సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం మారనున్న క్రమంలో నగర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిలో భాగంగా వైఎస్సార్‌సీపీ విజయసాయిరెడ్డి స్థానిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతున్నందున తదనుగుణంగా తాగునీటి వనరులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రాజధానితో పాటు పారిశ్రామిక రంగం కూడా పెరిగే అవకాశం ఉన్నందున జీవీఎంసీ పరిధిలో 30 శాతం జనాభా పెరుగుతారని అంచనా వేశారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రాబోయే అవసరాల కోసం తాగునీటిపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికను తయారుచేయాలని ఎంపీ తెలిపారు. (సీఎం జగన్‌పై విజయ సాయిరెడ్డి ప్రశంసలు)
ఇక ఈ సమావేశంలో పాల్గొన్న విశాఖ ఇన్ చార్జి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడాది పాలనలో సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏడాదిలోనే 90 శాతం హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకి తగ్గట్టుగా విశాఖ తాగునీటిపై మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని, పరిపాలనా రాజధాని వస్తే విశాఖలో జనాభా పెరుగుతాయని పేర్కొన్నారు. (ఆరోగ్య రంగంలో అనేక మార్పులు: సీఎం జగన్)
గోదావరి నుంచి విశాఖ వరకు పైపులైన్
సమీక్షలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖపట్నం తాగునీటి అవసరాలని తీర్చాలని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ‘గోదావరి నుంచి విశాఖ వరకు పైపులైన్ల ద్వారా నీటిని మళ్లించి తాగునీటి అవసరాలను తీర్చే ప్రాజెక్ట్ చేపట్టాలని సీఎం సూచించారు. 2050 వరకు తాగునీటి అవసరాలని ఈ ప్రాజెక్ట్ ద్వారా తీర్చే అవకాశాలున్నాయి. త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ చేపడితే విశాఖ నగరానికి తాగునీటి సమస్య తీరుతుంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment