బీసేఫ్ యాప్ పోస్టర్
‘ఎప్పుడైతే అర్ధరాత్రి రోడ్డుపై మహిళలు స్వేచ్ఛగా, భయం లేకుండా తిరగగలుగుతారో అప్పుడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లవుతుంది’ ఇదీ జాతిపిత మహాత్మా గాంధీ అన్న మాటలు.. అయితే ప్రస్తుతం దేశంలో ఆ పరిస్థితి కనిపిస్తుందా అంటే లేదనే చెప్పాలి. ‘నిర్భయ’.. లాంటి అమానవీయ ఘటనలు మహిళా భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీసులు సగటు మహిళకు జరుగుతున్న ప్రమాదాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక యాప్ ‘బీసేఫ్’ను ప్రవేశపెడుతోంది. దీనిలో మహిళా భద్రతతో పాటు హెల్మెట్, సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే అనర్థాలపై ఆడియో, వీడియోలను పొందుపరిచింది. ఇది ఈ నెల మూడో తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.
సాక్షి, అమరావతి బ్యూరో : సాంకేతికత ఎంత పెరుగుతుందో.. నేరాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. మరోవైపు గుమ్మం దాటిన ఆడపడుచు తిరిగి ఇంటికి చేరే వరకు ప్రాణాలు అరచేతిలో ఉంచుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి. ఎక్కువ మంది ప్రమాదాలపై అవగాహన లేక.. విపత్కర పరిస్థితుల్లో ఏమి చేయలో పాలుపోక తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ నగర పోలీసు శాఖ ప్రత్యేక చర్యలను ప్రారంభించింది. ప్రమాదాలు.. జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళిక చేసింది. దీనిలో భాగంగా “బీ సేఫ్’ పేరిట ఓ యాప్‌ను రూపొందించింది. ఆడియో, వీడియోలను యాప్‌లో పొందుపరిచింది.
ప్రమాదాలపై అవగాహన..
నగరం రాజధాని ప్రాంతంలో భాగమవడంతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మాల్స్ సంస్కృతి పెరిగింది. పాశ్చాత్య పోకడలు పెరిగాయి. నగరంలో నిత్యం ఏదో ఒక పోలీసు స్టేషన్‌లో మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు, అత్యాచారం వంటి ఘటనలపై కేసులు నమోదవుతున్నాయి. వీటిని నివారించేందుకు నగర పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక నంబర్లు ఉన్నా అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శక్తి బృందాలు, డయల్ 100, బ్లూ కోల్ట్సŠ, ఇంటర్‌సెప్టార్, వాట్సాప్ లాంటి సౌకర్యాలు ఉన్నా.. చిక్కులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో మహిళా భద్రతలపై చర్యలు చేపట్టిన నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు “బీసేఫ్’ అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. తద్వారా ప్రజలు.. ముఖ్యంగా మహిళలు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి సిద్ధమయ్యారు. ఈ యాప్ ద్వారా డయల్ 100, గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, ఓటీపీ, ఫేస్‌బుక్ మోసాలతోపాటు సురక్షిత ప్రయాణం, దొంగల బారిన పడకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలు వంటి అంశాలపై ఆడియో, వీడియో రూపంలో అవగాహన కల్పిస్తారు.
డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు..
బీసేఫ్ యాప్‌ను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారం మొత్తం మీ ముందు దృశ్యశ్రవణ రూపంలో కనిపిస్తుంది. ఏదైనా సంఘటన చూసినా.. వారి కళ్లముందు ప్రమాదం జరిగినా, అమ్మాయిలను ఎవరైనా ఈవ్ టీజింగ్ చేస్తున్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పించే విధంగా యాప్‌కు రూపకల్పన చేశారు. ఈ యాప్ పోస్టర్లను నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లతోపాటు పాఠశాలలు, కళాశాలలు, వీధుల్లో ఏర్పాటు చేయబోతున్నారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి లేదా.. ఆయా పోస్టర్‌ల మీద ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుని ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment