నెల్లూరు (అర్బన్): కొత్తకొత్త స్కిల్ డెవలప్‌మెంట్, రీసెర్చ్, ఉపాధి కోర్సులను ప్రవేశ పెడుతూ నాణ్యమైన విద్య, ఉద్యోగాల కల్పనకు కేంద్ర బిందువుగా మారి జిల్లాకే ప్రతిష్టాత్మకమైన విక్రమసింహపురి యూనివర్సిటీలో మంగళవారం స్నాతకోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. వెంకటాచలం మండలం కాకుటూరులోని యూనివర్సిటీ ప్రాంగణంలో 6, 7వ స్నాతకోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వర్సిటీ ఛాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్య అతిథిగా హైదరాబాద్‌కు చెందిన మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డీఎన్‌రెడ్డి హాజరయ్యారు.
ప్రపంచీకరణకు అనుగుణంగా నైపుణ్యం
మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డీఎన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రపంచీకరణతో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నేటి యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, అప్పుడే ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలరన్నారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జీఎం సుందరవల్లి మాట్లాడుతూ వర్సిటీ పరంగా సాధించిన ప్రగతిని వివరించారు. నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేసిన ఆచార్యులను అభినందించారు.
రవీంద్ర సన్నారెడ్డికి గౌరవ డాక్టరేట్
శ్రీసిటీ సృష్టికర్త, మేనేజింగ్ డైరెక్టర్‌గా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న రవీంద్ర సన్నారెడ్డికి విక్రమసింహపురి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ డాక్టరేట్‌ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ తాను చిట్టమూరు మండలంలోని ఓ చిన్న పల్లెటూళ్లో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని కష్టపడి పైకి వచ్చానన్నారు. నేటి విద్యార్థులు కష్టపడితే ఏదైనా సాధించవచ్చన్నారు.
ముగిసిన పర్యటన
నెల్లూరు (క్రైమ్): అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటన ప్రశాంతంగా ముగిసింది. మంగళవారం గవర్నర్ ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం నుంచి బయలుదేరి విక్రమసింహపురి యూనివర్సిటీలోని హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ స్నాతకోత్సవంలో పాల్గొన్న అనంతరం రోడ్డు మార్గాన పొదలకూరురోడ్డులోని కేన్సర్ హాస్పిటల్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి పోలీసు కవాతుమైదానంలో హెలిప్యాడ్ నుంచి విజయవాడుకు బయలుదేరారు.
దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు కీలకం : గవర్నర్
వీఎస్‌యూ చాన్సలర్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణ జరగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గాంధీ మహాత్ముడితో పాటు ఎంతో మంది త్యాగధనులు తమ ప్రాణాలు పణంగా పెట్టి స్వాతంత్య్రం సాధించారన్నారు. గాంధీజీ పిలుపు క్విట్ ఇండియా ఉద్యమంలో లక్షలాది మంది యువత పాల్గొన్నారన్నారు. ఇలాంటి స్వాతంత్య్రయోధులను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రపంచంలో భారత్ ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న దేశమన్నారు.
దేశాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసేందుకు, సమాజ ప్రగతి కోసం, మాతృభూమి గొప్ప తనం కోసం విద్యార్థులు పాటు పడాలన్నారు. అందుకు విద్య చక్కటి మార్గమన్నారు. విద్యార్థులు పట్టా అందుకోవడం జీవితంలో మధుర జ్ఞాపకమన్నారు. గ్రాడ్యుయేట్ అయిన ప్రతి విద్యార్థి ప్రయాణంలో కాన్వొకేషన్ ఒక మైలు రాయి అన్నారు. మానవత్వం మెలగడానికి ప్రాథమిక విలువలు విధిగా పాటించాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా అన్ని ప్రోగ్రాంల పాఠ్యాంశాలను ప్రభుత్వం సవరించిందన్నారు. 2025 నాటికి 1.20 కోట్ల మంది నైపుణ్యం ఉన్న యువత అవసరమన్నారు. అందుకనుగుణంగా యూనివర్సిటీలు విద్యార్థులను నైపుణ్య వంతులుగా తీర్చిదిద్దాలని కోరారు. గోల్డ్ మెడల్స్, డిగ్రీ పట్టాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.
గోల్డ్ మెడల్స్, డిగ్రీ పట్టాలు అందజేత
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా అత్యధిక మార్కులు సాధించి గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్, రీసెర్చ్ స్కాలర్స్‌గా పట్టాలు పొందిన 18 మందికి 26 గోల్డ్ మెడల్స్, కాన్వొకేషన్ పట్టాలు అందించారు. వీరితో మరో 250 మంది గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌కు పట్టాలు అందించా రు.
1. పెనుమాల మనీషా, 2.దారా మాధవి, 3. ఎర్రగుడ్ల శ్రావ్యసుహిత్, 4. కారుమంచి వాసవి, 5. మూర్తి లోహిత (మూడు గోల్డ్ మెడల్స్), 6. షేక్ అఫ్సానా (మూడు గోల్డ్ మెడల్స్), 7. టాటా శ్రీనాథ్‌గౌడ్ (రెండు గోల్డ్ మెడల్స్), 8. పంచకట్ల జ్యోతి (రెండు గోల్డ్ మెడల్స్) 9. దేవరకొండ కల్పన, 10. పోలు అపర్ణ (రెండు గోల్డ్ మెడల్స్), 11. బొరిగి కిరణ్‌కుమార్, 12. రేవిల్ల వర్షిణి సాయిమమత, 13.తన్నీరు మల్లిక, 14. షేక్ ఫజులున్, 15. పోలిరెడ్డి శ్రీదేవి, 16.పల్నాటి సంధ్య (రెండు గోల్డ్ మెడల్స్), 17. పి.లిల్లీ, 18. గొల్లపల్లి సునీత అందుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎల్.విజయకృష్ణారెడ్డి, గవర్న ర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్‌పీ సిసోడి యా, కలెక్టర్ చక్రధర్‌బాబు, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ చైర్మన్ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, జేసీ హరేందిరప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ జాహ్నవి, అధికారులు, డీన్ లు, అధ్యాపకులు, గ్రాడ్యుయేట్‌లు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లు, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొన్నారు.
చదవండి: (ప్రేమ వివాహం.. సాంబశివరావు చెవికొరికి, కర్రలతో దాడి)
Comments
Please login to add a commentAdd a comment