బెజవాడలో విచిత్రం : టిడిపి X జనసేన
చేయి చేయి కలిపి ఎన్నికలలో దిగడానికి నేతలు సిద్ధపడ్డారు. ద్వితీయశ్రేణి నేతలు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. చేతులకు పనిచెప్పడానికి వారు సిద్ధమైయ్యారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో ఒకే వేదికను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన వ్యవస్థాపకుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంచుకోనున్నారు. అయితే బెజవాడలో మాత్రం పరిస్థితి విచిత్రంగా వుంది.
విజయవాడ లోక్సభ స్థానం విషయంలో ఇటు చంద్రబాబు, అటు పవన్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేలా ఉంది. బెజవాడ టిడిపి ఎంపీ టికెట్ పొట్లూరి వరప్రసాద్(పివిపి)కు ఇప్పించేలా పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. పట్టుబటి టిడిపి సీనియర్ నేత కేశినేని నాని ఈ టికెట్ దక్కించుకున్నారు. దాంవతో పివిపిని స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దింపాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ లోక్సభ స్థానం కేశినేని నానికి కేటాయించారని తెలిసిన వెంటనే అతనిని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని పివిపి వర్గీయులు ప్రకటించారు. 1983లో టీడీపీ సభ్యత్వ పుస్తకాలు అమ్ముకుని సస్పెన్షన్‌కు గురైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నాని అని వారు విమర్శించారు. అతను ఒకే పర్మిట్‌పై 4 బస్సులు తిప్పి ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నాడన్నారు. హెచ్-1 వీసాలు ఇప్పిస్తానని విద్యార్థుల నుంచి డబ్బు దోచుకున్న చరిత్ర కేశినేనిదని ధ్వజమెత్తారు. కేశినేని ఓటమికి అన్ని అవకాశాలను వాడుకుంటామని వారు చెప్పారు.
కేశినేని నానిని టార్గెట్‌గా చేసుకొని ఈ నెల 19న విజయవాడ లోక్సభ అభ్యర్థిగా పొట్లూరి నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఇందుకోసం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో పీవీపీ భేటీ అయినట్లు సమాచారం. అయితే ఈ ఎన్నికలలో ఓట్లు చీల్చనని పవన్ కళ్యాణ్ విశాఖ సభలో చెప్పారు. ఈ పరిస్థితులలో పొట్లూరితో నామినేషన్ వేయిస్తే, ఓట్లు చీల్చనన్న మాట తప్పారని ప్రజలు అనుకుంటారని జనసేన ఆలోచిస్తోంది. మరి కొన్ని చోట్ల కూడా స్వతంత్ర అభ్యర్థులుగా కొంత మందిని బరిలోకి దింపాలని జనసేన పార్టీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమ్మీద నామినేషన్ల పర్వం ముగిస్తే తప్ప బెజవాడ కథ క్లయిమాక్స్‌కు చేరే అవకాశం కన్పించటం లేదు.