హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని పోలీసుస్టేషన్లనూ వీడియో కాన్ఫరెన్సింగ్ (వీసీ) సౌకర్యం ద్వారా అనుసంధానించాలని నిర్ణయించినట్లు డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో వీసీ వ్యవస్థను డీజీపీ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 'హైదరాబాద్ మాదిరిగానే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా ఎస్పీ కార్యాలయాలు, డీఎస్పీలు పర్యవేక్షించే సబ్-డివిజన్, సర్కిల్ ఆఫీస్‌లతో పాటు పోలీసుస్టేషన్లనూ వీసీ ద్వారా అనుసంధానించాలని నిర్ణయించాం. శాంతిభద్రతలు, ట్రాఫిక్ స్థితిగతులతో పాటు నేర స్థలాల పర్యవేక్షణ, నేరగాళ్ల విచారణ, అనుమానితుల గుర్తింపు తదితర అంశాల్లో వీసీ విధానం కీలకపాత్ర పోషిస్తుంది' అని అన్నారు.
నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... కమిషనరేట్‌లోని శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లతో పాటు డీసీపీ, ఏసీపీ కార్యాలయాలు, ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారుల సహా మొత్తం 150 మంది వీసీని వినియోగించుకునే అవకాశం ఇచ్చాం. ఈ విధానంతో నేరుగా కొత్వాలే క్షేత్రస్థాయిలో హోంగార్డుతోనూ సంప్రదింపులు జరిపే అవకాశం ఏర్పడిందని అన్నారు.
అన్ని పోలీస్‌స్టేషన్లకూ వీసీ సౌకర్యం
Published Tue, Dec 15 2015 5:47 PM | Last Updated on Sat, Apr 6 2019 9:01 PM
Advertisement