
బెజవాడ ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరి?
- బీజేపీ-టీడీపీ పొత్తు కుదిరే అవకాశం
- కేశినేని నానికి మొండిచెయ్యి
- కోనేరు అభ్యర్థిత్వంపై భయం
సాక్షి, విజయవాడ : బీజేపీ విజయవాడ ఎంపీ సీటును కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురందేశ్వరికి కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న పురందేశ్వరి విశాఖపట్నం నుంచి తిరిగి పోటీ చేయాలని భావించారు. ఇదే స్థానానికి బీజేపీ సీమాంధ్ర నూతన అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పోటీ పడ్డారు. దీంతో ఆయనకు విశాఖ సీటు కేటాయించి, పురందేశ్వరిని విజయవాడకు పంపినట్లు ప్రచారం జరుగుతోంది.
కృష్ణాజిల్లా పురందేశ్వరి తండ్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంత జిల్లా కావడంతో ఆమెకు తొలి నుంచి ఇక్కడ అనేక మందితో పరిచయాలు ఉన్నాయి. ఇవి పార్టీకి లాభిస్తాయని బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు భావించడంతో ఆమెను విజయవాడకు పంపినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా విశాఖపట్నం సీటు వదలాల్సి వస్తే విజయవాడ నుంచి పోటీ చేసేందుకు అవసరమైన ప్రణాళికలను ఆమె సిద్ధం చేసుకున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడంతో ఇక ఆ పార్టీ నుంచి గెలవలేమని నిర్ణయించుకున్న పురందేశ్వరి ఏకంగా ఆ పార్టీనే వదిలి బీజేపీలో చేరారు.
టీడీపీతో పొత్తుల పైనే దృష్టి...
కాంగ్రెస్‌ను వీడిన దగ్గుపాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి తిరిగి సొంత గూటికి చేరతారని ప్రచారం జరిగింది. వారు వ్యూహాత్మకంగా బీజేపీలో చేరారు. ఇప్పుడు పురందేశ్వరి తన తండ్రి సొంత జిల్లా నుంచి పోటీలోకి దిగనున్నారు. చంద్రబాబు, పురందేశ్వరి మధ్య కుదిరిన రహస్య ఒప్పందంలో భాగంగానే ఇదంతా జరిగిందని టీడీపీ, బీజేపీ శ్రేణులు నమ్ముతున్నాయి. త్వరలోనే బీజేపీ, టీడీపీల మధ్య పొత్తులు కుదురుతాయని, అందులో భాగంగా విజయవాడ ఎంపీ సీటును చంద్రబాబు బీజేపీకి వదిలివేస్తారని అంటున్నారు.
కేశినేనికి మొండిచెయ్యి?
ఇప్పటివరకు టీడీపీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్ (నాని)కి ఆ పార్టీ ఎంపీ టిక్కెట్ లభిస్తుందని అంతా భావించారు. ఆయనకు ఎంపీ సీటు ఆశ చూపడంతో జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన పాదయాత్ర, బస్సుయాత్రలకు కేశినేని నాని కోట్ల రూపాయలు కుమ్మరించారు. ఉత్తరాఖండ్ వరదల్లో బాధితులను ఆదుకోవడంలోను, పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఇతర సేవా కార్యక్రమాలకు అయ్యే ఖర్చులన్నీ కేశినేని నాని నెత్తినే చంద్రబాబు రుద్దారు. ఇప్పుడు బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే కేశినేని నానికి ఎంపీ సీటు ఇవ్వకుండా మొండిచెయ్యి చూపించే అవకాశాలు కనపడుతున్నాయి. కేశినేని నాని పట్టుబడితే ఆయనకు జిల్లాలోఏదో ఒకచోట ఎమ్మెల్యే సీటు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.
కోనేరు రాజేంద్ర ప్రసాద్ అభ్యర్థిత్వంపై భయం...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కోనేరు రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తారని తెలిసినప్పటి నుంచి తెలుగుదేశం నేతలకు వెన్నులో చలిపుడుతోంది. ఆయనకు పోటీగా కేశినేని నాని సరిపోడని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పురందేశ్వరిని కేటాయిస్తే.. తక్షణం ఈ సీటు వదులుకుని పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు చంద్రబాబు ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్ సొంత జిల్లాలోనే ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోతే పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిపోతుందన్న భయంతో ఉన్న చంద్రబాబుకు బీజేపీ నిర్ణయం ఊరట కలిగిస్తుందంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు బీజేపీకి సీటు కేటాయించడం వల్ల వైఎస్సార్ సీపీతో పోటీ పడే బాధ తప్పుతుంది, ఎన్నికల్లో పురందేశ్వరి ఓడిపోతే ఆ పాపం బీజేపీ ఖాతాలో వేయొచ్చు.. గెలిస్తే టీడీపీ బలం వల్లేనని చెప్పుకొనే అవకాశం చంద్రబాబుకు ఉంటుందని అంటున్నారు.