
ప్రజాసమస్యల పై వెబ్ అస్త్రం
విజ్ఞాన్ విద్యార్థుల ఘనత
చేబ్రోలు : లంచం అడిగినవారు ఇక వెబ్ బజారులో నిలబడాల్సి రావచ్చు. ఏ సమస్య అయినా క్షణాల్లో అందరి ఫోన్లకు మెసేజ్ రూపంలో రావచ్చు. వీధుల్లో సమస్యల నుంచి వ్యక్తిగత కష్టాల వరకు అన్నింటికీ ఇక వెంటనే పరిష్కారం కోసం విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఓ వెబ్‌సైట్ శక్తివంతంగా పనిచేస్తోంది. ఈ నెల 11న దీన్ని సీఎం చంద్రబాబు హైదరాబాదులో ప్రారంభించారు. దీన్ని రూపొందిం చిన విద్యార్థులను ఆయన అభినందించారు.
ఆ నలుగురికి వచ్చిన ఐడియా..
మంగళగిరి రూరల్ మండలం నూతక్కికి చెందిన జి.మనోహర్, తాడేపల్లి మండలం సీతానగరానికి చెందిన ఆర్.మనోహర్‌రెడ్డి, తెనాలికి చెందిన కృష్ణలావణ్యకుమార్, హైదరాబాద్‌కు చెందిన పి.విద్వాన్‌రెడ్డి విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో ఈసీఈ బ్రాంచ్ చివరి సంవత్సరం విద్యార్థులు. ప్రభుత్వ విభాగాల్లో పేరుకుపోతున్న అవినీతి, ప్రజాసమస్యల పరిష్కారం కోసం వెబ్ అస్త్రాన్ని ప్రయోగించాలని ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. వీరి ప్రాజెక్టుకు మనోహర్ కీలకం. వెబ్ అడ్మినిస్ట్రేటర్ కూడా అతనే. రోజు 18 గంటలపాటు కష్టపడి, రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టి ఎట్టకేలకు ఓ వైబ్‌సైట్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. మిగిలిన ముగ్గురు మనోహర్‌కు సాంకేతిక సాయం అందించారు.