అర్హత లేకపోయినా కొలువులు  | Irregularities In Vikramasimha University In Nellore | Sakshi
Sakshi News home page

 అర్హత లేకపోయినా కొలువులు 

Published Thu, Nov 14 2019 8:42 AM | Last Updated on Thu, Nov 14 2019 8:53 AM

Irregularities In Vikramasimha University In Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు: విక్రమ సింహపురి యూనివర్సిటీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పాలన వ్యవహారాలు, ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పాటించాల్సిన ఉన్నతాధికారులే అక్రమ బాట పట్టారు. యూజీసీ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా నియామకాలు చేపట్టారు. అధ్యాపకుల కొరత ఉన్న చోట రిటైర్డ్‌ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలనే ఆదేశాలను పక్కదోవ పట్టించారు. అర్హత లేకపోయినా అప్పటి ప్రభుత్వ పెద్దలు, వర్సిటీ ఉన్నతాధికారులు కలిసి తమకు ఇష్టమున్న వారిని అవుట్‌సోర్సింగ్‌ కింద నియమించారు. ఈ తరుణంలో అక్రమ మార్గంలో అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియామకాలు పొందిన రిటైర్డ్‌ ఉద్యోగుల ఉద్వాసనకు నూతన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు గత నెల 18న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇది జరిగి నెల కావస్తున్నా వర్సిటీ ఉన్నతాధికారులు వారిని తొలగించేందుకు ఇష్టపడటం లేదు. వారి అస్మదీయులను కాపాడుకునేందుకే ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అడ్డగోలుగా నియామకాలు 
వర్సిటీలో నియామకాలు చేపట్టాలంటే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిబంధనలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. వర్సిటీలో ఏయే పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారో బహిరంగ ప్రకటన ఇవ్వాల్సి ఉంది. దీన్ని వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. అర్హులను గుర్తించి వారిని విధుల్లోకి తీసుకోవాలి. అయితే విక్రమ సింహపురి వర్సిటీలో ఈ నిబంధనలను పాటించకుండా అడ్డగోలుగా నియామకాలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ పెద్దలు, వర్సిటీ ఉన్నతాధికారులు కలిసి తమ అనుయాయులను నియమించుకున్నారు. వర్సిటీలో బోధనకు విశ్రాంత ఉద్యోగులను తీసుకోవాలని ఇచ్చిన జీఓను పక్కదారి పట్టించారు. సాధారణంగా వర్సిటీలో బోధనకు విశ్రాంత ప్రొఫెసర్లను తీసుకోవాల్సి ఉంది.

అయితే అప్పటి ఉన్నతాధికారులు కేవలం డిగ్రీ అధ్యాపకులుగా పనిచేస్తూ రిటైరైన వారిని వర్సిటీలోకి తీసుకున్నారు. వీరిలో 70 ఏళ్లు పైబడిన వారూ ఉండటం గమనార్హం. దీంతో పాటు భార్య, భర్తలకు అర్హత లేకపోయినా అవుట్‌సోర్సింగ్‌ కింద అప్పటి వర్సిటీ ఉన్నతాధికారులు విధుల్లోకి తీసుకున్నారు. వర్సిటీలో ప్రస్తు తం 15 మంది వరకు ఉన్నట్లు సమాచారం. కేవలం ఇద్దరు, ముగ్గురు మాత్రమే విశ్రాంత ప్రొఫెసర్లు ఉన్నారని తెలిసింది. వీరితో పాటు నాన్‌ టీచింగ్‌ కింద నిబంధనలను పాటించకుండా నియమించారు. వీరు ప్రతి నెలా పింఛన్‌తో పాటు యూనివర్సిటీ నుంచి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం పొందుతున్నారు. 

ఉత్తర్వులను పెడచెవిన పెట్టారు 
అవుట్‌సోర్సింగ్‌ కింద పనిచేస్తున్న విశ్రాంత టీచింగ్, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులను తొలగించాలని గత నెల 18న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా నేటికీ విక్రమ సింహపురి యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వర్సిటీ ఉన్నతాధికారులకు సంబంధించిన వ్యక్తులు కావడంతో అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల తొలగింపులో తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను సైతం బేఖాతర్‌ చేస్తున్నారు.    

విశ్రాంత ఉద్యోగుల కనుసన్నల్లోనే పాలన 
అవుట్‌సోర్సింగ్‌ కింద నియమితులైన విశ్రాంత ఉద్యోగుల కనుసన్నల్లోనే విక్రమ సింహపురి యూనివర్సిటీ పాలన, వ్యవహారాలు జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ప్రధానంగా నాన్‌ టీచింగ్‌లో పనిచేస్తున్న విశ్రాంత ఉద్యోగులు వర్సిటీ వీసీతో పాటు రిజి్రస్టార్లను శాసిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వర్సిటీ అడ్మిని్రస్టేషన్లో వీరి పాత్ర ప్రముఖంగా ఉంటుంది. వీరు చెప్పిందే అక్కడ జరుగుతోంది. వీరికి గత ప్రభుత్వ పెద్దల అండదండలు పుష్కలంగా ఉండటంతో యూనివర్సిటీలో చక్రం తిప్పారు. వీరితో పాటు టీచింగ్‌ కేటగిరీల్లో ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులు కూడా వర్సిటీ పాలన వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement