విజయవాడలో ‘గీతాంజలి’ జైత్రయాత్ర
సినిమాల్లో సందేశం కంటే.. వినోదానికే ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తున్నారని గీతాంజని సినిమా నిర్మాత కోన వెంకట్ అన్నారు. సినిమాల్లో హిట్-ఫ్లాప్ అనే రెండు రకాలే ఉంటాయని, ప్రేక్షకులు ఆదరించడానికి పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేదన్నారు. అందుకు గీతాంజలి సినిమా విజయమే నిదర్శనమని చెప్పారు. ‘గీతాంజలి’ జైత్రయాత్రలో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు ఆదివారం విజయవాడ వచ్చారు.
ఈ సందర్భంగా హోటల్ గేట్‌వేలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోన వెంకట్ మాట్లాడుతూ గీతాంజలి సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధిస్తుందని ముందే ఊహించామన్నారు. నటుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గీతాంజలికి ఇంతటి విజయూన్ని అందించిన ప్రేక్షకులను స్వయంగా కలిసి కృతజ్ఞతలు చెప్పేందుకే ఈ జైత్రయాత్ర నిర్వహిస్తున్నామన్నారు.
శనివారం తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నామని, విజయవాడ నుంచి యాత్రను ప్రారంభించామని, విశాఖ వరకు కొనసాగుతుందని చెప్పారు. హీరోయిన్ అంజలి మాట్లాడుతూ గీతాంజలి సినిమా థియేటర్ల ఎదుట హౌస్‌ఫుల్ బోర్డులు చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు.డెరైక్టర్ రాజ్‌కిరణ్ మాట్లాడుతూ సినిమా స్టోరీ విన్న తర్వాత శ్రీనివాసరెడ్డితోనే తీయాలని నిర్ణయించుకున్నానన్నారు. కథ నచ్చి కోన వెంకట్ సినిమా నిర్మించడానికి ముందుకొచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇతర చిత్ర యూనిట్ సభ్యులు హరి, తదితరులు పాల్గొన్నారు.
- విజయవాడ