పక్కాగా కానిస్టేబుల్ ‘ఈవెంట్స్’
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ కొలువుల కోసం శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈవెంట్స్‌ను పక్కాగా నిర్వహించాలని డీజీపీ అనురాగ్‌శర్మ జిల్లా ఎస్పీలను ఆదేశించారు. వివిధ విభాగాల్లో 9,281 కానిస్టేబుల్ పోస్టుల కోసం 1.92 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్న నేపథ్యంలో డీజీపీ అనురాగ్‌శర్మ అన్ని జిల్లాల ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
దేహ దారుఢ్య పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా బాధ్యతగా నిర్వహించాలని కోరారు. మొదట 800 మీటర్ల పరుగును నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే రెండవ రోజు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించాలని సూచిం చారు. అయితే మహిళా అభ్యర్థులు మాత్రం రాత్రి బస ఏర్పాట్లను వారే స్వయంగా సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. వేల సంఖ్యలో హాజరయ్యే అభ్యర్థుల కోసం గ్రౌండ్‌లో తగినంత సిబ్బందిని ఉంచాలన్నారు. అన్ని రికార్డులను సరిగ్గా రాయాలని సూచించారు.
కృష్ణాపుష్కరాల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ఎస్పీలతో డీజీపీ ప్రత్యేకంగా చర్చించారు. ఒక వైపు కానిస్టేబుల్ దేహ దారుఢ్య పరీక్షల నిర్వహణ, మరోవైపు కృష్ణా పుష్కరాల బందోబస్తు నిర్వహించాల్సి రావడంతో ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీలకు సూచించారు.