
'ఏ బాధ్యత అప్పగించినా చేస్తా'
సాక్షి, విజయవాడ బ్యూరో: బీజేపీ తనకు ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేసి పార్టీ అభివృద్ధికి పాటుపడతానని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా మిమ్మల్ని నియమిస్తున్నారా? అని విజయవాడలో మీడియా ప్రశ్నించడంతో ఆమె పై విధంగా బదులిచ్చారు. పార్టీ తనకు అప్పగించిన మహిళామోర్చా ఇన్‌చార్జి బాధ్యతలను ప్రస్తుతం నిర్వర్తిస్తున్నట్టు చెప్పారు. పార్టీ అభివృద్ధికి ఏ పని అప్పగించినా చేస్తానన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని, ఇలా అయితే నిర్ణీత గడువులో పోలవరం పూర్తికాదన్నారు. విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తరలింపు, విమ్స్‌కు నిధుల మళ్లింపు వంటి అంశాలపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిస్తూ.. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారని, వాటిపై తాను వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు.