
సాక్షి, విజయవాడ : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లడారు.
నిన్నటివరకూ తమతో కలసి నడిచిన తెలుగుదేశం రాజకీయ లబ్ధి కోసం బీజేపీపై ఆరోపణలు చేస్తోందని విష్ణు కుమార్ రాజు అన్నారు. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చే ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలపై ఒక్క అవినీతి మరకైనా లేదని అన్నారు.
విశాఖపట్టణాన్ని దోచేసిన ఘనత మంత్రి గంటా శ్రీనివాస రావుకే దక్కుతుందని విమర్శించారు. ఆయన కబ్జాకోరు రాష్ట్రంలో లేరని మండిపడ్డారు. భీమిలి నియోజకవర్గంలో అడుగడుగునా భూ కబ్జాలేనని, వాటిపై సిట్ విచారణ వేయించే ప్రయత్నాన్ని నీరుగార్చేందుకు గంటా యత్నించారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో ప్రతిచోటా అవినీతి తాండవిస్తోందని, శాసనసభలోనూ ప్రభుత్వం బీజేపీ గొంతు నొక్కిందన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై మాట్లాడిన ప్రతీసారీ మైక్‌లను కట్ చేశారని అన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రత్యేక హోదా కోసం ప్రజల్లోకి వెళ్లడంతో చంద్రబాబుకి భయం మొదలైందని చెప్పారు. అందుకే ప్యాకేజ్‌కి ఒప్పుకుని యూటర్న్ తీసున్నారని అన్నారు. కాగా, బీజేపీ ఆవిర్భావ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాధవ్, ఇతర నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment