
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా రూపొంది.. సంస్థాగతంగా బలపడేందుకు, పార్టీ చేపట్టే కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేదుకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 150 మంది క్రియాశీలకంగా పనిచేసే నేతలను గుర్తించి రానున్న రోజుల్లో అన్ని కార్యక్రమాల్లో వారికి బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియామకం తర్వాత ఆదివారం విజయవాడలోని ఆ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది.
పురందేశ్వరితోపాటు పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల సహ ఇన్‌చార్జి శివప్రకాష్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్రమంత్రి వి.మురళీధరన్, సహ ఇన్‌చార్జి సునీల్ దేవ్‌ధర్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, అన్ని జిల్లాల నేతలు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యం
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ముఖ్య భూమిక పోషించి, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలవడానికి ముఖ్య నేతలందరూ కృషిచేయాలని ముఖ్య అతిథిగా హాజరైన మురళీధరన్ పిలుపునిచ్చారు. 2019లో మనపట్ల మన వ్యతిరేక పక్షాల దుష్ప్రచారంవల్ల అనుకున్న ఫలితాలు సాధించలేకపోయామని.. కానీ, ఇప్పుడా పరిస్థితులు మారాయన్నారు. రాష్ట్రంలోనూ బీజేపీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరముందని తన ప్రారం¿ోపన్యాసంలో పురందేశ్వరి అన్నారు.
23 నుంచి రాష్ట్ర పర్యటనలు
ఈ నెల 23 నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా, గోదావరి ప్రాంతాల్లో పురందేశ్వరి పర్యటిస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పీవీఎన్ మాధవ్, విష్ణువర్థన్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 23న ప్రొద్దుటూరులో రాయలసీమ నేతలతో, 25న గుంటూరులో కోస్తా జిల్లాల నేతలతో, 26న రాజమహేంద్రవరంలో గోదావరి జిల్లాల నేతలతో.. 27న విశాఖలో ఉత్తరాంధ్ర నేతల సమావేశం జరుగుతుందన్నారు. ఎన్డీయే సమావేశానికి పవన్ హాజరుకానుండడంతో బీజేపీ, జనసేన పొత్తుపై స్పష్టత వచి్చందన్నారు. బీజేపీ, టీడీపీ కలవాలని తాము అనుకోవడంలేదని ఓ ప్రశ్నకు వారు బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment