
విక్రమ సింహపురి పాత వెబ్‌సైట్ హ్యాకింగ్
నెల్లూరు: విక్రమ సింహపురి యూనివర్సిటీ పాత వెబ్‌సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సింహపురియునివి.ఓఆర్జీ)ని గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి విద్యార్థులను మోసగిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ విషయం గుర్తించిన వర్సిటీ అధికారులు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల కథనం మేరకు..నెల్లూరులోని విక్రమ సింహపురి వర్సిటీ 2008లో అధికారిక www.simhapuriuniv.org ని ప్రారంభించింది. దాని పర్యవేక్షణ హైదరాబాద్‌కు చెందిన ఐసీఎం స్పాట్ సంస్థ చేస్తోంది. 2012లో వెబ్‌సైట్‌లో మార్పులు చేర్పులు చేసి పాత వెబ్‌సైట్‌కు బదులుగా www.simhapuriuniv.ac పేరిట కొత్త వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. పాత వెబ్‌సైట్‌ను తొలగించాలని ఎడ్యుకేషన్ రీసెర్చ్ నెట్(ఈఆర్‌ఎన్‌ఈటీ)ని వర్సిటీ రిజిస్ట్రార్ కోరారు. అప్పటినుంచి ఆ వెబ్‌సైట్ గురించి అధికారులు పట్టించుకోలేదు.
గతేడాది అక్టోబర్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి వర్సిటీ పాత వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశాడు. అందులో నకిలీ మెయిల్ క్రియేట్ చేసి 116 కోర్సులను వర్సిటీ నిర్వహిస్తోందని, అందుకు సంబంధించిన ఫీజు వివరాలను అందులో పొందుపరిచాడు. అంతేకాకుండా చిరునామా, సెల్‌ఫోను నంబర్లు అందుబాటులో ఉంచాడు. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరస్పాండెన్స్ కోర్సుల్లో చేరేందుకు ఆ నంబర్లను సంప్రదించారు. వారి నుంచి సదరు హ్యాకర్ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసి నకిలీ సర్టిఫికెట్లు జారీచేశాడు.
అయితే ఓ విద్యార్థి అనుమానంతో వర్సిటీ అధికారులను సంప్రదించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ పాత వెబ్‌సైట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎస్.మురళీమోహన్‌రెడ్డి ఒకటో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ మద్ది శ్రీనివాసరావు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు వరంగల్‌లో ఐడీని క్రియేట్ చేశాడనీ, తన కార్యకలాపాలు బెంగళూరు, హార్యానా నుంచి సాగిస్తున్నాడని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.