కేశినేని నాని
హైదరాబాద్: విజయవాడ లోక్‌సభ స్థానం విషయమై టీడీపీలో చెలరేగిన వివాదం ముదిరిపోయింది. విజయవాడ లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని టిడిపి సీనియర్ నేత కేశినేని శ్రీనివాస్ (నాని) మొదటి నుంచి అనుకుంటున్నారు. పార్టీ అధిష్టానం కూడా తనకే కేటాయిస్తుందని ఆయన భావించారు. అయితే ఈ స్థానాన్ని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సూచించిన విధంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌కు కేటాయిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. విజయవాడ ఈస్ట్ లేదా పెనమలూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయాలని నానికి పార్టీ కార్యాలయం నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో కేశినేని నాని మాట్లాడుతూ తాను శాసనసభకు పోటీ చేయనని, లోక్‌సభకు మాత్రమే పోటీచేస్తానని చెప్పారు. పార్టీ ఆదేశించినా తాను శాసనసభకు పోటీ చేయనన్నారు. కోనేరు సత్యనారాయణ, పొట్లూరి వరప్రసాద్ ఇద్దరూ అంతర్జాతీయ స్కామర్లని విమర్శించారు. అటువంటి వారిని పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నారన్నారు. కొన్ని కార్పోరేట్ శక్తులు తనకు సీటు రాకుండా చేస్తున్నాయన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా టిడిపి టికెట్ తనకే దక్కుతుందన్నారు. చంద్రబాబు తనకు న్యాయచేస్తారన్న నమ్మకాన్ని నాని వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడుని ఇంకా కలవలేదని చెప్పారు. ఈ రాత్రికి ఆయనను కలుస్తానన్నారు.