అసెంబ్లీ నాలుగో గేటువద్ద చీఫ్‌మార్షల్‌ను వేలుచూపించి బెదిరిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు

‘యూజ్‌లెస్‌ ఫెలో..   నువ్వు చీఫ్‌ మార్షల్‌ పోస్ట్‌కి అన్‌ఫిట్‌...  నీ సంగతి తేలుస్తా..’
– అసెంబ్లీ గేటు వద్ద చీఫ్‌ మార్షల్‌ థియోఫిలస్‌పై  ప్రతిపక్ష  చంద్రబాబు తిట్ల దండకం.

‘మమ్మల్ని ఆపుతావా..! ఏం చేస్తున్నార్రా మీరు..?’  
– చీఫ్‌ మార్షల్, మార్షల్స్‌పై నారా లోకేష్‌ అనుచిత వ్యాఖ్యలు. 

‘ప్రతిపక్ష నేతను ఆపుతారా? ఎవడిచ్చాడ్రా మీకు ఉద్యోగం..? ఎవరు చెప్పాడ్రా ఆపమని..?  చెప్పిన వాణ్ణి రమ్మను.. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా..? మనుషులా జంతువులా..?’  
– టీడీపీ సభ్యుల దూషణ.

సాక్షి, అమరావతి: ప్లకార్డులు లేకుండా లోపలకు రావాలని కోరిన భద్రతా సిబ్బందిని బెదిరిస్తూ, దూషిస్తూ టీడీపీ శాసనసభ్యులు గురువారం అసెంబ్లీ సాక్షిగా దౌర్జన్యానికి దిగారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు నారా లోకేష్, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, ఏఎస్‌ రామకృష్ణ తదితరులు అసెంబ్లీ నాలుగో నంబర్‌ గేటు వద్ద మార్షల్స్, పోలీసులను తీవ్ర పదజాలంతో దూషించారు.  

మార్షల్స్‌ను గెంటేసి.. గేట్లు తెరచి...
ప్రతిపక్ష నేత చంద్రబాబు తన స్థాయిని మరచిపోయి చీఫ్‌ మార్షల్, మార్షల్స్‌పై గల్లీలో గొడవకు దిగినట్లుగా దుర్భాషలాడారు. మూడు టీవీ చానళ్లపై నిషేధం ఎత్తివేయాలంటూ ఉదయం చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నాలుగో గేటు వరకు ఫ్లకార్డులతో ప్రదర్శనగా చేరుకున్నారు. ఫ్లకార్డులతో లోపలకు  వెళ్లకూడదని, వాటిని తీసేసి రావాలని కోరిన మార్షల్స్‌తో టీడీపీ సభ్యులు ఘర్షణకు దిగారు. చీఫ్‌ మార్షల్‌ థియోఫిలస్‌ అక్కడకు చేరుకుని వారికి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా టీడీపీ సభ్యులు వినలేదు.

‘యూజ్‌లెస్‌ ఫెలో.. అన్నం తింటున్నారా.. గడ్డి తింటున్నారా.. జంతువుల్లా ప్రవర్తిస్తారా..?’ అంటూ మార్షల్స్‌పై తిట్లతో విరుచుకుపడ్డారు. మరోవైపు చంద్రబాబు ముందుకెళ్లి గేటు తీయాలని తమ ఎమ్మెల్యేలకు సూచిస్తూ మార్షల్స్, పోలీసులను దుర్భాషలాడారు.  మార్షల్స్‌ను నెట్టేసి బలవంతంగా గేటు తెరిచిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ తదితరులు లోపలకు ప్రవేశించి కొద్దిసేపు హల్‌చల్‌ చేశారు.  

మార్షల్స్‌పైనే ఫిర్యాదు
అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లిన అనంతరం కూడా లోకేష్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు తదితరులు ‘ఏయ్‌.. నువ్వు కొత్తగా వచ్చావ్‌. ఏం చేయాలో తెలుసుకుని పని చెయ్‌..’ అంటూ చీఫ్‌ మార్షల్‌ని బెదిరిస్తూ తోపులాటకు దిగారు. టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయంలోకి వెళ్లే వరకూ చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ నేతలు మార్షల్స్‌ని దూషిస్తూనే ఉన్నారు. అయితే మార్షల్సే తమను అడ్డుకుని దాడి చేసినట్లు చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితరులు సభలోకి చేరుకుని ఫిర్యాదు చేయడం కొసమెరుపు.  

గవర్నర్‌కు వినతిపత్రం
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వెంటబెట్టుకుని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని వినతిపత్రం ఇచ్చారు. అసెంబ్లీలో మూడు చానళ్లపై నిషేధం విధించారన్నారు.

‘ఉన్మాది’ అన్‌పార్లమెంటరీ పదం కాదు: చంద్రబాబు
తాను ముఖ్యమంత్రిని ఉన్మాది అన్నానని గొడవ చేస్తున్నారని, అయితే అది అన్‌పార్లమెంటరీ పదం కాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సభా గౌరవం కాపాడాలని తాను కోరుతుంటే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. కొవ్వెక్కితే ఎలా ఉంటారో వైఎస్సార్‌సీపీ నాయకుల్లో  కనబడుతోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోకి కాగితాలు తీసుకెళ్లవద్దని తమను ఇప్పుడు ఆపుతున్నారని, గతంలో ఆ పార్టీ నాయకులు లిక్కర్‌ బాటిల్స్‌ కూడా తెచ్చారని ఆరోపించారు.   

అసెంబ్లీ మార్షల్స్‌పై లోకేష్‌ దౌర్జన్యం


మార్షల్స్‌ను దూషిస్తున్న టీడీపీ నేతలు
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement