
గద్దె రామ్మోహన్ ఇంట్లో భారీగా చీరలు స్వాధీనం
టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ నివాసంలో విజయవాడ నగర పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన నివాసంలో 3500 చీరలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చీరలు మహిళ ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు.
గద్దె రామ్మోహన్ ఇంట్లో ఓటర్లకు పంచేందుకు భారీగా వస్త్రాలు ఉన్నట్లు ఆగంతకుల నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు మంగళవారం ఉదయం సదరు నేత ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. దాంతో పెద్ద ఎత్తున చీరలను స్వాధీనం చేసుకుని, పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అలాగే జగ్గయ్యపేట పట్టణంలో మఠం బజారులోని టీడీపీ నేత శ్రీరాం రాజగోపాల్ నివాసంలో కూడా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సదరు నాయకుడి ఇంట్లో ఓటర్లను పంచేందుకు సిద్దంగా ఉంచిన క్రికెట్ కిట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.