విక్రమసింహపురి వర్సిటీ వెబ్ సైట్ హ్యాకింగ్
నెల్లూరు: నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన వెబ్‌సైట్‌ను కొందరు వ్యక్తులు శనివారం మధ్యాహ్నం నుంచి మరోసారి హ్యాక్ చేశారు. కొంత మంది విద్యార్థులు డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాల కోసం వీఎస్‌యూ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే పనిచేయలేదు. అయితే గూగూల్ కెళ్లి వీఎస్‌యూ రిజల్ట్స్ టైపు చేస్తే ఓపెన్ అవుతుంది. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. వీఎస్‌యూ అధికారులకు మాత్రం ‘సాక్షి’ సమాచారం ఇచ్చేదాక తెలియక పోవడం గమనార్హం.
పాకిస్థాన్‌కు చెందిన కొంత మంది వ్యక్తులు వీఎస్‌యూ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్లు తెలిసింది. పాకిస్థాన్ జిందాబాద్ అని, వెబ్‌సైట్‌కు సెక్యూరిటీ అనుకోవడం కేవలం మీ భ్రమని పోస్టు చేశారు. దీంతో పాటు ఈ నెల 14న దేశ వ్యాప్తంగా అనేక వెబ్‌సైట్‌లను హ్యాక్ చేస్తామని మెసేజ్ పెట్టారు. ఇదే వీఎస్‌యూ వెబ్‌సైట్‌ను గత నెల 30న పాకిస్థాన్‌కు చెందిన కొంతమంది హ్యాక్ చేశారు. అయితే వీఎస్‌యూ వెబ్‌సైట్‌పై సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. వెబ్‌సైట్‌ను బెంగళూరుకు చెందిన శ్రీవా టెక్నాలజీస్ సంస్థ నిర్వహణలో ఉంది. వీఎస్‌యూ వెబ్‌సైట్ హ్యాక్ విషయంలో వీఎస్‌యూ రిజిస్ట్రార్ శివశంకర్‌కు ఫోన్ చేయగా మాల్‌వేర్ ఇంజక్షన్ వైరస్ ఫైర్‌వాల్‌ను బ్లాక్ చేసినట్లు చెప్పారు. సంస్థ నిర్వాహకులకు ఈవిషయాన్ని తెలియజేసి వెబ్‌సైట్‌ను క్లోజ్ చేయించారని తెలిపారు.