స్వర్ణాంధ్రగా సీమాంధ్ర
- పోలవరం కాబోయే జీవనరేఖ
- ప్రస్తుతానికి పొత్తుల్లేవు
- విశాఖ సభలో బీజేపీ నేత వెంకయ్యనాయుడు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్రకు ఐదేళ్ల ప్యాకేజీ ప్రకటించిందని, దానిని అవసరమైతే మరో అయిదేళ్లు పెంచేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఏఎస్ రాజా గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన ప్రధానిగా మోడీ ప్రచార సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సీమాంధ్రను స్వర్ణాం ధ్రగా తీర్చిదిద్దుతామన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధికి తమ పార్టీయే కృషి చేయగలదన్నారు. ప్రగతికి అవసరమైన మేధస్సు సీమాంధ్రుల సొంతమన్నారు. పోలవరం బహుళార్థ ప్రాజెక్టు సీమాంధ్రకు జీవన రేఖగా మారుతుందన్నారు. ప్రస్తుతానికి ఏ పార్టీతోనూ పొత్తులు లేవని ఇరు పార్టీలు లాభపడతాయనుకుంటేనే పొత్తులకు ఆస్కారముంటుందని వెంకయ్యనాయుడు చెప్పారు.
రాజకీయాలు నేర్చుకున్నదిక్కడే
ఏయూలో చదువుకున్నానని, విశాఖ బీచ్‌లో ఆడుకున్నానని వెంకయ్యనాయుడు తన ప్రసంగంలో పేర్కొన్నారు. విశాఖతో అనుబంధం ఈ నాటిది కాదంటూ ఇక్కడి మార్కెట్ రోడ్లపై తిరిగి అన్ని వార్డులూ పర్యటించానని, రాజకీయం ఇక్కడే నేర్చుకున్నానంటూ మేయర్‌గా ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డిని గెలిపించానని తనకీ ప్రాంతమంటే విపరీతమైన అభిమానమన్నారు.
ఈ వేదికపై విశాఖకు చెందిన వ్యాపారవేత్త పేర్ల సాంబమూర్తి, అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త కోలపర్తి శ్రీనివాసరావు, ఉత్తరాంధ్రకు చెందిన పలువురు నేతలు వెంకయ్యనాయుడు సమక్షంలో పార్టీ తీర్థం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ క్రమశిక్షణా సంఘం సభ్యుడు డాక్టర్ కె. హరిబాబు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పివి చలపతిరావు, జాతీయ కార్యదర్శి సోము వీర్రాజు, మాజీ ఎంపీ కృష్ణంరాజు, నగర అధ్యక్షుడు పివి నారాయణరావు ఉత్తరాంధ్రకు చెందిన పలువురు బీజేపీ అధ్యక్షకార్యదర్శులు పాల్గొన్నారు.