vikrama simhapuri university
-
వీఎస్‌యూ లోగిలి.. ఆనందాల కేళి
నెల్లూరు (అర్బన్): కొత్తకొత్త స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్, ఉపాధి కోర్సులను ప్రవేశ పెడుతూ నాణ్యమైన విద్య, ఉద్యోగాల కల్పనకు కేంద్ర బిందువుగా మారి జిల్లాకే ప్రతిష్టాత్మకమైన విక్రమసింహపురి యూనివర్సిటీలో మంగళవారం స్నాతకోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. వెంకటాచలం మండలం కాకుటూరులోని యూనివర్సిటీ ప్రాంగణంలో 6, 7వ స్నాతకోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వర్సిటీ ఛాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్య అతిథిగా హైదరాబాద్‌కు చెందిన మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డీఎన్‌రెడ్డి హాజరయ్యారు. ప్రపంచీకరణకు అనుగుణంగా నైపుణ్యం మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డీఎన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచీకరణతో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నేటి యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, అప్పుడే ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలరన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జీఎం సుందరవల్లి మాట్లాడుతూ వర్సిటీ పరంగా సాధించిన ప్రగతిని వివరించారు. నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేసిన ఆచార్యులను అభినందించారు. రవీంద్ర సన్నారెడ్డికి గౌరవ డాక్టరేట్ శ్రీసిటీ సృష్టికర్త, మేనేజింగ్ డైరెక్టర్‌గా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న రవీంద్ర సన్నారెడ్డికి విక్రమసింహపురి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ డాక్టరేట్‌ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ తాను చిట్టమూరు మండలంలోని ఓ చిన్న పల్లెటూళ్లో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని కష్టపడి పైకి వచ్చానన్నారు. నేటి విద్యార్థులు కష్టపడితే ఏదైనా సాధించవచ్చన్నారు. ముగిసిన పర్యటన నెల్లూరు (క్రైమ్): అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటన ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం గవర్నర్ ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం నుంచి బయలుదేరి విక్రమసింహపురి యూనివర్సిటీలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం రోడ్డు మార్గాన పొదలకూరురోడ్డులోని కేన్సర్ హాస్పిటల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి పోలీసు కవాతుమైదానంలో హెలిప్యాడ్ నుంచి విజయవాడుకు బయలుదేరారు. దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు కీలకం : గవర్నర్ వీఎస్‌యూ చాన్సలర్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణ జరగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గాంధీ మహాత్ముడితో పాటు ఎంతో మంది త్యాగధనులు తమ ప్రాణాలు పణంగా పెట్టి స్వాతంత్య్రం సాధించారన్నారు. గాంధీజీ పిలుపు క్విట్ ఇండియా ఉద్యమంలో లక్షలాది మంది యువత పాల్గొన్నారన్నారు. ఇలాంటి స్వాతంత్య్రయోధులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రపంచంలో భారత్ ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న దేశమన్నారు. దేశాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసేందుకు, సమాజ ప్రగతి కోసం, మాతృభూమి గొప్ప తనం కోసం విద్యార్థులు పాటు పడాలన్నారు. అందుకు విద్య చక్కటి మార్గమన్నారు. విద్యార్థులు పట్టా అందుకోవడం జీవితంలో మధుర జ్ఞాపకమన్నారు. గ్రాడ్యుయేట్ అయిన ప్రతి విద్యార్థి ప్రయాణంలో కాన్వొకేషన్ ఒక మైలు రాయి అన్నారు. మానవత్వం మెలగడానికి ప్రాథమిక విలువలు విధిగా పాటించాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా అన్ని ప్రోగ్రాంల పాఠ్యాంశాలను ప్రభుత్వం సవరించిందన్నారు. 2025 నాటికి 1.20 కోట్ల మంది నైపుణ్యం ఉన్న యువత అవసరమన్నారు. అందుకనుగుణంగా యూనివర్సిటీలు విద్యార్థులను నైపుణ్య వంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. గోల్డ్ మెడల్స్, డిగ్రీ పట్టాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. గోల్డ్ మెడల్స్, డిగ్రీ పట్టాలు అందజేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా అత్యధిక మార్కులు సాధించి గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, రీసెర్చ్ స్కాలర్స్‌గా పట్టాలు పొందిన 18 మందికి 26 గోల్డ్ మెడల్స్, కాన్వొకేషన్ పట్టాలు అందించారు. వీరితో మరో 250 మంది గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్కు పట్టాలు అందించా రు. 1. పెనుమాల మనీషా, 2.దారా మాధవి, 3. ఎర్రగుడ్ల శ్రావ్యసుహిత్, 4. కారుమంచి వాసవి, 5. మూర్తి లోహిత (మూడు గోల్డ్ మెడల్స్), 6. షేక్ అఫ్సానా (మూడు గోల్డ్ మెడల్స్), 7. టాటా శ్రీనాథ్‌గౌడ్ (రెండు గోల్డ్ మెడల్స్), 8. పంచకట్ల జ్యోతి (రెండు గోల్డ్ మెడల్స్) 9. దేవరకొండ కల్పన, 10. పోలు అపర్ణ (రెండు గోల్డ్ మెడల్స్), 11. బొరిగి కిరణ్‌కుమార్, 12. రేవిల్ల వర్షిణి సాయిమమత, 13.తన్నీరు మల్లిక, 14. షేక్ ఫజులున్, 15. పోలిరెడ్డి శ్రీదేవి, 16.పల్నాటి సంధ్య (రెండు గోల్డ్ మెడల్స్), 17. పి.లిల్లీ, 18. గొల్లపల్లి సునీత అందుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎల్.విజయకృష్ణారెడ్డి, గవర్న ర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడి యా, కలెక్టర్ చక్రధర్‌బాబు, కమ్యూనిటీ డెవలప్మెంట్ చైర్మన్ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, జేసీ హరేందిరప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ జాహ్నవి, అధికారులు, డీన్ లు, అధ్యాపకులు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు. చదవండి: (ప్రేమ వివాహం.. సాంబశివరావు చెవికొరికి, కర్రలతో దాడి) -
విరబూసిన విద్యావనం
చారిత్రక సింహపురి పేరుతో పురుడు పోసుకున్న విక్రమసింహపురి యూనివర్సిటీ అనతికాలంలో పేరెన్నిక వర్సిటీల సరసన నిలిచేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. జిల్లాలోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దరి చేర్చాలన్న సమున్నత సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సృష్టించిన వర్సిటీ సత్ఫలితాలను సాధిస్తోంది. వర్సిటీ, అనుబంధ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ సగర్వంగా స్నాతకోత్సవాల పండగ చేసుకుంటోంది. మంగళవారం గవర్నర్ బిశ్వభూషణ్ చేతుల మీదుగా విద్యార్థులకు పట్టాలను అందించనుంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సింహపురి విద్యావనంలో విద్యా కుసుమాలు విరగబూస్తున్నాయి. ఉన్నత సంకల్పంతో నెలకొల్పిన యూనివర్సిటీ సత్ఫలితాలు సాధిస్తోంది. ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా దినదినాభివృద్ధి చెందుతూ విక్రమ సింహపురి యూనివర్సిటీ దేశంలోనే అగ్రగామి వర్సిటీగా పరిణతి చెందుతోంది. అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందిన జిల్లాలో విద్యా వర్సిటీ లేకపోవడాన్ని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008లో విక్రమసింహపురిగా పేరొందిన నెల్లూరులో అదే పేరుతో వర్సిటీని ఏర్పాటు చేశారు. తొలుత పరాయి పంచన ప్రారంభించిన వర్సిటీకి నెల్లూరుకు కూతవేటు దూరంలోని కాకుటూరులో 87 ఎకరాల విస్తీర్ణంలో సర్వాంగ హంగులతో వర్సిటీ సొంత భవనానికి పునాదులు వేశారు. పుష్కర కాలంలోనే వైభవంగా వెలుగొందుతున్న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం 6, 7 స్నాతకోత్సవాలను మంగళవారం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని వీఎస్‌యూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. గవర్నర్ బిశ్వభూషణ్, మంత్రి బొత్స సత్యనారాయణ, హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ డీఎన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. 26 గోల్డ్‌మెడల్స్ అందజేత వర్సిటీ స్నాతకోత్సవంలో వివిధ విభాగాల్లో అత్యున్నత ప్రతిభ చాటిన 19 మంది విద్యార్థులకు 26 గోల్డ్ మెడల్స్‌ను అందించనున్నారు. 252 మందికి ప్రత్యక్షంగా, 4,071 మంది విద్యార్థులకు తపాలా ద్వారా పట్టాలు అందించేందుకు ప్రణాళికలు చేపట్టారు. శ్రీసిటీ సృష్టికర్తకు గౌవర డాక్టరేట్ పల్లెటూళ్లను పరిశ్రమల గూళ్లుగా మార్చిన శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డికి విక్రమ సింహపురి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అందిస్తోంది. తడ–సత్యవేడు మండలాల మధ్య 5,700 ఎకరాల్లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులతో చేపట్టిన శ్రీసిటీకి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. 28 దేశాలకు చెందిన 200 పరిశ్రమలు పైగా శ్రీసిటీలో నెలకొల్పారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా 50 వేల మందికి ఉపాధి లభిస్తోంది. అందుకు కారకులైన ఎండీ రవీంద్ర సన్నారెడ్డికి గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ అందించనున్నారు. సామాజిక బాధ్యతలో ప్రత్యేకత వర్సిటీ సామాజిక బాధ్యతను గుర్తెరిగింది. కరోనా కారణంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్, జూమ్, గూగుల్ మీట్ వంటి మొబైల్ అప్లికేషన్లు ద్వారా బోధన చేసి, సకాలంలో పరీక్షలు నిర్వహించి సత్ఫలితాలు సాధించింది. 2019లో ఎన్ఎస్ఎస్ విభాగంలో భారతదేశంలోనే రెండో అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా వీఎస్‌యూ నిలిచింది. 2020లో రాష్ట్ర ఉత్తమ వలంటీర్ అవార్డు, 2021లో యూత్ ఐకాన్ అవార్డు దక్కించుకుంది. వర్సిటీ ఆధ్వర్యంలో వివిధ క్రీడలకు సంబంధించి 19 జట్లలోని 164 మంది విద్యార్థులు జాతీయస్థాయి క్రీడాకారులుగా ఎదిగారు. ఈ ప్రాంత ప్రయోజనాలకు అనుగుణంగా వర్సిటీని తీర్చిదిదేందుకు వైస్ చాన్సలర్ జీఎం సుందరవల్లి, రిజిస్ట్రార్ ఎల్వీ కృష్ణారెడ్డి ప్రత్యేక ప్రణాళికలు రచించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింత ముందుకు ప్రభుత్వ ప్రోత్సాహంతో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే వర్సిటీలో 17 విభాగాలు ఉన్నాయి. జిల్లాకు అనువుగా మరిన్నీ సబ్జెక్ట్‌లు ప్రవేశ పెట్టేందుకు నిపుణుల కమిటీ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నాం. రీసెర్చ్‌కు ప్రాధాన్యం ఇçవ్వనున్నాం. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రూ.30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నాం. అవసరమైన మేరకు దాతల సహకారం కోరుతున్నాం. సామాజిక బాధ్యతలను దృష్టిలో ఉంచుకొని అనుగుణంగా తీర్చి దిద్దేందుకు ప్రణాళికలు రచించుకున్నాం. – ఎల్ విజయకృష్ణారెడ్డి -
అర్హత లేకపోయినా కొలువులు
సాక్షి, నెల్లూరు: విక్రమ సింహపురి యూనివర్సిటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పాలన వ్యవహారాలు, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పాటించాల్సిన ఉన్నతాధికారులే అక్రమ బాట పట్టారు. యూజీసీ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా నియామకాలు చేపట్టారు. అధ్యాపకుల కొరత ఉన్న చోట రిటైర్డ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలనే ఆదేశాలను పక్కదోవ పట్టించారు. అర్హత లేకపోయినా అప్పటి ప్రభుత్వ పెద్దలు, వర్సిటీ ఉన్నతాధికారులు కలిసి తమకు ఇష్టమున్న వారిని అవుట్సోర్సింగ్ కింద నియమించారు. ఈ తరుణంలో అక్రమ మార్గంలో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు పొందిన రిటైర్డ్ ఉద్యోగుల ఉద్వాసనకు నూతన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గత నెల 18న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇది జరిగి నెల కావస్తున్నా వర్సిటీ ఉన్నతాధికారులు వారిని తొలగించేందుకు ఇష్టపడటం లేదు. వారి అస్మదీయులను కాపాడుకునేందుకే ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అడ్డగోలుగా నియామకాలు వర్సిటీలో నియామకాలు చేపట్టాలంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. వర్సిటీలో ఏయే పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారో బహిరంగ ప్రకటన ఇవ్వాల్సి ఉంది. దీన్ని వర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చాలి. అర్హులను గుర్తించి వారిని విధుల్లోకి తీసుకోవాలి. అయితే విక్రమ సింహపురి వర్సిటీలో ఈ నిబంధనలను పాటించకుండా అడ్డగోలుగా నియామకాలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ పెద్దలు, వర్సిటీ ఉన్నతాధికారులు కలిసి తమ అనుయాయులను నియమించుకున్నారు. వర్సిటీలో బోధనకు విశ్రాంత ఉద్యోగులను తీసుకోవాలని ఇచ్చిన జీఓను పక్కదారి పట్టించారు. సాధారణంగా వర్సిటీలో బోధనకు విశ్రాంత ప్రొఫెసర్లను తీసుకోవాల్సి ఉంది. అయితే అప్పటి ఉన్నతాధికారులు కేవలం డిగ్రీ అధ్యాపకులుగా పనిచేస్తూ రిటైరైన వారిని వర్సిటీలోకి తీసుకున్నారు. వీరిలో 70 ఏళ్లు పైబడిన వారూ ఉండటం గమనార్హం. దీంతో పాటు భార్య, భర్తలకు అర్హత లేకపోయినా అవుట్సోర్సింగ్ కింద అప్పటి వర్సిటీ ఉన్నతాధికారులు విధుల్లోకి తీసుకున్నారు. వర్సిటీలో ప్రస్తు తం 15 మంది వరకు ఉన్నట్లు సమాచారం. కేవలం ఇద్దరు, ముగ్గురు మాత్రమే విశ్రాంత ప్రొఫెసర్లు ఉన్నారని తెలిసింది. వీరితో పాటు నాన్ టీచింగ్ కింద నిబంధనలను పాటించకుండా నియమించారు. వీరు ప్రతి నెలా పింఛన్‌తో పాటు యూనివర్సిటీ నుంచి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం పొందుతున్నారు. ఉత్తర్వులను పెడచెవిన పెట్టారు అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న విశ్రాంత టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను తొలగించాలని గత నెల 18న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా నేటికీ విక్రమ సింహపురి యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వర్సిటీ ఉన్నతాధికారులకు సంబంధించిన వ్యక్తులు కావడంతో అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపులో తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్నారు. విశ్రాంత ఉద్యోగుల కనుసన్నల్లోనే పాలన అవుట్సోర్సింగ్ కింద నియమితులైన విశ్రాంత ఉద్యోగుల కనుసన్నల్లోనే విక్రమ సింహపురి యూనివర్సిటీ పాలన, వ్యవహారాలు జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ప్రధానంగా నాన్ టీచింగ్‌లో పనిచేస్తున్న విశ్రాంత ఉద్యోగులు వర్సిటీ వీసీతో పాటు రిజి్రస్టార్లను శాసిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వర్సిటీ అడ్మిని్రస్టేషన్లో వీరి పాత్ర ప్రముఖంగా ఉంటుంది. వీరు చెప్పిందే అక్కడ జరుగుతోంది. వీరికి గత ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటంతో యూనివర్సిటీలో చక్రం తిప్పారు. వీరితో పాటు టీచింగ్ కేటగిరీల్లో ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులు కూడా వర్సిటీ పాలన వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. -
వర్సిటీ.. అక్రమాల పుట్ట
విక్రమ సింహపురి యూనివర్సిటీ అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పాలన గాడి తప్పింది. కింది స్థాయి ఉద్యోగాల నియామకాల నుంచి భవనాల నిర్మాణాలు, అద్దెభవనాలు, యూనివర్సిటీకి చెల్లించాల్సిన అఫిలియేషన్ ఫీజు రాబట్టడం, సిబ్బందికి జీతాలు పెంచడంలో వర్సిటీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పరీక్షల్లో ప్రైవేటు కళాశాలలకు అనుకూలంగా వ్యవహరించడం తదితర విషయాల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట, అర్బన్): గ్రామీణ ప్రాంతాల్లో పేదలందరికీ ఉన్నత విద్యను అందించాలనే ఉన్నతాశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాకో యూనివర్సిటీని ప్రకటించారు. అందులో భాగంగానే పదేళ్ల క్రితం నెల్లూరులో విక్రమసింహపురి యూనివర్సిటీని(వీఎస్‌యూ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాణ్యమైన విద్య అందించడం, పరిశోధనలకు ఆలంబనగా నిలవడం యూనివర్సిటీ చేయాల్సిన ప్రథమ కర్తవ్యం. అయితే వీఎస్‌యూలో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. పాలనాధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఆ ఇద్దరికే జీతాలు పెంపు యూనివర్సిటీలో ఆరు, ఏడు సంవత్సరాల నుంచి డిగ్రీ అర్హతతో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది సుమారు 25 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.9,700 ఇస్తున్నారు. వీరిని కాదని మూడున్నరేళ్ల క్రితం చేరిన ఇద్దరికి జీతం రూ.11,400 జీతం చొప్పున పెంచుతూ అధికారులు ఫైలును శనివారం సిద్ధం చేశారు. మిగతా వారి నోట్లో మట్టికొట్టారు. జీతాలు పెంచేందుకు కారణం పరిశీలిస్తే.. ఒకరు జిల్లా మంత్రికి సంబంధించిన వారు కాగా మరొకరు వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కీలక అధికారి బంధువు. జీతాలు జూనియర్లకు పెంచడానికి, సీనియర్లకు పెంచకపోవడానికి కారణాలు గురించి రిజిస్ట్రార్ మాట్లాడుతూ విద్యార్హత, సీనియర్ అనే విషయం కీలకం కాదన్నారు. వారు గతంలో ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు, ఆ పోస్టుకు నిబంధనల ప్రకారం ఎంత జీతం ఇవ్వాలి అనే అంశంపై ఆధారపడి ఇక్కడ జీతం పెంచేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఈ మాటే వాస్తవమైతే గతంలో కావలి పీజీ సెంటర్లో ల్యాబ్అసిస్టెంట్గా దరఖాస్తు చేసుకుని కొంతకాలం కావలిలో పనిచేసిన వ్యక్తిని వర్సిటీ ఏడీ కార్యాలయానికి బదిలీ చేయించారు. అంతేకాకుండా పరీక్షలకు సంబంధించి కోడింగ్, డీకోడింగ్ తదితర కీలక బాధ్యతలు అప్పజెప్పారు. రిజిస్ట్రార్ చెప్పింది వాస్తవమైతే ఈ వ్యక్తి దరఖాస్తు చేసుకున్న ల్యాబ్ అసిస్టెంట్‌ను కాదని మరో బాధ్యతలు ఎలా అప్పజెప్పారో అర్థం కావడం లేదు. ఖాళీభవనానికి రూ.వేలల్లో అద్దె చెల్లింపు వర్సిటీ పరిపాలనా కార్యాలయాన్ని నెల్లూరు నుంచి కాకుటూరులోని సొంత భవనంలోకి ఏడాదిన్నర క్రితమే తరలించారు. అయితే పీజీ సెట్ సెంటర్‌ను మాత్రం తరలించలేదు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన పీజీ సెట్ భవనాన్ని ఖాళీగా ఉంచారు. ప్రతి నెలా రూ.20వేలు అద్దె చెల్లిస్తున్నారు. ఇందులో ఒక అధికారికి భారీగా కమీషన్ అందుతుందని ఆరోపణలున్నాయి. పైగా ఈ ఏడాది పీజీ సెట్‌కు సంబంధించి ఎంబీఏలో కొన్ని విభాగాలకు అడ్మిషన్లు ఇవ్వకుండా ఆపేశారు. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఇచ్చే కమీషన్ల కోసమే ఈ పని చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా అక్రమాలు ♦ వీసీ పదవీ కాలం మరో నెలలో ముగియనుంది. ఆరు నెలల ముందు నుంచే ఉద్యోగ నియామకాల కోసం ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకూడదు. అయితే ఇక్కడ వీసీ ఆధ్వర్యంలో అధ్యాపక పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలొచ్చాయి. అనేక వివాదాలకు కేంద్ర బిందువైన అప్పటి రిజిస్ట్రార్ శివశంకర్‌ను ఈ పోస్టుల దరఖాస్తులకు స్క్రూటినీ అధికారిగా నియమించడం దారుణమని విద్యార్థులు వాపోతున్నారు. ఇందులో గత రిజిస్ట్రార్‌పై వీసీకి అంత ప్రేమ ఎందుకని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఒకే కాలనీలో .. ఒకే వర్గానికి చెందిన బం««ధుమిత్రులకు కిందిస్థాయిలో 32 పోస్టులను కట్టబెట్టారు. మిగతా వర్గాల వారికి ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ♦ ఎంతో మంది సీనియర్లు వర్సిటీలో పని చేస్తుండగా రెండు నెలల క్రితం కేవలం నలుగురు నమ్మిన బంట్లుగా ఉన్న ఉద్యోగుల పేర్లు మాత్రమే టైం స్కేల్(రెగ్యులర్) కింద అనుమతివ్వాలని బోర్డుకు ప్రతిపాదనలు పంపారు. మిగతా వారిని కాదని నలుగురికే టైంస్కేల్ వర్తింపజేయడానికి బోర్డు అంగీకరించలేదు. దీంతో ఒక ఉద్యోగి తనకు ఎలాగూ టైం స్కేల్ ఇప్పించలేకపోయారని తన భార్యకు పోస్టు ఇవ్వాలని కోరడు. కాంట్రాక్ట్ బేస్‌లో వీసీ ఆమెకు ఈ నెల ఒకటో తేదీన ఉద్యోగం ఇచ్చారని తెలిసింది. అధికారం ఉంటే ఒక పద్ధతి, రోస్టర్ ఏమీ లేకుండా ఉద్యోగం కల్పించడం తగునా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సహకరించకపోతే ఇబ్బందులే.. ♦ ఐదు రోజుల క్రితం కావలి పీజీ సెంటర్లో ఇంటర్నల్ పరీక్ష రాసేందుకు వర్సిటీ ఉన్నతాధికారి బంధువుగా ప్రచారం జరుగుతున్న ఒక విద్యార్థిని వచ్చారు. హాజరు లేని కారణంగా పరీక్ష రాయించేందుకు అక్కడి అధ్యాపకురాలు అంగీకరించలేదు. ఇలా అంగీకరించనందుకు ఆమెకు ఉన్నతాధికారుల వేధింపులు మొదలయ్యాయి. యూనివర్సీటికీ ప్రైవేటు కళాశాలల బకాయి ♦ యూనివర్సిటీ ఆర్థిక కష్టాల్లో ఉంది. అయితే వర్సిటీకీ అఫిలియేషన్ ఫీజు కింద అన్ని ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు కలిసి సుమారు రూ.కోటి వరకు ఫీజు చెల్లించాలి. విద్యార్థులను ముక్కు పిండి వసూలు చేస్తున్న ప్రైవేటు కళాశాలల యజమానులు వర్సిటీకి బకాయిపడిన ఫీజు మాత్రం చెల్లించడం లేదు. ఇంతపెద్ద మొత్తంలో బకాయిలు ఆగిపోవడానికి కారణం ప్రైవేటు కళాశాలలు వర్సిటీ ఉన్నతాధికారులకు ఇస్తున్న తాయిలాలేనని తెలుస్తోంది. ఇలా తవ్వే కొద్దీ అక్రమాలెన్నో వెలుగు చూస్తున్నాయి. అంతా పారదర్శకంగానే నేను బాధ్యతలు చేపట్టి వారం రోజులే అయింది. అంతా పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తా. సీనియర్లను కాదని ఇద్దరు జూనియర్లకు జీతాలు పెంచే విషయంలో తప్పులు జరగలేదు. వారు గతంలో దరఖాస్తు చేసుకున్న పోస్టునుబట్టి జీతాలు పెరగబోతున్నాయి. యూనివర్సిటీకి ప్రైవేటు కళాశాలలు బకాయిలున్న మాట వాస్తవమే. వారందరి దగ్గర అఫిలియేషన్ ఫీజులు వసూలు చేస్తాం. అప్పటి వరకు వారికి సర్వీసులు నిలిపేస్తాం. ప్రస్తుతం వర్సిటీలో ఉన్న రూములు సరిపోవడం లేదు. అందుకే పీజీ సెట్ కార్యాలయం ప్రైవేటు భవనంలోనే ఉంది. అవినీతి అనేది ఉత్తిదే. –దుర్గాప్రసాద్, నూతన రిజిస్ట్రార్, వీఎస్‌యూ -
విక్రమసింహపురి వర్సిటీ వెబ్ సైట్ హ్యాకింగ్
నెల్లూరు: నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన వెబ్‌సైట్‌ను కొందరు వ్యక్తులు శనివారం మధ్యాహ్నం నుంచి మరోసారి హ్యాక్ చేశారు. కొంత మంది విద్యార్థులు డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాల కోసం వీఎస్‌యూ వెబ్సైట్ ఓపెన్ చేస్తే పనిచేయలేదు. అయితే గూగూల్ కెళ్లి వీఎస్‌యూ రిజల్ట్స్ టైపు చేస్తే ఓపెన్ అవుతుంది. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. వీఎస్‌యూ అధికారులకు మాత్రం ‘సాక్షి’ సమాచారం ఇచ్చేదాక తెలియక పోవడం గమనార్హం. పాకిస్థాన్‌కు చెందిన కొంత మంది వ్యక్తులు వీఎస్‌యూ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు తెలిసింది. పాకిస్థాన్ జిందాబాద్ అని, వెబ్‌సైట్‌కు సెక్యూరిటీ అనుకోవడం కేవలం మీ భ్రమని పోస్టు చేశారు. దీంతో పాటు ఈ నెల 14న దేశ వ్యాప్తంగా అనేక వెబ్సైట్లను హ్యాక్ చేస్తామని మెసేజ్ పెట్టారు. ఇదే వీఎస్‌యూ వెబ్‌సైట్‌ను గత నెల 30న పాకిస్థాన్‌కు చెందిన కొంతమంది హ్యాక్ చేశారు. అయితే వీఎస్‌యూ వెబ్‌సైట్‌పై సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. వెబ్‌సైట్‌ను బెంగళూరుకు చెందిన శ్రీవా టెక్నాలజీస్ సంస్థ నిర్వహణలో ఉంది. వీఎస్‌యూ వెబ్సైట్ హ్యాక్ విషయంలో వీఎస్‌యూ రిజిస్ట్రార్ శివశంకర్‌కు ఫోన్ చేయగా మాల్వేర్ ఇంజక్షన్ వైరస్ ఫైర్‌వాల్‌ను బ్లాక్ చేసినట్లు చెప్పారు. సంస్థ నిర్వాహకులకు ఈవిషయాన్ని తెలియజేసి వెబ్‌సైట్‌ను క్లోజ్ చేయించారని తెలిపారు. -
వర్సిటీ వెబ్సైట్ హ్యాక్ రెండో సారి
వెబ్సైట్ హ్యాకింగ్‌పై కేసు నమోదు 2013లోనూ ఓ సారి హ్యాక్ నెల్లూరు (క్రైమ్) : సింహపురి వర్సిటీ వెబ్సైట్ హ్యాకింగ్ చేయడం ఇది రెండో సారి. 2014 ఆగస్టులో నకిలీ సర్టిఫికెట్ల ముఠా హ్యాకింగ్‌కు పాల్పడినట్లు వర్సిటీ అధికారులు గుర్తించి అప్పట్లో ఒకటో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సైబర్ క్రైం కింద కేసు నమోదు చేశారు. వర్సిటీ ఆధీకృత www.simhapuriuniv.org వెబ్సైట్ ని 2008లో ప్రారంభించింది. దాని పర్యవేక్షణ హైదరాబాద్‌కు చెందిన ఐసీఎం. స్పాట్ సంస్థ నిర్వహిస్తోంది. 2012లో వెబ్సైట్లో మార్పులు చేర్పులు చేసి పాత వెబ్‌సైట్‌కు బదులుగా www.simhapuriuniv.ac పేరిట కొత్త వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. పాత వెబ్‌సైట్‌ను తొలగించాలని ఎడ్యుకేషన్ రీసెర్చ్ నెట్ (ఈఆర్ఎన్ఈటీ)ని వర్సిటీ రిజిస్ట్రార్ కోరారు. అప్పటి నుంచి ఆ వెబ్సైట్ గురించి వర్సిటీæ అధికారులు పట్టించుకోలేదు. 2013 అక్టోబర్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి వర్సిటీ పాత వెబ్‌సైట్‌ను హ్యాకింగ్ చేశాడు. అందులో నకిలీ ఐడీని క్రియేట్ చేసి 116 కోర్సులను వర్సిటీ నిర్వహిస్తుందని, అందుకు సంబంధించిన ఫీజు వివరాలను అందులో పొందు పరిచాడు. చిరునామా, సెల్‌ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచాడు. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరస్పాండెంట్ కోర్సుల్లో చేరేందుకు ఆ సెల్‌ఫోన్ నంబర్లను సంప్రదించారు. వారి వద్ద నుంచి సదరు హ్యాకర్ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశాడు. నకిలీ సర్టిఫికెట్లను వారికి మంజూరు చేశాడు. ఈ నేపథ్యంలో 2014 ఆగస్టు మొదటి వారంలో కర్ణాటక హోసూరుకు చెందిన నూర్ఇస్తా హ్యాకర్ వద్ద నుంచి ఎంఈడీ సర్టిఫికెట్ పొంది పైచదువులకు మైగ్రేషన్ సర్టి్టఫికెట్ కోసం యూనివర్సిటీకి వచ్చాడు. అధికారులు వాటిని పరిశీలించి అవి నకిలీవిగా తేల్చారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ పాత వెబ్‌సైట్‌ను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హ్యాకింగ్ చేసి మోసాలకు పాల్పడుతున్నారన్న విషయం తేట తెల్లమైంది. దీంతో 2014 ఆగస్టు 12వ తేదీన యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎస్.మురళీమోహన్‌రెడ్డి ఒకటోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఒకటోనగర ఇన్స్పెక్టర్ మద్ది శ్రీనివాసరావు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు వరంగల్‌లో ఐడీని క్రియేట్ చేశాడని, తన కార్యకలాపాలు బెంగళూరు, హరయనా నుంచి సాగిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అయితే ఇంత వరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి లేదు. పోలీసులు సైతం కేసు నమోదుతో సరిపెట్టుకున్నారు. తాజాగా తీవ్రవాదులు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరపాలని వర్సిటీ అధికారులు కోరుతున్నారు. తాజాగా మళ్లీ కేసు నమోదు విక్రమ సింహపురి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను తీవ్రవాదులు హ్యాకింగ్ చేయడంపై వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మురళీమోహన్ ఫిర్యాదు మేరకు సోమవారం ఒకటో నగర ఇన్స్పెక్టర్ అబ్దుల్ కరీం సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశారు. నెల్లూరు విక్రమసింహపురి యూనివర్శిటి అధికారిక వెబ్సైట్ www.simhapuriuniv.ap.inను బెంగళూరుకు చెందిన శ్రీవా టెక్నాలజీస్ సంస్థ నిర్వహిస్తోంది. శనివారం సాయంత్రం వె»Œ సైట్ హ్యాకింగ్‌కు గురైంది. ఆదివారం కొందరు విద్యార్థులు, అధ్యాపకులు వర్సిటీకి చెందిన వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడంతో హోమ్ పేజీపై దేశప్రధాని, బాలీవుడ్ హీరో షారూఖ్‌ఖాన్‌లకు హెచ్ఈఎక్స్786 పేరిట హెచ్చరికలు ఉండటాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఈ విషయం వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు వెంటనే శ్రీవా టెక్నాలజీస్ ద్వారా సైట్‌ను పునరుద్ధరించారు. -
విక్రమ సింహపురి పాత వెబ్సైట్ హ్యాకింగ్
-
విక్రమ సింహపురి పాత వెబ్సైట్ హ్యాకింగ్
నెల్లూరు: విక్రమ సింహపురి యూనివర్సిటీ పాత వెబ్సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సింహపురియునివి.ఓఆర్జీ)ని గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. నకిలీ మెయిల్ ఐడీ సృష్టించి విద్యార్థులను మోసగిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఈ విషయం గుర్తించిన వర్సిటీ అధికారులు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు..నెల్లూరులోని విక్రమ సింహపురి వర్సిటీ 2008లో అధికారిక www.simhapuriuniv.org ని ప్రారంభించింది. దాని పర్యవేక్షణ హైదరాబాద్‌కు చెందిన ఐసీఎం స్పాట్ సంస్థ చేస్తోంది. 2012లో వెబ్సైట్లో మార్పులు చేర్పులు చేసి పాత వెబ్‌సైట్‌కు బదులుగా www.simhapuriuniv.ac పేరిట కొత్త వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. పాత వెబ్‌సైట్‌ను తొలగించాలని ఎడ్యుకేషన్ రీసెర్చ్ నెట్(ఈఆర్ఎన్ఈటీ)ని వర్సిటీ రిజిస్ట్రార్ కోరారు. అప్పటినుంచి ఆ వెబ్సైట్ గురించి అధికారులు పట్టించుకోలేదు. గతేడాది అక్టోబర్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి వర్సిటీ పాత వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశాడు. అందులో నకిలీ మెయిల్ క్రియేట్ చేసి 116 కోర్సులను వర్సిటీ నిర్వహిస్తోందని, అందుకు సంబంధించిన ఫీజు వివరాలను అందులో పొందుపరిచాడు. అంతేకాకుండా చిరునామా, సెల్‌ఫోను నంబర్లు అందుబాటులో ఉంచాడు. దీంతో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కరస్పాండెన్స్ కోర్సుల్లో చేరేందుకు ఆ నంబర్లను సంప్రదించారు. వారి నుంచి సదరు హ్యాకర్ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసి నకిలీ సర్టిఫికెట్లు జారీచేశాడు. అయితే ఓ విద్యార్థి అనుమానంతో వర్సిటీ అధికారులను సంప్రదించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ పాత వెబ్‌సైట్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎస్.మురళీమోహన్‌రెడ్డి ఒకటో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ మద్ది శ్రీనివాసరావు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు వరంగల్‌లో ఐడీని క్రియేట్ చేశాడనీ, తన కార్యకలాపాలు బెంగళూరు, హార్యానా నుంచి సాగిస్తున్నాడని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.