
సాక్షి, అమరావతి : టీడీపీ కుట్రలు చేసినా, పచ్చమీడియా పిచ్చి పిచ్చిగా రాసుకున్నా, దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న సీఎంల జాబితాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగో స్థానంలో నిలిచారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నాయకుడంటే ప్రజల హృదయాల్లో చోటు సంపాదించాలని ట్విటర్‌లో పేర్కొన్నారు. కుట్రలు కుతంత్రాల చంద్రబాబునాయుడికి అదే స్థానం శాశ్వతమయ్యేలా ఉందని ఎద్దేవా చేశారు. (బెస్ట్ సీఎం వైఎస్ జగన్)
కాగా, దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ నాలుగో స్థానంతో సీనియర్ల సరసన నిలిచిన విషయం తెలిసిందే. ‘సీ ఓటర్–ఐఏఎన్‌ఎస్’ సంయుక్తంగా దేశవ్యాప్తంగా మే నెల చివరివారంలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా డాట్‌కామ్’ మంగళవారం ఈ వివరాలను ప్రముఖంగా ప్రచురించింది. ప్రజాదరణ చూరగొన్న ముఖ్యమంత్రుల్లో తొలి మూడు స్థానాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు తలలు పండిన సీనియర్లే కావడం విశేషం. యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారి సరసన నిలవడం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. (రూపాయి కూడా అప్పు లేకుండా ఇల్లు..)