పోరాట యోధుడి ప్రతిఫలం | BJP Govt Visakhapatnam Railway Zone Announcement | Sakshi
Sakshi News home page

పోరాట యోధుడి ప్రతిఫలం

Published Thu, Feb 28 2019 11:29 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

BJP Govt Visakhapatnam Railway Zone Announcement - Sakshi

 అమర్‌నాథ్‌ దీక్ష విరమణ సందర్భంగా కేజీహెచ్‌ వద్ద రైల్వే జోన్‌ సాధనపై మీడియాతో  మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

‘నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’.. రైళ్ల సమయపాలన విషయంలో ఎప్పటినుంచో ఉన్న నానుడి ఇది. యాధృచ్ఛికమే గానీ.. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు విషయంలో ఈ నానుడి నిజమైంది.
విశాఖతోపాటు ఉత్తరాంధ్రవాసుల దశాబ్దాల కల ఈడేరింది. సుదీర్ఘ పోరాటాలు ఫలించాయి. ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటు ఎట్టకేలకు సాకారమైంది. మొదట కోల్‌కతా కేంద్రంగా ఉన్న ఆగ్నేయ రైల్వేలోనూ.. అనంతరం భువనేశ్వర్‌ కేంద్రంగా ఉన్న తూర్పుకోస్తా రైల్వే జోన్‌లోనూ వాల్తేర్‌ డివిజన్‌కు జరుగుతున్న అన్యాయాలతో విసిగివేసారిన ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాలనాడే విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్‌ డిమాండ్‌తో గళమెత్తారు.


కీలకమైన రైల్వే ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాలకు తరలించుకుపోవడం.. రైలు సర్వీసులను పొడిగించుకొని వాల్తేర్‌ సీట్ల కోటాకు ఎసరుపెట్టడం.. కొత్త కోచ్‌లు, ఇంజిన్లు తమ ప్రాంతాల్లో అట్టిపెట్టుకొని, వాల్తేర్‌కు పాతవి అంటగట్టడం.. వంటి వివక్షపూరిత చర్యలు ప్రత్యేక జోన్‌ వాదనను పదునెక్కించాయి..ఇక రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్షలకు వెళ్లే ఆంధ్ర నిరుద్యోగులను అక్కడి కేంద్రాల్లో పరీక్షలు రాయకుండా అడ్డుకోవడం, కొట్టడం వంటి సంఘటనలు.. జోన్‌ ఉద్యమాన్ని ఉడుకెక్కించాయి.

ప్రత్యేక జోన్‌ ఏర్పాటుకు అప్పుడప్పుడూ కొన్ని ప్రయత్నాలు జరిగినా.. మన ప్రజాప్రతినిధుల మెతకదనం, అప్పటి ఆగ్నేయ, ప్రస్తుత తూర్పుకోస్తా రైల్వేలకు ఆదాయపరంగా బంగారు బాతులా ఉన్న వాల్తేర్‌ డివిజన్‌ను వదులుకోవడం ఇష్టంలేక ఆ రాష్ట్రాలు మోకాలడ్డటం.. వంటి చర్యలు రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రక్రియకు ఎప్పటికప్పుడు రెడ్‌ సిగ్నల్‌ వేశాయి.

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సందర్భంగా రూపొందించిన విభజన చట్టంలో విశాఖ రైల్వేజోన్‌ ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చినా.. సాంకేతిక ఇతరత్రా సాకులతో ఎప్పటికప్పుడు దాటవేస్తుండటాన్ని నిరసిస్తూ.. రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమించారు.. ఆ తర్వాత దాన్ని అందిపుచ్చుకున్న ఆ పార్టీ నేతలు ఎంపీ విజయసాయిరెడ్డి, గుడివాడ అమర్‌నాథ్‌లు కూడా పాదయాత్రలు, నిరవధిక దీక్షలతో రైల్వేజోన్‌ డిమాండ్‌ను ఎలుగెత్తిచాటారు.  ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఆలస్యంగానైనా విశాఖ రైల్వేజోన్‌ పట్టాలెక్కింది. 

విశాఖసిటీ: నాటి స్వాతంత్య్రోద్యమం నుంచి.. మొన్నటి విశాఖ ఉక్కు సంకల్పం.. నిన్నటి జై ఆంధ్ర.. సమైక్యాంధ్ర పోరాటాలు.. వీటన్నింటికీ నాయకత్వం వహించిన వారు స్వాతంత్య్ర యోధులు, మేధావులు వంటి మహోన్నతులు. అదే స్ఫూర్తి.. అదే ఉక్కు సంకల్పం.. నేటి రైల్వేజోన్, ప్రత్యేక హోదా ఉద్యమానికి దారి చూపిన జాజ్వల్యమైన దీప్తి..కానీ.. ఈ ఉద్యమాన్ని నడిపించింది.. నడిపిస్తున్నది మాత్రం ఒకే ఒక్కడు. మడమతిప్పని యోధుడు.రెండు ప్రధాన డిమాండ్లతో అతడే సైన్యమై జోన్‌ కోసం పోరాటం చేస్తూ.. రాష్ట్ర ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ.. విజయం వైపు నడిపించిన ధీరుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పెంచుకున్న ఆశలు రెండింటిపైనే.. ఒకటి ప్రత్యేక హోదా.. రెండోది విశాఖ రైల్వేజోన్‌. విభజన హామీలు సాధించే విషయంలో అధికార పార్టీ గుంభనంగా వ్యవహరించడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నెరవేర్చకుండా కాలయాపన చేసింది.

ఏడాది గడిచినా రాష్ట్రానికి ఏమీ విదిల్చకపోవడం.. రాష్ట్ర ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిచడంతో.. ఉద్యమ భారాన్ని తన భుజస్కందాలపై వేసుకొని మొదటి అడుగు వేశారు ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. హోదాతో పాటు రైల్వో జోన్‌ సాధించే పోరుకు శంఖారావం పూరించారు. ఆయన వేసిన అడుగు.. ప్రభంజనమైంది. సామాన్యులు, ప్రజా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీల్లో చైతన్యం నింపింది. జోన్‌ ఆవశ్యకత, హోదా వస్తే లాభాల గురించి ఏపీలోని ప్రతి పౌరుడూ తెలుసుకునే విధంగా చైతన్యవంతం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు.

పార్లమెంట్‌ లోపలా, బయటా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూ పోరాటాలు సాగించారు. ఆయన స్ఫూర్తితో వాడవాడలా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. విద్యార్థి, ఉద్యోగ, ప్రజా సంఘాలు, రాజకీయ, రాజకీయేతర నేతలు.. ఇలా అందరూ.. జగన్‌ పోరాటంతో స్ఫూర్తి పొందుతూ.. జోన్‌ కోసం అనేక ఉద్యమాలు చేశారు. అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా జోన్‌ కోసం దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు.. ఇలా ప్రతి పోరాటం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చారు.

జగన్‌ స్ఫూర్తితో సాగిన ఐదేళ్ల పోరాటానికి ప్రతిఫలం దక్కింది. ఉత్తరాంధ్ర వాసులు ఎన్నాళ్ల నుంచో ఆశగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వేజోన్‌ కల సాకారమైంది. విశాఖ కేంద్రంగా సౌత్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ బుధవారం రాత్రి ప్రకటించారు. ఇది ప్రజా విజయం.. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ.. రైల్వేజోన్‌ సాధనలో కీలక పాత్ర పోషించిన వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ విజయం.

జోన్‌ కోసం ‘విజయ’ యాత్ర
స్థానికంగా పేరుకుపోయిన సమస్యలు తీరడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరాశలో కుంగిపోయిన యువతకు ధైర్యం చెబుతూ.. జోన్‌ సాధనే లక్ష్యంగా పాదయాత్ర చేసిన వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జోన్‌ సాధనలో కీలక పాత్ర పోషించారు. ఏడు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తూ.. ప్రతి ఒక్కరిలో జోన్‌ గురించి చైతన్యపరచడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు.

జోన్‌ విషయంలో వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తూ.. చేపట్టిన రాస్తారోకోలు, ర్యాలీలు, ధర్నాల్లో పాల్గొన్నారు. రాజ్యసభలో జోన్‌ ప్రస్తావనను పదే పదే తీసుకొస్తూ... కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. విశాఖ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే.. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ రావాల్సిందేనంటూ పదే పదే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లేలా పార్లమెంట్‌లో ఉద్యమించిన విజయసాయిరెడ్డి.. జోన్‌ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు.

జగనన్న బాటలో అమర్‌
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలతో ఆయన మార్గదర్శకత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ప్రస్తుత అనకాపల్లి సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్‌.. రైల్వేజోన్‌ కోసం సుదీర్ఘ పోరాటం చేశారు. అలుపెరగని ధీరుడు సంకల్పాన్ని స్ఫూర్తిగా తీసుకొని.. నెల రోజుల్లో జోన్‌ ప్రకటించకుంటే ఆమరణ దీక్ష చేస్తానని అల్టిమేటం జారీ చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో 2016 ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆమరణ దీక్ష చేపట్టారు. ఐదురోజుల పాటు దీక్ష సాగిన నేపథ్యంలో ఏప్రిల్‌ 18న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీక్షకు హాజరయ్యారు. జోన్‌పై పోరాటం ఉద్ధృతం చేసేందుకు అన్ని వర్గాలతో కలిసికట్టుగా పోరాటం చెయాల్సిన అవసరం ఉందంటూ జగన్‌మోహన్‌రెడ్డే స్వయంగా నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

అప్పటి నుంచి రైల్‌ రోకోలు, రాస్తారోకోలు, జాతీయ రహదారుల దిగ్బంధనాలు, ధర్నాలు, సమ్మెలు నిర్వహించిన అమర్‌నాథ్‌.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 2017 మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 9 వరకూ 200 పై చిలుకు కిమీ పాదయాత్ర చేస్తూ.. రైల్వేజోన్‌ వస్తే.. ఎలాంటి ఉపయోగం ఉంటుంది, యువతకు ఎలా ఉపాధి అవకాశాలు వస్తాయి. విశాఖతో పాటు ఇతర ప్రాంతాలు ఎలా అభివృద్ధి అవుతాయనే అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి.. జోన్‌ సాధనలో కీలక పాత్ర పోషించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement