'నేనూ కబ్జా బాధితుడినే'
విశాఖపట్నం సిటీ: నగరంలో.. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో భూ కబ్జాలు ఎక్కువయ్యాయని, వీటిని నియంత్రించడానికి పటిష్ట వ్యవస్థ అవసరమని ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ రికార్డులను పరిరక్షించడానికి పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసి తహశీల్దార్ వద్ద ఉంచుకోవాలని, దిగువ సిబ్బందికి అనధికారిక రికార్డులను అప్పగించడం వల్ల భూ కబ్జాదారులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు.
తానూ కబ్జా బాధితుడినేనని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తన తండ్రి పెనుమత్స సత్యనారాయణరాజు పేరిట ఉన్న ఆనందపురం మండలం గంభీరం గ్రామంలో సర్వే నెంబర్ 218/27లో 26 సెంట్లు, 218/31లో 12 సెంట్లు కలిపి మొత్తం 38 సెంట్ల వ్యవసాయ భూమిని కాజేసేందుకు గుడ్ల రమణ, డి.అప్పలగురువులు, దల్లి రాంబాబు నకిలీ పత్రాలు సృష్టించి తమపైనే దౌర్జన్యం చేయబోయారని ఆరోపించారు. వీరిపై పోలీస్ కమిషనర్, కలెక్టర్‌లకు వెంటనే ఫిర్యాదు చేయడంతో సమస్య సద్దుమణిగిందన్నారు.
ఎమ్మెల్యేకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజలకు రౌడీల నుంచి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఊహించుకుంటేనే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్, టాస్క్‌ఫోర్స్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని బీజేపీ శాసన సభా పక్ష నేతగా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.