సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) పరీక్షలను ప్రతికేంద్రంలో వీడియో ద్వారా రికార్డు చేయాలని మంత్రి రఘువీరారెడ్డి ఆదేశించారు. వచ్చేనెల 2న జరపాల్సిన వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్షలు ఏర్పాట్లు, వచ్చేనెల 10 నుంచి 25వ తేదీ వరకూ నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టరు, ఎస్పీలతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మంత్రి మాట్లాడారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాలన్నింటినీ వీడియో ద్వారా చిత్రీకరించాలని, అభ్యర్థులందరి సంతకాలతోపాటు వేలిముద్రలు కూడా సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 27 వేల రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులకు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు.
ఇళ్ల స్థల పట్టాలకు కూడా దరఖాస్తులు స్వీకరించాలని కోరారు. భూ సమస్యలన్నీ పరిష్కరించేందుకు అటవీ, దేవాదాయ, నీటిపారుదల తదితర అనుబంధ శాఖల అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించాలన్నారు. కాగా, వీఆర్‌వో, వీఆర్‌ఏ రెండు పోస్టులకు దరఖాస్తు చేసిన వారికి ఒకే పట్టణంలో పరీక్షలు రాసేలా కేంద్రాలు అలాట్ చేశామని, ఎక్కడైనా పొరపాటున వేర్వేరు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు వచ్చిఉంటే మార్పు చేస్తామని రాష్ట్ర భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కృష్ణారావు తెలిపారు.
వీఆర్‌వో పరీక్షలు వీడియో చిత్రీకరణ
Published Fri, Jan 24 2014 12:28 AM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM
Advertisement
Advertisement